కౌంటర్‌ దాఖలు చేయండి | Sakshi
Sakshi News home page

కౌంటర్‌ దాఖలు చేయండి

Published Fri, Apr 7 2023 4:28 AM

High Court notices to Sarkar on Bandi sanjay arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు అక్రమం అని, హనుమకొండ కోర్టు ఇచ్చిన డాకెట్‌ ఆర్డర్‌ను కొట్టివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు గురువారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

అయితే కింది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునేందుకు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. అక్కడ బెయిల్‌ రాకుంటే హైకోర్టులో హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బండి సంజయ్‌ను అరెస్టు చేసిన పోలీసులు హనుమకొండ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచిన విషయం తెలిసిందే.

విచారణ తర్వాత బండికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ మేజిస్ట్రేట్‌ తీర్పునిచ్చారు. దీన్ని సవాల్‌ చేస్తూ సంజయ్‌ గురువారం లంచ్‌మోషన్‌ రూపంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై మధ్యాహ్నం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపించారు.  

సంజయ్‌కు వ్యతిరేకంగా ఆధారాల్లేవు..  
‘సుప్రీంకోర్టు, హైకోర్టు పలు ఉత్తర్వుల్లో చెప్పినా.. పోలీసులు 41ఏ నోటీసులు ఇవ్వకుండానే సంజయ్‌ను రాత్రి 12 గంటల సమయంలో అరెస్టు చేశారు. కరీంనగర్‌లో అరెస్టు చేసి నేరుగా హనుమకొండకు తరలించకుండా, బొమ్మల రామారం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల పేరిట బొమ్మలరామారం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ హనుమకొండకు తీసుకొచ్చారు. వేధింపులకు గురిచేయాలనే ఉద్దేశంతోనే దాదాపు 300 కిలోమీటర్లు ఆయన్ను తిప్పారు. ఎక్కడి తీసుకెళుతున్నారు? ఎందుకు తిప్పుతున్నారో కూడా బండికి చెప్పలేదు.

మరోవైపు పేపర్‌ లీకేజీపై పోలీసులు నమోదు చేసిన రిమాండ్‌ రిపోర్టులో సంజయ్‌ నేరం చేసినట్లు పేర్కొనలేదు. ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవు. మంగళవారం రాత్రి అరెస్టు చేస్తే.. బుధవారం సాయంత్రం వరకు మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. పార్లమెంట్‌ సమావేశాలకు ఎంపీ బండి హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో హనుమకొండ మేజిస్ట్రేట్  ఇచ్చిన డాకెట్‌ ఆర్డర్‌ కొట్టివేయాలి. తక్షణమే సంజయ్‌ను విడుదల చేయాలి..’అని రామచందర్‌ రావు వాదించారు. 

మొబైల్‌ ఫోన్‌ ఇస్తే మరిన్ని వివరాలు 
‘బండి మొబైల్‌ ఫోన్‌ నుంచి ఇతర నిందితుల ఫోన్‌కు వాట్సాప్‌ మెసేజ్‌ల బదిలీ జరిగింది. పేపర్‌ లీకేజీ జరిగేలా ఆయన ప్రోత్సహించారన్న సమాచారం ఉంది. మొబైల్‌ ఫోన్‌ ఇస్తే వివరాలన్నీ తెలుస్తాయి. ఆధారాలు లభ్యమవుతాయి. పేపర్‌ లీక్‌ అయి ఆయనకు వచ్చిన మెసేజ్‌ను ఎంపీ పలువురికి పంపించారు’అని ఏజీ పేర్కొన్నారు. ‘ఒకసారి ప్రజా బహుళ్యంలోకి వివరాలు వచ్చాక అవి ఎవరు ఎవరికైనా పంపొచ్చు కదా..?’అని సీజే ప్రశ్నించారు. అయితే ఎంపీగా ఉన్న సంజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయాలే గానీ, ఇతరులకు పంపడం సరికాదని ఏజీ నివేదించారు.  

‘హెబియస్‌ కార్పస్‌’లోనూ నోటీసులు.. 
బండి సంజయ్‌ అరెస్టుపై బీజేపీ భాగ్యనగర్‌ అధ్యక్షుడు దాఖలు చేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌పై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర సర్కార్‌కు నోటీసులు జారీచేసింది.నాలుగు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.   

Advertisement
Advertisement