‘ద్రాక్ష’కు పూర్వ వైభవమే లక్ష్యం

Horticulture Department Preparing To Bring Grape Cultivation In Telangana - Sakshi

ఏటా వెయ్యి ఎకరాల సాగుకు ఉద్యానవనశాఖ కార్యాచరణ 

ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలపై దృష్టి  

గజ్వేల్‌: రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఉద్యానవనశాఖ సిద్ధమవుతోంది. ఒకప్పుడు ద్రాక్షకు హబ్‌గా ఉన్న ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలతోపాటు సాగుకు అనుకూలంగా ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో రైతులను ప్రోత్సహించేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇందులో సిద్దిపేట జిల్లా ములుగు కొండాలక్ష్మణ్‌ బాపూజీ ఉద్యానవర్సిటీ కీలకంగా వ్యవహరించనుంది. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో శనివారం నిర్వహించిన సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

గతంలో 50వేల ఎకరాల్లో సాగు.. 
రాష్ట్రంలో ద్రాక్ష సాగుకు ఒకప్పుడు ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాలే ఆధారం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనూ కొంత సాగయ్యేది. ఏటా 50వేల ఎకరాలకుపైగా తోటల్లో పండేది. ద్రాక్ష గజ్వేల్‌ సాగులో సింహభాగాన్ని ఆక్రమించేది. సీడ్‌లెస్‌ థామ్సన్, తాజ్‌గణేష్‌ రకాలను ప్రధానంగా సాగుచేసేవారు. విదేశాలతోపాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి అయ్యేది.

ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ద్రాక్ష రైతులు కోట్లలో నష్టపోయారు. దీంతో అక్కడ సాగు కనుమరుగైంది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కొండపాక మండలం కుకునూర్‌పల్లిలో రవీందర్‌రెడ్డి అనే రైతు, విశ్వనాథపల్లిలో ధర్మారెడ్డితోపాటు జిల్లాలోని మరో 10మంది రైతులు కలిసి 88ఎకరాల్లో సాగు చేస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు ప్రస్తుతం మహారాష్ట్ర నుంచి ద్రాక్ష దిగుమతి అవుతోంది. 

సాగు పెంపునకు ఏం చేద్ధాం? 
రాజేంద్రనగర్‌లోని ఉద్యానవన కళాశాలలో జరిగిన మేధోమథన సదస్సులో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ నీరజాప్రభాకర్, ఉద్యాన శాఖ కమిషనర్‌ వెంకట్రామ్‌రెడ్డి, వైఎస్సార్‌హెచ్‌యూ మాజీ చాన్స్‌లర్‌ డాక్టర్‌ శిఖామణి, జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ డైరెక్టర్‌ సోమ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఏటా వెయ్యి ఎకరాల్లో ద్రాక్ష సాగు, అధిక దిగుబడి రకాలు, కొత్త వంగడాలపై రైతులకు అవగాహన తదితర అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. పుణేలోని జాతీయ ద్రాక్ష పరిశోధనా సంస్థ సహకారంతో లాభసాటి రకాల వృద్ధి, సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యంగా ప్రణాళిక చేశారు. ఇది కొద్ది రోజుల్లోనే కార్యరూపం దాల్చనుందని ములుగు వర్సిటీ రిజిస్ట్రార్‌ భగవాన్‌ ‘సాక్షి’కి చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top