హైదరాబాద్‌: కంచే చేను మేసింది.. బ్యాంక్‌ ఫ్రాడ్‌ కేసులో సిబ్బంది సహా పదిమందికి కఠిన శిక్షలు

Hyderabad Bank Fraud case: Ten persons Get rigorous imprisonment - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంచే చేను మేసింది. ఎవరూ గమనించలేదనుకుంది. కానీ, ఎట్టకేలకు పాపం పండింది. తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన ఓ బ్యాంక్‌ మేనేజర్‌తో పాటు పదిమంది దోషులకు న్యాయస్థానం కఠిన కారాగార శిక్షలు విధించింది. తొమ్మిదేళ్ల కిందటి నాటి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఫ్రాడ్‌ కేసులో బుధవారం ఎట్టకేలకు శిక్షలు ఖరారు చేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. 

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మోసం కేసులో పదిమందికి జైలు శిక్షలు ఖరారు అయ్యాయి. మొత్తం పది మంది దోషుల్లో ఐదుగురికి ఏడేళ్ల శిక్ష, నలుగురికి మూడేళ్ల శిక్ష, మిగిలిన ఒకరికి ఏడాదిశిక్ష ఖరారు చేసింది. శిక్షతో పాటు దోషులకు జరిమానా సైతం విధించింది. ఇక ఈ కేసులో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర నష్టానికి కారణమైన ఆరు కంపెనీలకు జరిమానా సైతం విధించింది.  ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై దాదాపు అయిదు కోట్ల రూపాయలు(రూ.4.57 కోట్లు) నకిలీ ఖాతాలకు మళ్లించిన స్కామ్‌ ఇది. 

ఈ కేసులో సికింద్రాబాద్‌ బ్రాంచ్‌ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీనియర్ మేనేజర్ శరత్ బాబు జెల్లీతో పాటు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సుహాస్‌ కళ్యాణ్‌ రామ్‌దాసి కూడా దోషులుగా నిర్దారణ అయ్యారు. మొత్తం పది మంది దోషులతో పాటు ఆరు కంపెనీలకు సైతం జరిమానా విధించింది సీబీఐ కోర్టు.  శరత్‌, సుహాస్‌లు ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై 2013 మార్చిలో.. సీబీఐ కేసు నమోదు చేసింది.

2012 -13 మధ్యకాలంలో.. దాదాపు రూ.5 కోట్లకు వర్కింగ్ క్యాపిటల్ లిమిట్‌లను మంజూరు చేయడం ద్వారా ఆ నిధులను మంజూరైన వాటి కోసం కాకుండా నకిలీ.. కల్పిత పత్రాలపై మళ్లించినట్లు తేలింది. తద్వారా బ్యాంక్‌కు నష్టం వాటిల్లింది. ఈ కేసులో 2014 ఆగష్టులో నిందితులపై చార్జిషీట్ దాఖలు చేసింది సీబీఐ. విచారణలో నిందితులను దోషులుగా నిర్ధారించి ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది సీబీఐ కోర్టు.

ఇదీ చదవండి: ఐటీ దాడుల్లో బయటపడ్డ రూ.100 కోట్ల నల్లధనం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top