హైదరాబాద్‌.. సేఫ్‌ సిటీ

Hyderabad City Is Safe For Small Earthquakes In Telangana - Sakshi

మన నగరం సురక్షితమైనదే. తీవ్ర భూకంపాలకు ఇక్కడ అవకాశాలు తక్కువే. బోరబండలో శుక్రవారం రాత్రి సంభవించింది అతి సూక్ష్మ ప్రకంపనలే. ఇది రిక్టర్‌ స్కేలుపై 1.5 మ్యాగ్నట్యూడ్‌ మాత్రమే రికార్డు అయ్యింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గతంలోనూ ఇక్కడ సూక్ష్మ భూ ప్రకంపనలు వచ్చాయి. ఇక్కడి ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నాం. కొన్నిచోట్ల సెస్మోగ్రాఫ్‌(భూకంప లేఖిని) యంత్రాలు ఏర్పాటు చేస్తున్నాం.  – ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు 

ఉప్పల్‌/జూబ్లీహిల్స్‌/వెంగళరావునగర్‌: నగరంలోని బోరబండలో శుక్రవారం రాత్రి వచ్చిన భూ ప్రకంపనలు చాలా సూక్ష్మమైనవే. రిక్టర్‌ స్కేలుపై 1.5 మ్యాగ్నట్యూడ్‌ మాత్రమే రికార్డు అయ్యిందని సీఎస్‌ఐఆర్‌–ఎన్‌జీఆర్‌ఐ చీఫ్‌ సైంటిస్టు డాక్టర్‌ శ్రీనగేష్‌ స్పష్టం చేశారు. ఎక్కడైతే భూ పొరల్లో పగుళ్లు, రాళ్లు ఒత్తిడులకు గురవుతాయో అక్కడే భూకంపాలు, ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు. భూమి పొరల్లోని కిలోమీటరు నుంచి రెండు కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు ఏర్పడితే మనకు శబ్ధాలు వినిపిస్తాయని, శబ్ధాలు వచ్చినప్పుడల్లా భయాందోళనకు గురికావడం సహజమేనన్నారు. అయితే ఎవ్వరూ దిగులు చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే... 

  • బోరబండలో భూ ప్రకంపనలు కొత్తేమీ కాదు. 2017లోనూ ఇదే తరహాలో ప్రకంపనలు వచ్చాయి. ఆ సమయంలో ఇక్కడ యంత్రాలు అమర్చి అధ్యయనం చేశాం. ఒకటి రెండు కిలోమీటర్ల లోపలే ప్రకంపనలు ఏర్పడ్డాయని గుర్తించాం. – శుక్రవారం రాత్రి బోరబండలో భూమి లోపలి పలకల మధ్య వచ్చిన ఒత్తిడిలు, రాళ్లలో పగుళ్ల కారణంగా ప్రకంపనలు జరిగి ఇలాంటి శబ్ధాలు వినిపించాయి.  
  • 1995–96లో కూడా జూబ్లీహిల్స్‌లో ఇలాంటి ప్రకంపనలే వచ్చాయి. 
  • గత 55 ఏళ్లుగా హైదరాబాద్‌ ఉప్పల్‌లోని ఎన్‌జీఆర్‌ఐ భూకంప క్షేత్రంలో ఏర్పాటు చేసిన యంత్రాలలో నమోదైన రికార్డులను అధ్యయనం చేయగా పెద్దగా చెప్పుకోదగ్గ భూకంపాలు నమోదు కాలేదు.  
  • మేడ్చల్‌లో మాత్రం 1985లో అత్యధికంగా రిక్టర్‌ స్కేలుపై 4.5గా నమోదు అయ్యింది.  
  • 2017 నుంచి  ఇప్పటి వరకు బోరబండలోనే దాదాపుగా 135 సార్లు ప్రకంపనలు వచ్చాయి. అవి కేవలం 0.5, 0.2 మధ్యలోనే వచ్చాయి.  
  • బోరబండలోనే భూప్రకంపనలు రావడానికి గల కారణాలను విశ్లేషిస్తే..ఇక్కడ భూమి పొరల్లో వత్తిడి ఎక్కువగా ఉంది. అందుకే ప్రకంపనలు వస్తున్నాయి. వీటితో ఎలాంటి ప్రమాదం లేదు. ఈ వర్షాకాలంలో అత్యధిక వర్షపాతం నమోదైనందున భూ పొరల్లో కూడా ఒత్తిడి, సర్దుబాట్లు వచ్చి ఇలాంటి ప్రకంపనలు వస్తున్నాయి. 

సేఫ్‌ భూకంపాలు అంటే.. 
సేఫ్‌ భూకంపాలు అంటే అతి సూక్ష్మ తీవ్రత గల ప్రకంపనలుగా గుర్తిస్తాం. ఈ ప్రకంపనల వల్ల ఆస్తినష్టం కానీ, ప్రాణ నష్టం కానీ జరగదు. కేవలం హిమాలయాల్లాంటి పర్యత శ్రేణుల్లో మాత్రమే పెద్ద పెద్ద భూకంపాలు నమోదవుతాయి. బోరబండలో కానీ హైదరాబాద్‌లో కానీ నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేదు. కానీ భూకంపాలను తట్టుకునే విధంగా నిర్మాణాలు సాగడం మరింత సురక్షితం.

మాట్లాడుతున్న ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు, డిప్యూటీ మేయర్‌
బోరబండలో సెస్మోగ్రాఫ్‌ల ఏర్పాటు  
బోరబండలో శనివారం నేషనల్‌ జియోగ్రాఫికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)కు చెందిన శాస్త్రవ్తేత్తల బృందం పర్యటించింది. బోరబండ ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్‌–3లోని సాయిబాబానగర్, ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్‌–4, సైట్‌–5లలోని జయవంత్‌నగర్, వెంకటేశ్వరకాలనీ, అంబేద్కర్‌నగర్, అన్నానగర్, పెద్దమ్మనగర్, ప్రభుత్వ నాట్కో ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాలతో పాటు చుట్టు పక్కన ఉన్న బస్తీల్లో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. వారి నుంచి వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు శేఖర్, నరేష్, సురేష్‌లు మాట్లాడుతూ ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఇక్కడ వచ్చింది సూక్ష్మ ప్రకంపనలేనని పేర్కొన్నారు.

భూమి లోపల శబ్దాలు రావడానికి గల కారణాలు తెలుసుకోవడానికి పరిశోధన సాగుతుందన్నారు. ఈ మేరకు నాట్కో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాయిబాబానగర్‌ కమ్యూనిటీహాల్, ఎన్‌ఆర్‌ఆర్‌పురం సైట్‌–4,5లకు చెందిన కమ్యూనిటీహాల్‌లో మొత్తం మూడు సెస్మోగ్రాఫ్‌ (భూకంపలేఖిని) పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 24 గంటల్లో పూర్తి సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల పర్యటనలో డిప్యూటీమేయర్‌ బాబాఫసియుద్దీన్,  ఖైరతాబాద్‌ తహశీల్దారు హసీనాబేగం, ఉప కమిషనర్‌ ఏ.రమేష్‌ ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top