రోడ్లపై వాహన వరద!

Heavy Traffic Jam On Hyderabad Roads - Sakshi

రాష్ట్ర రహదారులపై పోటెత్తుతున్న వాహనాలు

ఎటు చూసినా ట్రాఫిక్‌ జామ్‌లు.. కి.మీ. కొద్దీ బారులు

7 నెలల్లో భారీగా సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల విక్రయం

వర్క్‌ ఫ్రం హోం, విద్యాసంస్థలకు సెలవున్నా సిటీలో భారీగా ట్రాఫిక్‌

సమస్య పెరిగే అవకాశం.. ఇది ప్రమాదమేనంటున్న పర్యావరణవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని రహదారులపై వాహన వరద పారుతోంది.. రోడ్లపై హారన్‌ సౌండ్‌ చేయనిదే బండ్లు ముందుకు నడిచే పరిస్థితి కనిపించటం లేదు.. 7 నెలల్లో కొత్తగా 4.39 లక్షల ద్విచక్ర వాహనాలు, 89 వేల కార్లు.. ఇటు సెకండ్‌ హ్యాండ్‌వి 2.52 లక్షల వాహనాలు.. వీటికి తోడు అప్పటికే ఇళ్లలో ఉన్న సొంత వాహనాలు.. మొత్తం అన్నీ రోడ్లపైకి పోటెత్తాయి.. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌లు, కి.మీ.ల కొద్దీ వాహనాల బారులే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా జంట నగరాలు లాక్‌డౌన్‌కు ముందుకంటే ఎక్కువ ట్రాఫిక్‌ సమస్యతో ఇప్పుడు సతమతమవుతున్నాయి. 10 కి.మీ. ప్రయాణానికే పీక్‌ అవర్స్‌లో గంటన్నర సమయం పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ తెచ్చిన మార్పులెన్నో.. ఈ వాహన వరద కూడా దాని ప్రభావమే..! 

వ్యక్తిగత వాహనాలు సురక్షితమని..
కోవిడ్‌ అనగానే భౌతిక దూరం ముందుగా గుర్తుకొస్తుంది. బహిరంగ ప్రదేశాల్లో మనిషికి మనిషికి మధ్య దూరం లాక్‌డౌన్‌ సమయంలో మరింత ఎక్కువగా ఉండేది. అప్పట్లో కోవిడ్‌ అంటే కనిపించిన భయం అంతా ఇంతా కాదు. దీంతో భౌతిక దూరం పాటించే ఉద్దేశంతో ప్రయాణాల్లో వ్యక్తిగత వాహనాల వినియోగంపై జనం దృష్టి సారించారు. అలా వాటి వరద మొదలైంది. ఆ తర్వాత క్రమంగా కోవిడ్‌ భయం మటుమాయమైంది. ప్రస్తుతం మాస్క్‌ వాడేవాళ్ల సంఖ్య కూడా తక్కువైపోతోంది. ఇక వ్యాక్సిన్‌ కూడా అందుబాటులోకి రావటంతో జనంలో ఆ మహమ్మారి భయం దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. బజార్లలో భౌతిక దూరం ఊసే లేదు. పెళ్లిళ్లు, పేరంటాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మరి భయం పూర్తిగా మటుమాయమైనా.. భౌతికదూరం కోసం వ్యక్తిగత వాహనాల వినియోగానికి అలవాటు పడ్డ జనం మాత్రం వెనక్కు రావటం లేదు. లాక్‌డౌన్‌లో మొదలైన వ్యక్తిగత వాహన వినియోగం ఇంకా కొనసాగటమే కాదు, మరింతగా పెరుగుతోంది.

బస్సెక్కేందుకు ససేమిరా.. 
లాక్‌డౌన్‌ సమయంలో 2 నెలల పాటు బస్సులు తిరగలేదు. ఆ తర్వాత అవి క్రమంగా రోడ్డెక్కాయి. కానీ జనం మాత్రం బస్కెక్కేందుకు ససేమిరా అంటున్నారు. 2 నెలల క్రితం వరకు కూడా 50 శాతం లోపే ఉన్న ఆక్యుపెన్సీ రేషియో అతికష్టమ్మీద 65కు చేరుకుంది. ఎప్పుడూ ఫుట్‌బోర్డుపై జనం వేళ్లాడుతుండటంతో ఓ పక్కకు ఒరిగినట్టుగా పరుగుపెట్టే సిటీ బస్సులు.. ఇప్పుడు సగం సీట్లు ఖాళీగానే ఉండి నీరసంగా నడుస్తున్నాయి. ఇటు జనం దెబ్బకు ఏసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరపట్టణాలకు తిరిగే ఏసీ బస్సుల్లో కూడా ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి కూడా చేరుకోలేదు. ఇందులో కొంత కోవిడ్‌ భయమున్నా.. సొంత వాహనాలకు అలవాటు పడటమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఆ రెండు నెలలే డల్‌.. 
లాక్‌డౌన్‌ వల్ల ఉపాధికి ఇబ్బందైందని, ఆదాయం బాగా తగ్గిందని చెప్పేవాళ్లే ఎక్కువ.. అలాంటప్పుడు వాహనాల విక్రయాలు బాగా పడిపోవాలి. కానీ అలా జరగలేదు. లాక్‌డౌన్‌లో 2 నెలలు మినహా మిగతా నెలల్లో వాహనాలు మామూలుగానే అమ్ముడయ్యాయి. గత రెండు నెలల గణాంకాలు పరిశీలిస్తే.. గతేడాది అదే నెలల కంటే ఎక్కువగా అమ్ముడవటం విశేషం. గత 7 నెలల్లో రాష్ట్రంలో 4.40 ద్విచక్రవాహనాలు అమ్ముడయ్యాయి. ఏడాది ముందు ఇదే సమయంలో 4.68 లక్షలు విక్రయమయ్యాయి. తేడా స్వల్పమే. ఇక.. 2019 నవంబర్‌లో రాష్ట్రంలో 72 వేల ద్విచక్రవాహనాలు అమ్ముడైతే గత నవంబర్‌లో అది 75 వేలుగా ఉంది. 2019 డిసెంబర్‌లో 52 వేలు అమ్ముడైతే గతేడాది డిసెంబర్‌లో 53 వేలు అమ్ముడయ్యాయి. ఇక గత 7 నెలల్లో రాష్ట్రంలో 89,345 కార్లు అమ్ముడయ్యాయి. 2019లో ఈ సంఖ్య 89,837గా ఉంది. 2019 నవంబర్‌లో 12,045 కార్లు అమ్మితే గత నవంబర్‌లో 13,852 అమ్ముడయ్యాయి. 2019 డిసెంబర్‌లో 17,135 అమ్మితే, గత డిసెంబర్‌లో 17,506 విక్రయమయ్యాయి. లాక్‌డౌన్‌ ప్రభావం తగ్గి ఆర్థికంగా పుంజుకుంటుండటంతో సొంత వాహనాలు కొనుగోలు గతం కంటే పెరుగుతోందని అర్థమవుతోంది. 

పెరిగిన సెకండ్‌ హ్యాండ్‌ వాహనాల విక్రయం..
కొత్త వాహనాలు అంతకుముందు సంవత్సరంలాగే అమ్ముడవుతుండగా, సెకండ్‌హ్యాండ్‌ వాహనాలు మాత్రం గతంతో పోలిస్తే బాగా పెరిగాయి. 2019లో జూలై నుంచి డిసెంబర్‌ వరకు 1.10 లక్షల ద్విచక్రవాహనాలు చేతులు మారగా, 2020లో అదే సమయంలో ఏకంగా 1,51,877 అమ్ముడయ్యాయి. అదే కార్ల విషయంలో ఆ సంఖ్య 77 వేలు కాగా, గతేడాది 99,807గా ఉండటం విశేషం. లాక్‌డౌన్‌ వల్ల ఏర్పడ్డ ఆర్థిక ఇబ్బందులతో కొత్త వాహనాలు కొనలేని వారు ఎక్కువగా సెకండ్‌ హ్యాండ్‌ వాహనాలను కొనేందుకు మొగ్గుచూపారు. అయితే వర్క్‌ ఫ్రం హోమ్‌ అమలులో ఉండటం, విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాకపోవటం వల్ల వాహనాల రద్దీ తక్కువగా ఉండాలి. కానీ అంతకుముందు కంటే పెరగటం గమనార్హం..

ఆర్టీసీ అధ్యయనంలో ఇలా.. 
నగరంలో సిటీ బస్సులు తిరిగే మార్గాల్లో కొన్నింటిలో బస్సులు నిరంతరం రద్దీగా ఉంటాయి. జియాగూడ, ఎల్‌బీనగర్, రామంతాపూర్, పటాన్‌చెరు.. తదితర రూట్లు బాగా బిజీగా ఉంటాయి. నగర రోడ్లపై రద్దీ విపరీతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఈ రూట్లలో తిరిగే సిటీ బస్సులు పూర్తిగా వెలవెలబోతున్నాయి. దీనిపై తాజాగా ఆర్టీసీ అధికారులు ఓ పరిశీలన జరిపారు. గతంతో పోలిస్తే ఈ మార్గాల్లో బస్సులకు ద్విచక్ర వాహనాలు, కార్లు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయని డ్రైవర్లు గుర్తించారు. అంటే వాటి సంఖ్య బాగా పెరిగిందన్నది వారి మాట. అదే సమయంలో ఆక్యుపెన్సీ రేషియో సగానికి తక్కువగా ఉంది. రోడ్లపై వాహనాలు పెరిగాయి, బస్సుల్లో జనం తగ్గారు. వెరసి నగర రోడ్లపై వ్యక్తిగత వాహనాలు బాగా పెరిగాయని ఆర్టీసీ గుర్తించింది. సిటీ బస్సులు మొదలై ఇన్ని నెలలైనా ఆక్యుపెన్సీ రేషియో పెరగకపోవటానికి ఇదే కారణమని వారు ఉన్నతాధికారులకు ఓ రిపోర్టు సమర్పించారు. 

ఢిల్లీ తరహా ముప్పు వాటిల్లుతుంది.. 
‘కొన్ని రోజులుగా రోడ్లపై వాహనాల సంఖ్య బాగా పెరిగింది. కోవిడ్‌ భయంతో ఇలా జనం తాత్కాలికంగా సొంత వాహనాలు వాడుతున్నారని సరిపెట్టుకుంటే మాత్రం ఇది పెద్ద ప్రమాదంగా మారుతుంది. ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలి. లేకుంటే ఢిల్లీ తరహా సమస్య మనల్ని చుట్టుముడుతుంది. ఒకసారి జనం సొంత వాహనమే మేలన్న అభిప్రాయంలోకి వస్తే ప్రజారవాణావైపు మళ్లటం కష్టమవుతుంది. కోవిడ్‌ భయం పోగానే ప్రజా రవాణా కిక్కిరిసిపోయేలా చేయాలి. లేకుంటే భూమి నుంచి ఎత్తుకుపోయే కొద్ది చల్లబడాల్సిన వాతావరణం వేడిగా మారుతుంది. పదో అంతస్తువారు కూడా నేలపై ఉన్న వేడినే అనుభూతి పొందుతారు. అది కాలుష్యం వాతావరణంలో పొరలా మారటంతో ఏర్పడే సమస్య. అది ఏర్పడిందంటే జనం ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకోవాలి. అక్కడి దాకా సమస్యను రానీయకూడదు’ 
– జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త  

రోజుకు 200 కి.మీ. బండిపైనే.. 
మా గ్రామం నుంచి హైదరాబాద్‌ 90 కి.మీ. దూరంలో ఉంటుంది. నేను ఆర్గానిక్‌ ఫుడ్‌కు సంబంధించి ఓ సంస్థ మార్కెటింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాను. రోజూ బైక్‌పై వచ్చి వెళ్తున్నాను. అంతకుముందు బస్సుల్లో వచ్చే వాడిని లాక్‌డౌన్‌నుంచి బైక్‌పైనే వస్తున్నా.. 
– ఐలి గణేశ్‌కుమార్, రసూలాబాద్, సిద్దిపేట జిల్లా  

నెల    ద్విచక్ర వాహనాలు    కార్లు
    2019    2020    2019    2020 
జూన్‌    67,869    67,562    11,652    8,364 
జూలై    64,338    55,783    9,772    9,326 
ఆగస్టు    60,557    56,290    11,104    10,575 
సెప్టెంబర్‌    47,042    53,303    9,314    11,322 
అక్టోబర్‌    1,03,430    77,273    18,815    18,400 
నవంబర్‌    72,464    75,673    12,045    13,852 
డిసెంబర్‌    52,385    53,304    17,135    17,506 
మొత్తం    4,68,085    4,39,188    89,837    89,345

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top