TSPSC: పేపర్‌ లీక్‌లో కొత్త కోణం.. ఉద్యోగికి హానీట్రాప్‌!

Honeytrap For Praveen In TSPSC Paper Leak Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారింది. అయితే, పేపర్‌ లీక్‌ ఎపిసోడ్‌లో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. ఈ క్రమంలో హ్యాకింగ్‌ జరగలేదని నిర్ధారణ అయ్యింది. అయితే, కమిషన్‌కు చెందిన ఓ ఉ‍ద్యోగి.. ఓ యువతి కోసం పేపర్‌ లీక్‌ చేసినట్టు సమాచారం. 

వివరాల ప్రకారం.. పేపర్‌ లీకేజీ ఘటన కేసు దర్యాప్తులో హానీట్రాప్‌ జరిగినట్టు తెలుస్తోంది. టీఎస్‌పీఎస్సీ ఆఫీసుకు ఇటీవల తరచుగా ఓ యువతి రావడాన్ని గమనించారు. ప్రవీణ్‌ కోసం సదరు యువతి తరచూ వస్తూ ఆఫీసులో కలుస్తోంది. సదరు యువతి.. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈ క్రమంలో తనకు పేపర్‌ ఇవ్వాలని కోరింది. ఈ నేపథ్యంలో ఆమె కోసం పేపర్‌ లీక్‌ చేసినట్టు గుర్తించారు. యువతి కోసం టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌ లీకేజీ జరిగిందని అధికారులు నిర్ధారించారు. దీంతో, నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

పరీక్షలు వాయిదా..
టౌన్‌ప్లానింగ్, పశు సంవర్థక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలను టీఎస్‌పీఎస్సీ పరీక్షను వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించిన సమాచారం బయటకు పొక్కిందనే అనుమానంతో కమిషన్‌ ముందుజాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 12న రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. పరీక్ష నిర్వహణకు ముందే దానికి సంబంధించిన సమాచారాన్ని, పరీక్ష తీరును క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్‌ ఫోన్‌ నంబర్లకు ఆదివారంనాటి పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. దీంతోపాటు ఈ నెల 15, 16వ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం రాత్రి కమిషన్‌ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top