
పది నెలలుగా ఇబ్బంది పడుతున్న 1,200 మంది
సిరిసిల్లకల్చరల్: రెగ్యులర్, కాంట్రాక్ట్ అధ్యాపకులతో సమానంగా గెస్ట్ లెక్చరర్లు విధులు నిర్వర్తిస్తున్నా, 10 నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లు ఉండేవారు. పబ్లిక్ సర్వీస్ కమి షన్ నిర్వహించిన లెక్చరర్ల నియామక ప్రక్రియ ఫలితంగా సుమారు 1200 మందిని ఇంటికి పంపించారు. అయితే వీరిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని ఇంటర్‌బోర్డు కమిషనర్ హామీ ఇచ్చారు. వీళ్లకు కూడా నాలుగు నెలల వేతనాలు అందలేదు. విధుల్లో ఉన్న వారికి పది నెలలుగా వేతనాలు అందడం లేదు.
పీరియడ్ల ఆధారంగా వేతనం
నిర్దిష్ట వేతనంతో పనిలేకుండా పాఠాలు చెప్పే పీరియడ్ల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని జీతాలు చెల్లించేలా ప్రభు త్వం ముందే ఒప్పందం చేసుకుంది. రెగ్యులర్, కాంట్రాక్ట్ లెక్చరర్లతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా అతిథి అధ్యాపకులకు జీతాలు చెల్లించే విషయంలో ప్రభుత్వం చిన్నచూ పే చూస్తోంది. దీంతో గంటల ప్రాతిపదికన అందాల్సిన అరకొర వేతనాల కోసం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
కనీస వేతనాల కోసం పోరు
ఇంటర్ స్థాయి సైన్స్ సబ్జెక్టులకు థియరీతోపాటు ప్రయోగ తరగతులు కూడా ఉంటాయి. ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులు బోధించే లెక్చరర్ల పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున వారానికి గరిష్టంగా 72 గంటలు మించకుండా తరగతులు నిర్వహిస్తున్నారు.
కనీస వేతనాలు ఇవ్వండి పీరియడ్ల ఆధారంగా నిర్ణయించిన వేతనాలతో కుటుంబాలు గడవడం కష్టంగా మారుతోంది. గెస్ట్ లెక్చరర్లు సైతం మిగిలిన వారితో సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వేతనాల విషయంలో ప్రభుత్వం ఉదారత చూపించాలి. పీరియడ్‌ల వారీగా కాకుండా కనీసం వేతనాన్ని నిర్ణయించి అమలు చేయాలి. – దీపిక, గెస్ట్ లెక్చరర్ల సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షురాలు
ఆ కుటుంబాలను ఆదుకోవాలి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్ని బలోపేతం చేసే దిశగా సాగుతున్న ప్రక్రియలో గెస్ట్ లెక్చరర్లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. సర్కార్ విద్యపై సామాన్యుల్లో నమ్మకాన్ని పెంచుతున్నారు. విధులకు దూరమైన 1200 మందికి ఇచ్చిన హామీ నిలుపుకోవాలి. మిగిలిన వారికి పది నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి. – గెంట్యాల రాజశేఖర్, గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి