Huzurabad: నాటి ఎదులాపురమే నేటి హుజూరాబాద్‌

Huzurabad Old Name Edulapuram, Its Has 2 Thousand Years History - Sakshi

హుజూరాబాద్‌కు రెండువేల ఏళ్ల చరిత్ర

ఔత్సాహిక పురావాస్తు

చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి 

సాక్షి, హుజూరాబాద్‌: హుజూరాబాద్‌కు రెండువేల ఏళ్ల చరిత్ర ఉందని ఔత్సాహిక పురావాస్తు చరిత్ర పరిశోధకుడు ఆర్‌.రత్నాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన పరిశోధనలో భాగంగా హుజూరాబాద్‌ రంగనాయకుల గుట్ట దిగువన ఎదులాపురం గ్రామాన్ని కనుగొన్నట్లు తెలిపారు. ఇక్కడ రెగ్యులర్‌గా కనిపించే రోళ్లకు భిన్నంగా ఉన్న వెడల్పాటి రోళ్లు, దంచి నూరడానికి ఉపయోగించిన రోకలి బండతో పాటు, అలంకరణకు ఉపయోగించే మట్టి పూసలు, ఇనుము, ఉక్కు పరిశ్రమ, కుండల పరిశ్రమ, పెద్ద పెద్ద ఇటుకులు, వీరుల విగ్రహాలు, నాగ దేవతలు, భైరవ శిల్పం, మొదలైన అనేక చారిత్రక ఆధారాలను గుర్తించినట్లు వివరించారు. హుజూరాబాద్‌ పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట పరిసర ప్రాంతాల్లో నవీన శిలాయుగం నుంచి మొదలు శాతవాహనులు, తర్వాత కాలంలో చోటుచేసుకున్న అనేక చారిత్రక ఆధారాలకు సంబంధించిన విశేషాలను బయటపెట్టారు. 

అరుదైన ‘పాటిగడ్డ’
రంగనాయకుల గుట్ట చుట్టూ పూర్వపు ఎదులాపురం గ్రామం ఉందని, సుమారుగా 80 ఎకరాల్లో పాటిమీద అని పిలిచే ఎత్తైన మట్టి దిబ్బ ఉండేదని, ఇంత విశాలమైన ‘పాటి గడ్డ’ చాలా అరుదని, ఈ ప్రదేశంలో ఇప్పుడు ఉన్నట్లే నాడు కూడా అన్ని వృత్తుల వారితో కలిసి జీవించిన పెద్ద గ్రామం ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దీనినే ఇప్పుడు హుజూరాబాద్‌ అని పిలుచుకుంటున్నట్లు తెలిపారు. ఇంత పెద్ద గ్రామానికి తాగు, సాగునీరు అందించిన ఏరు ప్రవాహం పాటి మీద నుంచి ప్రవహిస్తుందని, సమీపంలో నాగుల చెరువు కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అనేక వృత్తుల వారు జీవించిన ఇంత పెద్ద గ్రామానికి వైద్యులు కూడా అవసరమే అని, అందుకే ఇక్కడ సాధారణ రోళ్లకు భిన్నంగా పరుపు బండలపై వరుసగా మూడు రోళ్లు ఉన్నాయని, ఇవి లోతు తక్కువగా ఉండటంతో పాటు వెడల్పు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. వీటిని ఆయుర్వేద వైద్యం కోసం మందుల తయారీకి ఉపయోగించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.


రంగనాయకుల గుట్ట వద్ద లభించిన చిట్టెపు రాళ్లను చూపుతున్న రత్నాకర్‌రెడ్డి  

నూరడానికి, దంచడానికి ఉపయోగించే రోకలి బండ ఒకటి లభించగా, ఇటువంటి రోళ్లను గతంలో హనుమకొండలోని అగ్గలయ్య గుట్టపై గుర్తించినట్లు రత్నాకర్‌రెడ్డి తెలిపారు. పాటి మీద చిట్టెపు రాళ్లు దండిగా ఉన్నాయని, ఇనుమును సంగ్రహించి పోత పోసేటప్పుడు మిగిలిన వ్యర్థ పదార్థాలను చిట్టెపు రాళ్లు అంటారని అన్నారు. ఈ ప్రాంతంలో రెండు వేల ఏళ్ల కిందటే ఇనుము, ఉక్కు పరిశ్రమ ఉందని తన పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు. పంటలు పండించడంతో పాటు, ధాన్యం నిల్వ చేసిన పెద్ద పెద్ద కాగులు ఇక్కడ లభ్యమైనట్లు పేర్కొన్నారు. చక్రం మీద తయారు చేసి బాగా కాల్చిన నాణ్యమైన ఎరుపు, నలుపు, బూడిద, గోధుమ రంగు మట్టి పాత్రల ఆనవాళ్లు ఇక్కడ విస్తారంగా కనిపించాయన్నారు. మంచి ఆకృతి గల ఎరుపు రంగు మట్టి పూసలతో పాటు రంగు రాళ్లు కనిపించాయని, దీనిని బట్టి పెద్ద రాతియుగము నాటి నుంచి మొదలు ప్రజలు అలంకార ప్రియులనీ తెలుస్తోందని చెప్పారు.

పాటి మీద బరువైన పెద్ద పెద్ద ఇటుకలతో నిర్మాణాలు చేశారని, పై కప్పునకు గూన పెంకులు ఉపయోగించారని, వీటితో పాటు తేలికైన ఇటుకలు కూడా దర్శమిచ్చాయని వివరించారు. హనుమాన్‌ గుడి పక్కన గల పొలంలో ఓ వీరుడి విగ్రహం ఉందని, కాకతీయుల కాలంలో వీరుల ఆరాధన ఎక్కువగా కనిపిస్తుండటం విశేషమని, పాటి మీద పూర్వపు శిథిల ఆలయం, హనుమాన్‌ గుడి ఉందని, గుట్ట వెనుక నుంచి వెళ్లే దారి పక్కన గుట్ట కింద విడిగా ఉన్న ఒక బండకు భైరవ శిల్పాన్ని చెక్కారని వివరించారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారంతో పురావాస్తు శాఖ గతంలో ఇక్కడ రెండు కుండలను స్వాధీనం చేసుకుందని, ఇప్పటికీ పాటిగడ్డ అనేక చారిత్రక ఆధారాలతో నిండి ఉందన్నారు. పురావాస్తు శాఖ వారు ఇక్కడ తవ్వకాలు జరిపితే ఎన్నో చారిత్రక విషయాలు బయటపడే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top