వారి విడుదలకు చర్యలు తీసుకోండి: హైకోర్టు

High Court Order To Legal Services Authority To Take Action Release Prisoners - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హత్యలాంటి తీవ్రమైన నేరాల్లో కాకుండా ఇతర నేరాల్లో న్యాయ స్థానాలు బెయిల్‌ మంజూరు చేసినా పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక జైళ్లలోనే మగ్గిపోతున్న విచారణ ఖైదీల విడుదలకు చర్యలు తీసుకోవాలని జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీలను హైకోర్టు ఆదేశించింది. ఆయా కోర్టుల్లో పిటిషన్లు వేయాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావలిల ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది.

తమ ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలను వివరిస్తూ నివేదిక సమర్పించాలని పేర్కొంటూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కు వాయిదా వేసింది. బెయిల్‌ మంజూరైనా పేదరికంతో పూచీకత్తు మొత్తాన్ని చెల్లించలేక రాష్ట్రవ్యాప్తంగా 180 మంది కొన్ని నెలలుగా జైళ్లలో మగ్గుతున్నారని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ మురళి కరణం దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది.

పూచీకత్తు చెల్లించలేని కారణంగా విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గిపోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిందని పిటిషనర్‌ తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. సొంత పూచీకత్తుపై వీరిని విడుదల చేసేలా ఆదేశించాలని అభ్యర్థించారు. పూచీకత్తు చెల్లించలేని విచారణ ఖైదీలను గుర్తించి వారి విడుదలకు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర లీగల్‌ సర్వీస్‌ అథారిటీ తరఫున న్యాయవాది అనిల్‌కుమార్‌ నివేదించారు. స్పందించిన ధర్మాసనం.. జిల్లాల లీగల్‌ సర్వీస్‌ అథారిటీల సహకారంతో ఇలాంటి వారి విడుదలకు చర్యలు తీసుకోవాలలని ఆదేశించింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top