జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం | Harish Rao comments over Revanth Reddy | Sakshi
Sakshi News home page

జీవో 29తో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం

Oct 20 2024 4:35 AM | Updated on Oct 20 2024 4:35 AM

Harish Rao comments over Revanth Reddy

సీఎం రేవంత్‌ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు: హరీశ్‌రావు 

యూపీఎస్సీలో అమలు చేస్తున్నప్పుడు.. టీజీపీఎస్సీలో ఎందుకు చేయరు? 

నిరుద్యోగుల ఆర్తనాదాలతో అశోక్‌నగర్‌ మార్మోగుతోంది 

కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీత 

సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు టాప్‌ మార్కులు వచ్చినా జనరల్‌గా కాకుండా, రిజర్వేషన్‌గా పరిగణించడం వల్ల మరో రిజర్వ్‌డ్‌ అభ్యర్థికి అవకాశం లేకుండా పోతోందని స్పష్టం చేశారు. 

యూపీఎస్సీ అమలు చేస్తున్నా.. ఆ విధానాన్ని టీజీపీఎస్సీ ఎందుకు అమ లు చేయడం లేదని నిలదీశారు. కేసీఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు జీవో 55 ప్రకారం అన్నివర్గాల నిరుద్యోగులు, విద్యార్థులకు న్యాయం చేశారని పేర్కొన్నా రు. శనివారం సిద్దిపేటలో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘రాహుల్‌ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని సదస్సులు నిర్వహిస్తుంటే.. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డి రా జ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆ వర్గానికి ప్రతినిధిగా ఉండి మౌనం వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఇదే అంశాన్ని అడిగితే భట్టి విక్రమార్క పరిశీలిస్తామన్నారు. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని నిలదీసి బలహీన వర్గాల హక్కులను కాపాడాలి.

విద్యార్థులు, నిరుద్యోగుల ఆర్తనాదాలతో అశోక్‌నగర్‌ ప్రాంతం మార్మోగుతోంది. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని, రిజర్వేషన్లు అమలు చేయాలని విద్యార్థులు రోడ్డెక్కితే వారిని కొడుతున్నారు. ఆడపిల్లల్ని కూడా అర్ధరాత్రి పోలీసు స్టేషన్లలో పెడుతున్నారు. వారేమైనా టెర్రరిస్టులు, హంతకులు, గూండాలా? లాఠీలు, ఇనుప కంచెలను రేవంత్‌రెడ్డి నమ్ముకున్నారు. అవి అణచేయవు. ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా అశోక్‌నగర్‌కు వెళ్లాలి. 

కోదండరాం స్పందించడం లేదేం? 
కాంగ్రెస్‌ హైదరాబాద్‌ యూత్‌ డిక్లరేషన్‌లో ప్రకటించినవి ఒక్కటైనా అమలు చేశారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. పది నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్‌ లేదు. 

కేసీఆర్‌ ప్రభుత్వమే ప్రక్రియ అంతా పూర్తిచేసిన ఉద్యోగాలకు కాగితాలు పంచి.. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. కోదండరాం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నిరుద్యోగుల ఎజెండా.. నా ఎజెండా అన్నారు. ఎమ్మెల్సీ అయ్యాక గొంతు మూగబోయింది. కోదండరాం, రియాజ్, నవీన్, ఆకునూరి మురళిలకు ఉద్యోగాలు వచ్చాయి. నిరుద్యోగులకు రాలేదు. 

కాంగ్రెస్‌ బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు 
గ్రూప్‌–1 అభ్యర్థుల నిరసన సాక్షిగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోమారు బట్టబయలైంది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ నిరసన తెలుపుతుంటే అడ్డుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. బీఆర్‌ఎస్‌ నాయకులను అరెస్టు చేయడం దుర్మార్గం. 

జీవో 29 రద్దు చేసి గ్రూప్స్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలని జూలై 29న నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడే ప్రభుత్వం మొండిపట్టు వీడి ఉంటే ఇప్పుడు విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కాదు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు. రాజకీయాలు పక్కనబెట్టి విద్యార్థుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలి..’’అని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement