నాలుగో నగరి భవిష్యత్‌.. మూడో నగరిలో | HMDA takes over responsibility for FCDA Master Plan | Sakshi
Sakshi News home page

HMDA: నాలుగో నగరి భవిష్యత్‌.. మూడో నగరిలో

Jun 9 2025 5:26 PM | Updated on Jun 9 2025 5:37 PM

HMDA takes over responsibility for FCDA Master Plan

ఫ్యూచర్‌సిటీ ఆఫీసు నానక్‌రాంగూడలో..

ఇప్పటికీ అడుగు పడని ప్రాజెక్టులు

కేవలం స్కిల్‌ వర్సిటీకే పరిమితం..

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డుకు కోర్టు బ్రేక్‌

ఫోర్త్‌ సిటీని వేధిస్తున్న సిబ్బంది కొరత

మాస్టర్‌ ప్లాన్‌ దిశగా పడని అడుగులు

ఎఫ్‌సీడీఏ మాస్టర్‌ ప్లాన్‌ బాధ్యత హెచ్‌ఎండీఏ చేతికి..  

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్‌ సిటీ’ భవిష్యత్‌ మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కి అన్నట్లు మారింది. 330 అడుగుల గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డు, మెట్రోరైలు, ఏఐ సిటీ, జపాన్, తైవాన్‌ కంపెనీలు అంటూ రోజుకో ప్రకటనతో సర్కారు ఊదరగొడుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం స్కిల్‌ యూనివర్సిటీ మినహా మరే ప్రాజెక్టుకు ప్రతిపాదిత నాలుగో నగరిలో పునాది రాయి కూడా పడకపోవడం.. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీని ఏర్పాటు చేస్తూ రెండు నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ సిబ్బందిని కూడా సమకూర్చుకోకపోవడం చూస్తే.. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 

కడ్తాల్, కందుకూరు, యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, ఆమన్‌గల్, మహేశ్వరం మండలాల్లోని 56 గ్రామాలను ఎఫ్‌సీడీఏ పరిధిలోకి తెచ్చారు. అయితే.. ఈ గ్రామాల అభివృద్ధిని క్షేత్రస్థాయి నుంచి పర్యవేక్షించాల్సిన ఎఫ్‌సీడీఏ ఆఫీసు మాత్రం మూడో నగరమైన (సైబరాబాద్‌) నానక్‌రాంగూడలో ఏర్పాటు చేయడం గమనార్హం.  

సీఎం కలల ప్రాజెక్టు.. 
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కలల ప్రాజెక్టు బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. అధికారంలోకి రాగానే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ తరహాలో ఫోర్త్‌ సిటీ అవసరమని రేవంత్‌ ప్రకటించారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జాతీయ రహదారుల మధ్యలో ఫ్యూచర్‌ సిటీని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించి ఏడాది గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. పూర్తి స్థాయి సిబ్బంది లేకపోవడంతో అభివృద్ధి పనుల్లో పురోగతి కనిపించడం లేదు. 

రావిర్యాల ఓఆర్‌ఆర్‌ ఎగ్జిట్‌ నుంచి ఆకుతోట పల్లి వరకు 330 అడుగుల రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి భూ సేకరణ పనులు చురుగ్గా సాగగా.. పరిహారం ఇవ్వకుండానే నిర్మాణ పనులకు టెండర్లు పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించడంతో బ్రేక్‌ పడింది. దీంతో ఇప్పటివరకు ఈ ప్రాంతంలో కేవలం స్కిల్‌ వర్సిటీ పనులు మాత్రమే కాస్తో కూస్తో సాగుతున్నాయని చెప్పవచ్చు.  

సిబ్బంది కొరత.. 
765.28 చదరపు కి.మీల విస్తీర్ణంలో ఫోర్త్‌ సిటీని అభివృద్ధి చేయాలన్నది రేవంత్‌ సర్కార్‌ లక్ష్యం. ఎఫ్‌సీడీఏ ప్రధాన కార్యాలయం నానక్‌రాంగూడలోని ఉంది. వివిధ విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై 90 పోస్టులకు గత మార్చిలో మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. వీటిలో 34 రెగ్యులర్‌ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్‌ సోర్సింగ్‌/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. కానీ.. ఇప్పటివరకు ఎఫ్‌సీడీఏ కమిషనర్‌ శశాంక మినహా పూర్తిస్థాయి సిబ్బంది నియామకం జరగలేదు. సిబ్బంది కొరతతో ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ ఇతర విభాగాల నుంచి డెప్యుటేషన్‌పై ఎఫ్‌సీడీఏ ప్లానింగ్‌ విభాగంలో పనిచేసేందుకు అధికారులు నిరాసక్తి చూపిస్తున్నారు. దీంతో ఎఫ్‌సీడీఏ మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనలో ఎలాంటి పురోగతి లేదు.

మాస్టర్‌ ప్లాన్‌ హెచ్‌ఎండీఏదే.. 
ఫోర్త్‌సిటీలో ఐటీ, పారిశ్రామిక, ఆతిథ్య, పర్యాటక, క్రీడారంగాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు దేశ, విదేశీ సంస్థలు, పెట్టుబడులు తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఫ్యూచర్‌ సిటీ నిర్మాణానికి ప్రతిబంధకాలు రాకుండా, అభివృద్ధి పనులు ప్రణాళికబద్ధంగా చకచకా సాగేలా ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిచాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) అప్పగించినట్లు ఓ అధికారి తెలిపారు.

చ‌ద‌వండి: హైద‌రాబాద్‌లో మ‌రో ఉప ఎన్నిక‌! 

గతంలో సైబరాబాద్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (సీడీఏ), ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ప్లాన్‌ (ఏఏపీ) మాస్టర్‌ ప్లాన్లను హెచ్‌ఎండీఏనే అభివృద్ధి చేసిందని ఆయన గుర్తు చేశారు. అలాగే ఎఫ్‌సీడీఏ (FCDA) పరిధిలోని గ్రామాలు గతంలో హెచ్‌ఎండీఏ (HMDA) పరిధిలోనే ఉన్నాయని, అందుకే ఎఫ్‌సీడీఏ మాస్టర్‌ ప్లాన్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తోందని ఆయన వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement