కరీంనగర్: ఫోన్ల ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ విచారణ అనేది సీరియల్‌లా సాగుతోందని బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా సాగిందని తాను ముందే చెప్పానని, ఆనాడు అధికారులు పట్టించుకోలేదన్నారు. అసలు ఫోన్ ట్యాపింగ్ చేశారని హరీష్, కేటీఆర్‌ను విచారణకు పిలిచారా.. లేక వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయని పిలిచారా?అంటూ సెటైర్లు వేశారు బండి సంజయ్.
‘కేసీఆర్ కొడుకు యువరాజులా ఆడిందే ఆటగా నడుస్తుంటే, మేం మొత్తుకుంటే నాడు అధికారులు పట్టించుకోలేదు. సినిమా యాక్టర్స్, పారిశ్రామికవేత్తల ఫోన్స్ ట్యాప్ చేశారు. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రే చెప్పిండు కేసీఆర్ కుటుంబం ట్యాపింగ్‌కు పాల్పడింది. ఒక్కరిని కూడా ఇప్పటివరకూ సిట్ అరెస్ట్ చేయలేకపోయింది. ప్రభాకర్ రావు వ్యవహారం ఎలా సాగుతుందో చూస్తున్నాం.
సిట్ సాధించిందేమిటో చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రే అంటాడు తన ఫొన్ ట్యాప్ చేశారని. కానీ చర్యలు ఉండవు.కవిత ట్యాప్ అయినట్టు చెప్పింది, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది. భిక్షాటన చేసేవాళ్లు కూడా కేసిఆర్ హయాంలో ఫోన్ మాట్లాడేందుకు భయపడ్డారు. ఈ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ము లేదు. సిట్ అధికారులకు స్వేచ్ఛ ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.


