
కనిష్టం కంటే మూడు శాతం తక్కువ
పెంచే అవకాశమున్నా పట్టని అధికారులు
ప్రమాణాలకు అనుగుణంలేని రహదారులు.. ప్రయాణాలు సవ్యంగా లేక ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు.. పలుచోట్ల బాటిల్ నెక్.. అక్కడ ట్రాఫిక్ పీక్.. అధికారుల ఫ్లై‘ఓవర్ లుక్’.. రహదారుల విస్తీర్ణం తక్కువ.. వాహనాల సంఖ్య ఎక్కువ.. కరెంటు స్తంభాల రాస్తారోకో.. ట్రాఫిక్ విభాగం, జీహెచ్‌ఎంసీ మధ్య కొరవడిన సమన్వయం.. వెరసి హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ సమస్య (Traffic Problem) నిత్యకృత్యంగా మారింది. అవకాశమున్నా అవసరమైన మేర రహదారులు విస్తరించకపోవడం వాహనదారులకు శాపంగా మారిన వైనంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనమిది..
– సాక్షి, సిటీబ్యూరో
‘పెత్తనం ఒకరి చేతిలో... బెత్తం మరొకరి చేతిలో...’రాజధానిలోని ట్రాఫిక్‌కు ఈ సామెత సరిగ్గా సరిపోతుంది. రోడ్లపై ఉండి స్థితిగతులను పర్యవేక్షించేది ట్రాఫిక్ పోలీసులైతే... వాహన శ్రేణులు సవ్యంగా సాగడానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించే బాధ్యత మాత్రం జీహెచ్‌ఎంసీది. ఈ రెండింటి మధ్య సమన్వయలేమి కారణంగా ట్రాఫిక్ సమస్యలు తీరడం మిథ్యగా మారిపోయింది. నగరంలోని రోడ్ల విస్తీర్ణం, కనిష్టం కంటే తక్కువగా ఉన్న వైనం. పెంచే అవకాశం ఉన్నా పట్టించుకోని యంత్రాంగం వెరసి నగరవాసికి మాత్రం నిత్యం నరకమే కనిపిస్తోంది.
కనిష్ట స్థాయిలోనూ లేని రోడ్లు...
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం నగర విస్తీర్ణంలో కనిష్టంగా 12 శాతం రహదారులు ఉండాలి. హైదరాబాద్ పురాతన నగరం కావడంతోపాటు అనేక కారణాల వల్ల ఇక్కడ కేవలం 9 శాతం రోడ్లు ఉన్నాయి. ఫలితంగా ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా ట్రాఫిక్ జామ్‌లే. అడ్డంకులు తొలగిస్తే ఈ విస్తీర్ణాన్ని 15.5 శాతానికి పెంచుకునే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. కనిష్టం కంటే 3.5 శాతం ఎక్కువన్నమాట. అయితే దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఏళ్లుగా పంపిస్తున్న ప్రతిపాదనల్లో సగం వాటిని కూడా జీహెచ్‌ఎంసీ (GHMC) సహా అనే శాఖలు అమలు చేయకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే ఉంటున్నాయి.
60 లక్షల వాహనాలు... 40 ఫ్లైఓవర్లు..
ముంబై మహానగరంలో ఉన్న వాహనాల సంఖ్య 52 లక్షలైనా అక్కడున్న ఫ్లైఓవర్ల సంఖ్య మాత్రం 55. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 60 లక్షలకు చేరుతున్నా ఫ్లైఓవర్లు 40 మాత్రమే ఉన్నాయి. మరో పురాతన నగరమైన కోల్‌కతా (Kolkata) సైతం గతంలో అస్తవ్యస్త ట్రాఫిక్‌తో ఎన్నో ఇబ్బందులు పడేది. అక్కడి రోడ్ల విస్తీర్ణం కేవలం ఆరు శాతం ఉండటమే అందుకు కారణం.

ఆ తర్వాత అక్కడ ఫ్లైఓవర్లను అవసరమైన స్థాయిలో నిర్మించడం ద్వారా రోడ్ల విస్తీర్ణం 12 శాతానికి పెరిగింది. నగర ట్రాఫిక్ విభాగం అధికారులు 2007లో సర్వే నిర్వహించి జీహెచ్‌ఎంసీకి నివేదిక పంపారు. దీని ప్రకారం నగరంలోని 30 ప్రాంతాల్లో 17.83 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్లు నిర్మిస్తే రోడ్ల విస్తీర్ణాన్ని పెంచవచ్చని తేల్చారు. ఈ ఫ్లైఓవర్లు జంక్షన్స్ జామ్ కాకుండా కూడా ఉపకరిస్తాయని నివేదించారు. అయితే ఇప్పటికీ వీటిలో కనీసం సగం ప్రతిపాదనలు కూడా అమలుకాలేదు.
బాటిల్ నెక్.. ట్రా‘ఫికర్’కు ఏదీ చెక్..
నగరంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న నేచురల్ బాటిల్ నెక్స్‌తో ఇబ్బందులు అనేకం. భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడిన వీటి వల్లా ఎన్నో ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. రాణిగంజ్‌లోని సయిదానిమ సమాధి సమీపంలో, ఎస్సార్ నగర్–ఈఎస్‌ఐ, చాదర్‌ఘాట్–మలక్‌పేట్ మార్గాల్లో ఇలాంటివి అనేకం ఉన్నాయి. నగర వ్యాప్తంగా ఇలాంటి బాటిల్‌నెక్స్ (bottlenecks) సంఖ్య 26 ఉండగా... చాలా తక్కువ మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. ట్రాఫిక్ విభాగం అధికారులు, జీహెచ్‌ఎంసీ కలిసి పనిచేయడంతో శ్యామ్‌లాల్ నాలా సహా అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి. మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విభాగాలు సమష్టిగా ముందుకు వెళ్లాలి. నేచురల్ బాటిల్‌నెక్ సమస్యలను పరిష్కరించడం ద్వారా అదనంగా 2 శాతం రోడ్లను విస్తరించవచ్చు.

సమన్వయం లేక కరెంట్ ‘షాక్’...
రాజధానిలోని అనేక ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ పూర్తయినా ఫలితం లేకుండా పోయింది. ఆయా చోట్ల రోడ్ల విస్తీర్ణం పూర్తి అయినా ఒకప్పుడు రోడ్డు పక్కన ఉండి, విస్తర్ణం కారణంగా రోడ్లపైకి వచ్చిన కరెంట్ స్తంభాలతో ఈ పరిస్థితి తలెత్తింది. కొత్తగా రోడ్లు వేసిన చోట, పాత రహదారుల్లోనూ అనేక చోట్ల ఈ సమస్య ఉంది. విద్యుత్, జీహెచ్‌ఎంసీ విభాగాలు సమన్వయంతో పని చేయకపోవడమే దీనికి కారణం. వీటితోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు అడ్డదిడ్డంగా ఉండటంతో దాదాపు 50 మార్గాలు కుంచించుకుపోయాయి. జీహెచ్‌ఎంసీతోపాటు ఆయా విభాగాలు స్పందిస్తే మరికొంత రోడ్డును అదనంగా విస్తరించుకోవచ్చు.
‘అవసరమైనప్పుడే’ స్పందన...
ఇలాంటి సమస్యలపై జీహెచ్‌ఎంసీ సహా ఇతర విభాగాలు ప్రజల ఇబ్బందులు తీర్చడం కంటే ‘అవసరమైనప్పుడు’మాత్రమే అప్రమత్తమై ఎక్కువగా స్పందిస్తాయి. 2012లో జరిగిన ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ కాన్ఫరెన్స్, 2017లో ఇవాంక ట్రంప్ టూర్, ఇటీవల జరిగిన మిస్ వరల్డ్ (Miss World 2025) పోటీలు వంటి సందర్భాల్లో మాత్రం హడావుడి చేశాయి. అతిథులకు ఇక్కడి రోడ్లకు లేని ‘అందాలను’ చూపాలని ప్రయత్నిస్తుంటాయి.
చదవండి: ‘మా మేడమ్ మాకే కావాలి.. మేడమ్ మీరు వెళ్లొద్దు’
డెలిగేట్స్ బస చేసే హోటళ్లు, కార్యక్రమాలు జరిగే ప్రాంతాల మధ్య ఉన్న రోడ్లను కూడా అభివృద్ధి చేసేస్తాయి. దీనికోసం బాటిల్‌నెక్స్, ఇతర అడ్డంకులను తొలగించేస్తాయి. అవసరమైతే మ్యాన్‌హోల్స్ సమాచారం సైతం సేకరించి అభివృద్ధి చేసేస్తాయి. దేశ, విదేశాల అతిథుల కోసం చూపించిన ‘ప్రేమ’ను కొనసాగిస్తూ తమకు ఈ చిక్కుల నుంచి విముక్తి ప్రసాదించాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించాలని నగరవాసులు, వాహనదారులు కోరుతున్నారు.