TS: రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షాలు

Heavy Rainfall Alert Reported Across Telangana - Sakshi

అదిలాబాద్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారీగా వర్షపాతం నమోదైంది. జిల్లాలోని పలు మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.  బోథ్‌, ఇచ్చోడ, నేరెడిగొండ, సిరికొండ బజార్‌హత్నూర్‌, గుడిహత్నూర్‌లో వర్షం కారణంగా పరీవాహక ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. అదే క్రమంలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచనలు చేశారు.

నిర్మల్‌: కుంటాలలో ఎడతెరిపిలేని వర్షం వల్ల వెంకూర్‌ చెరువుకట్ట తెగింది. బాసర మండలంలో వర్షం కారణంగా లోతట్టుప్రాంతాలన్నీ జలమయంతో పాటు పలు ఇళ్లలోకి వరదనీరు చేరింది. గ్రామాల్లో మురుగుకాల్వలు, ప్రధాన రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. టాక్లి, కిర్గుల్‌(బి) ప్రధాన కాల్వల ద్వారా వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో ఆ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాల వల్ల పత్తి, సోయా, మినుము పంటలు మునిగాయి. 

కామారెడ్డి: జుక్కల్‌ నియోజకవర్గంలో మూడు రోజులుగా ఎడతెరిపిలేని వర్షాల వల్ల చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి.

నల్గొండ: దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో వర్షాలు జనజీవనాన్ని స్తంభింపచేశాయి. యాదాద్రి సమీపాన రెండో ఘాట్‌ రోడ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం  తప్పింది. వెంటనే ఆ రాళ్లను అధికారులు తొలగిస్తున్నారు. 

నిజామాబాద్: జిల్లాలో వానల కారణంగా సిరికొండలో  కప్పలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 

ఖమ్మం: మూడు రోజులుగా వర్షం కురుస్తునే ఉంది. దీంతో సత్తుపల్లిలో జేవీఆర్‌ ఓసీలో  25 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి,  భద్రాద్రి కొత్తగూడెంలో జి.కె.6 ఓపెన్‌కాస్ట్‌లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, ఇల్లందు సింగరేణి జెకె5,  కోయగూడెం ఓసీ గనుల్లో 28 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది.

నల్గొండ: జిల్లాలో మిర్యాలగూడ పరిధి వేములపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల.. అడవిదేవులపల్లి, మాడుగులపల్లి మండలాల్లో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. సిద్దిపేటలో ఎడతెరిపిలేని వర్షం వల్ల కుడవెళ్లి వాగు పొంగిపొర్లుతోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top