‘నాటు’ టేస్టు.. విదేశాల్లో హిట్టు.. నోరూరించే పచ్చడి.. కమ్మని రుచికి కేరాఫ్‌ జగిత్యాల రైతు

Huge Demand For Country Chicken Pickle In foreign countries - Sakshi

మామిడితోటలో నాటుకోళ్ల పెంపకం 

పుంజు మాంసంతో పచ్చడి తయారీ 

రాష్ట్రంతో పాటు విదేశాల్లోనూ గిరాకీ 

జగిత్యాల అగ్రికల్చర్‌: ఎంత బ్రాయిలర్‌ కాలమైనా నాటు కోడి రుచే వేరు. అందుకే ఓ రైతు రొటీన్‌కు భిన్నంగా ఆలోచించారు.. అందరిలా కాకుండా నాటుకోళ్లు పెంచుతూ వాటి మాంసంతో పచ్చళ్లు తయారు చేస్తున్నారు. కమ్మని రుచితో అందరి మనసు దోచుకుంటున్నారు. ఆయన చేతి పచ్చళ్లు రుచి చూసిన గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులే కాదు.. అమెరికా, బ్రిటన్‌ లాంటి దేశాల్లో ఉండే మనవారు కూడా ఇక్కడ ఉండే తమ బంధువుల ద్వారా ఆర్డర్లపై ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. 

మామిడితోటలో నాటుకోళ్ల ఫారం 
జగిత్యాల జిల్లా రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన ఎడ్మల మల్లారెడ్డికి గ్రామ శివారులో ఐదెకరాల మామిడితోట ఉంది. అందులో రెండు షెడ్లు నిర్మించారు. ఒక్కో బ్యాచ్‌లో 500 నాటుకోళ్ల పెంపకం చేపట్టారు.

ఒక్కోటి 1.5 కేజీల నుంచి 2 కేజీల బరువు అయ్యే వరకూ దాణా అందిస్తున్నారు. పెట్టని కేజీకి రూ.400 చొప్పున వినియోగదారులకు నేరుగా విక్రయిస్తున్నారు. పుంజు మాంసంతో చికెన్‌ పకోడి వంటి ఆహార పదార్థాలు తయారు చేస్తూ వాటినీ నేరుగా వినియోగదారులకే అమ్ముతున్నారు. 

ఆర్డర్‌రాగానే..
మల్లారెడ్డి నాటుకోడి మాంసంతో తయారు చేసే ఆహార పదార్థాల్లో పచ్చడి అతి ప్రధానమైంది. కస్టమర్ల నుంచి ఆర్డర్‌ రాగానే పచ్చడి తయారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఇందుకోసం ముగ్గురు కూలీల సాయం తీసుకుంటున్నారు. పచ్చడి కోసం కోడి పుంజును వినియోగిస్తున్నారు.

గ్యాస్‌ వాడకుండా కట్టెల మీద కాల్చడం మరో విశేషం. బోన్‌లెస్‌ ముక్కలను ఉడికించి, నూనెలో వేపడం ద్వారా ప్రత్యేకంగా తయారు చేసుకున్న మసాలాలతో పచ్చడి తయారు చేస్తున్నారు.

పెరిగిన ఆర్డర్లు.. 
నాటుకోడి పచ్చడి రుచిచూసిన కస్టమర్లు.. తమ బంధువులు, స్నేహితుల కోసం ఆర్డర్లు ఇస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాలతోపాటు విదేశాల్లోని తమవారికీ పంపిస్తున్నారు. ఆర్డర్లు భారీగా వస్తుండటంతో మల్లారెడ్డి ఇతర రైతుల నుంచి కూడా కోడిపుంజులను హోల్‌సేల్‌గా కొనుగోలు చేస్తున్నారు. 

ఏదైనా కొత్తగా ఉంటేనే ఆదరణ 
ఏదైనా వినూత్నంగా ఆలోచించి వినియోగదారులను ఆకర్షించగలగాలి. అదే ఉద్దేశంతో నేను నాటు కోడి పచ్చడి తయారీ ప్రారంభించా. కోళ్లను నేరుగా విక్రయించే బదులు పచ్చడి తయారుచేసి అమ్మడం లాభదాయకం. ఇందులో శ్రమ ఉంటుంది, ఖర్చూ ఉంటుంది. అలాగే లాభమూ వస్తుంది.  
 –ఎడ్మల మల్లారెడ్డి 

బంధువులే తొలి కస్టమర్లు.. 
ఈ పచ్చడిని అరకిలో, కిలో చొప్పున ప్యాక్‌ చేస్తున్నారు. ఆరు నెలలుగా ‘ఏఎంఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫామ్‌’బ్రాండ్‌ పేరిట అర్ధకిలో రూ.700, కిలో రూ.1,400 చొప్పున విక్రయిస్తున్నారు. తొలుత బంధువులు, పరిచయస్తుల్లో ప్రాచుర్యం పొందింది. క్రమంగా వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. కావాలనుకున్న వారు ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేశాక ఒక్కరోజులోనే పచ్చడి తయారు చేసి అందజేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top