యాదాద్రి జిల్లాలో 2 గంటల పాటు కుండపోత వర్షం

సాక్షి, యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి 2 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా సగటున 65.4 మి.మీ వర్షపాతం నమోదైంది. భువనగిరిలో 169.2మి.మీ, తుర్కపల్లిలో 125.2 మి.మీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో జిల్లాలో చెరువులు అలుగులు దుంకాయి. వాగులు పొంగిపొర్లాయి.
భువనగిరి–యాద గిరి గుట్ట, వరంగల్‌వైపు వెళ్లే జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు నీట మునిగింది. భువనగిరి– చిట్యాల జాతీయ రహదారిలో ఇంద్రపాలనగరం వద్ద రోడ్డుపై నుంచి వరద నీరు ఉధృతంగా పారడంతో ఈ రెండు ప్రధాన రహ దారులపై రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. అడ్డగూడూరు మండలం లక్ష్మిదేవికాల్వ–ధర్మారం మధ్యన వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి.