గ్రేటర్‌ వాసూలు జాగ్రత్త.. ఆధార్‌ అనుసంధానించకపోతే రూ.5400 కట్టాల్సిందే!

Hyderabad: Deadline For 20KL Free Water To Aug 15 - Sakshi

నగరంలో ఉచిత నీటి సరఫరా పథకం

ఆధార్‌ అనుసంధానానికి ఆఖరు తేదీ ఈ నెల 15

లేని పక్షంలో తొమ్మిది నెలల నీటిబిల్లులు చెల్లించాల్సిందే

ఇప్పటివరకు అనుసంధానం చేసుకోని వారు 4.5 లక్షలు

నల్లా కనెక్షన్‌కు ఆధార్‌ లింక్‌ చేసుకున్నవారు 5.5 లక్షలు  

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో ఉచిత నీటిసరఫరా పథకానికి ఆధార్‌ నంబరును అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు ఈ నెల 15తో ముగియనుంది. మహానగర వ్యాప్తంగా సుమారు 10.80 లక్షల నల్లా కనెక్షన్లుండగా.. ఇప్పటివరకు సుమారు 5.5 లక్షల మంది తమ నల్లా కనెక్షన్‌ నంబరుకు ఆధార్‌ను జత చేసుకున్నారు. మరో 4.5 లక్షల మంది ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సి ఉంది. లేని పక్షంలో సదరు వినియోగదారులకు ఏకంగా తొమ్మిది నెలల నీటిబిల్లు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.600 నీటి బిల్లు చెల్లించేవారు ఏకంగా రూ.5,400 ఒకేసారి చెల్లించాల్సి ఉంటుందన్నమాట.

వీరే అత్యధికం.. 
నగరంలో అత్యధికంగా అపార్ట్‌మెంట్‌ వినియోగదారులు ఈ ప్రక్రియను పూర్తి చేసుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ప్రతీ అపార్ట్‌మెంట్‌లోని అన్ని ఫ్లాట్స్‌ యజమానులు అనుసంధానం చేసుకోవాల్సిందే. ఎవరైతే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారు నీటిబిల్లులు చెల్లించాల్సి వస్తుందని జలమండలి స్పష్టం చేసింది. నగరంలోని మురికి వాడల్లో (స్లమ్స్‌)ని నల్లా వినియోగదారులకు జలమండలి సిబ్బంది వారి ఇళ్ల వద్దకు వెళ్లి ఈ ప్రక్రియను పూర్తిచేస్తున్నారు. మిగతా గృహ వినియోగదారులు హైదరాబాద్‌ వాటర్‌ జీఓవీ.ఐఎన్‌ వెబ్‌సైట్‌లో సంప్రదించి సొంతంగా పూర్తిచేసుకోవడం లేదా సమీప మీ సేవ కేంద్రాల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసుకోవాలని వాటర్‌బోర్డు స్పష్టం చేసింది.  

గడువు పెంచినా.. మందగమనమే.. 
జీహెచ్‌ఎంసీ పరిధిలో నెలకు 20 వేల లీటర్ల ఉచిత తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం ఫ్రీ వాటర్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులందరూ తమ ఆధార్‌ నంబరును నల్లా కనెక్షన్‌కు జత చేసుకోవాల్సి ఉంటుంది. మురికివాడలు మినహా ప్రతి నల్లా కనెక్షన్‌కూ నీటిమీటరు తప్పనిసరి చేశారు. మీటరు ఉన్నప్పటికీ అది పనిచేయని స్థితిలో ఉంటే నీటి బిల్లు తథ్యం. ఈ ప్రక్రియకు ఇప్పటివరకు జలమండలి నాలుగుసార్లు గడువును పొడిగించినప్పటికీ పలువురు వినియోగదారులు నిర్లక్ష్యం వీడడంలేదు. 

అపార్ట్‌మెంట్ల వినియోగదారుల్లో పలువురు లాక్‌డౌన్, కోవిడ్‌ కారణంగా స్వస్థలాలకు వెళ్లడం, కొందరు విదేశాల్లో ఉండడం తదితర కారణాలన్నీ ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేసుకోకపోతుండడం గమనార్హం. ఈ నెల 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని జలమండలి వర్గాలు వినియోగదారులకు విజ్ఙప్తి చేస్తున్నాయి. ప్రతి నల్లాకూ నీటిమీటరును ఏర్పాటు చేసుకోవడంతో పాటు అది పనిచేసే స్థితిలో ఉందో తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top