వైఫైకీ కనిపిస్తాం! | Human movement detection will soon be possible even with ordinary WiFi signals | Sakshi
Sakshi News home page

వైఫైకీ కనిపిస్తాం!

Jun 4 2026 3:41 AM | Updated on Jun 4 2026 3:42 AM

Human movement detection will soon be possible even with ordinary WiFi signals

త్వరలో సాధారణ వైఫై సిగ్నళ్లతోనూ మనుషుల కదలికల గుర్తింపు 

అవతలి వ్యక్తి వద్ద స్మార్ట్‌ఫోన్‌ సహా సాంకేతిక పరికరాలేవీ లేకున్నా సాధ్యమే 

తమ పరిశోధనలు విజయవంతమయ్యాయన్న జర్మనీ సంస్థ కాస్టెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ 

వైఫై హ్యాక్‌ అయితే వ్యక్తిగత గోప్యతకు పెను ముప్పంటున్న సైబర్‌ నిపుణులు

ప్రస్తుతం ఓ వ్యక్తి ఉనికిని కనిపెట్టడానికి జీపీఎస్‌ట్రాకింగ్, సీసీ కెమెరాలు, ఫేషియల్‌ రికగ్నిషన్‌ వంటి సాంకేతికతలే అందుబాటులో ఉన్నాయి. కానీ త్వరలోనే సాధారణ వైర్‌లెస్‌ ఫిడెలిటీ (వైఫై) సిగ్నళ్ల ద్వారా కూడాకోరుకున్న వారి కదలికలను గుర్తించడం సాధ్యంకానుంది. దీనిపై తాము చేపట్టిన పరిశోధనలు విజయవంతమైనట్లు జర్మనీకి చెందిన కాస్టెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రకటించింది. బీమ్‌ఫార్మింగ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇన్ఫర్మేషన్‌ విధానంలో ఈ టెక్నాలజీ పనిచేస్తుందని పేర్కొంది.   – సాక్షి, హైదరాబాద్‌

ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుందంటే...
కాస్టెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు ఇటీవల ఈ సాంకేతికతను ప్రదర్శించారు. ఇందుకోసం కెమెరాలు, మైక్రోఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు సహా ఆ వ్యక్తి వద్ద ఎలాంటి ప్రత్యేక పరికరాలు ఉండాల్సిన అవసరం లేదు. వైఫై రూటర్‌ నుంచి నిరంతరం రేడియో తరంగాలు ప్రసారం అవుతుంటాయి. ఈ తరంగాలు అక్కడి గోడలు, ఫర్నీచర్, మనుషుల శరీరాలను తాకి తిరిగి ప్రతిఫలిస్తాయి. 

మనిషి శరీరంలో దాదాపు 60 శాతం నీరే ఉంటుంది. వైఫై రేడియో తరంగాలు నీటిని బలంగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఒక వ్యక్తి గదిలో నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, నిలబడి ఉన్నప్పుడు వైఫై సిగ్నల్‌లో చిన్నచిన్న మార్పులు ఏర్పడతాయి. ఈ మార్పుల ఆధారంగానే సిగ్నల్స్‌ మనుషుల్ని గుర్తిస్తాయి.

ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ ద్వారా ముందే ఫీడ్‌ చేస్తే...
ఏ వ్యక్తి కదలికల్ని, ఉనికిని కనిపెట్టాలని భావిస్తున్నారో వారి వివరాలను ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ ద్వారా వైఫై రూటర్‌లో పొందుపరచాలి. ప్రతి వ్యక్తి శరీర నిర్మాణం, ఎత్తు, బరువు, శరీర ఆకృతి, నడక తీరు, కదలికల నమూనాలు వేర్వేరుగా ఉంటాయి. ఆ వివరాలను సమగ్రంగా ప్రోగ్రామింగ్‌లో పొందుపరచాలి. ఆ వైఫై తరంగాలు ప్రతి వ్యక్తి శరీరాన్ని తాకినప్పుడు ఏర్పడే ప్రతిస్పందన కొద్దిగా భిన్నంగా ఉంటుంది. 

ఈ సూక్ష్మ తేడాలను ఏఐ ఆధారిత వ్యవస్థ విశ్లేషిస్తుంది. వేలాది నమూనాలను అధ్యయనం చేసిన తర్వాత సదరు ఏఐ వ్యక్తికి సంబంధించిన ప్రత్యేక ‘వైఫై సిగ్నేచర్‌’ను కొన్ని సెకన్లలోనే గుర్తించగలదు. ఏఐ వ్యక్తి ముఖాన్ని చూసే అవకాశం లేకపోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా నడక తీరు, అడుగుల వేగం, శరీర పరిమాణం, నిర్మాణం, చేతుల కదలికలు, భుజాల వెడల్పు, శరీర ఆకృతి ఆధారంగా విశ్లేషిస్తుంది.  

ఈ టెక్నాలజీతో మంచిచెడులు సైతం...
అత్యాధునిక వైఫై టెక్నాలజీ వినియోగించి ఒంటరి వృద్ధుల ఆరోగ్య పర్యవేక్షణ, ఆస్పత్రుల్లో రోగుల కదలికల పర్యవేక్షణ, స్మార్ట్‌ హోమ్‌ వ్యవస్థల ఏర్పాటు, భద్రతా వ్యవస్థల నిర్మాణం, కార్యాలయాల్లో అనధికార ప్రవేశాల గుర్తింపు తదితరాలను తెలుసుకొనే వీలుంటుందని పరిశోధకులు చెబుతున్నారు. 

ఓ వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా ఉంటే ఆయన అకస్మాత్తుగా పడిపోయాడా లేదా చాలా సేపు కదలకుండా ఉన్నాడా అనే విషయాన్ని కెమెరా లేకుండానే గుర్తించే అవకాశం ఉంటుంది. వాటితోపాటు ఓ కార్యాలయంలోకి ఎవరు, ఎప్పుడు వచ్చారో తెలుసుకోవడం, షాపింగ్‌ మాల్‌లో కస్టమర్ల కదలికలను ట్రాక్‌ చేయడం, ఒక భవనంలో నిర్దిష్ట వ్యక్తి ఉన్నాడో లేదో గుర్తించడం, బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తుల సంచారాన్ని పర్యవేక్షించడం సాధ్యంకానుంది.

అయితే రూటర్‌ను హ్యాక్‌ చేసినా, దాని తయారీదారు లేదా ఇంటర్నెట్‌ సేవలు అందించే సంస్థ రిమోట్‌ మేనేజ్‌మెంట్‌ సదుపాయాలను హ్యాకర్లు తమ అదీనంలోకి తీసుకున్నా... వ్యక్తిగత గోప్యతకు భంగం ఏర్పడుతుంది. ఇలా హ్యాకర్లు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూసే ప్రమాదం ఉందని సైబర్‌ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

రెండు రకాల డేటా ద్వారా కొలుస్తారు...
ఇలా గుర్తించడానికి ప్రధానంగా రెండు రకాల డేటా ఉపకరిస్తుంది. చానల్‌ స్టేట్‌ ఇన్ఫర్మేషన్‌ (సీఎస్‌ఐ)గా పిలిచే మొదటి డేటా.. వైఫై సిగ్నల్‌ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లేటప్పుడు ఎలాంటి మార్పులు చెందిందనే సమాచారం అందిస్తుంది. ఇలా ఓ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? నడుస్తున్నాడా? పరుగెడుతున్నాడా? కూర్చున్నాడా? అనే విషయాలను అంచనా వేస్తుంది. 

రెండోదైన బీమ్‌ ఫార్మింగ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇన్ఫర్మేషన్‌ అత్యంత కీలకమైంది. ఆధునిక వైఫై వ్యవస్థల్లో రూటర్, ఇతర పరికరాల మధ్య సిగ్నల్‌ నాణ్యతను మెరుగుపరచడానికి బీమ్‌ఫార్మింగ్‌గా పిలిచే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో మొబైల్‌ ఫోన్, ల్యాప్‌టాప్‌ వంటి పరికరాలు తమకు అందుతున్న సిగ్నల్‌ నాణ్యతపై సమాచారాన్ని రూటర్‌కు తిరిగి పంపుతాయి. దీనినే బీమ్‌ఫార్మింగ్‌ ఫీడ్‌బ్యాక్‌ ఇన్ఫర్మేషన్‌ అంటారు. 

ఈ సమాచారంలో కొంత భాగం తగిన రక్షణ లేకుండా ప్రసారం అవుతుంది. ఇలాంటి వాటి ద్వారా సమీపంలో ఉన్న మరో వ్యవస్థ ఈ డేటాను సేకరించి విశ్లేషించే అవకాశం ఉంది. ఆ విశ్లేషణ ద్వారా గదిలో ఎవరున్నారు, వారు ఎలా కదులుతున్నారు వంటి విషయాలను అంచనా వేయవచ్చు.   

Advertisement
 
Advertisement
Advertisement