త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ | Sakshi
Sakshi News home page

త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ

Published Tue, Aug 16 2022 2:13 AM

Grand Independence Day Celebrations At TSRTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం పద్రాగస్టు రోజున తీపి కబురు చెప్పింది. పెండింగ్‌లో ఉన్న డీఏను త్వరలో అందజేయనున్నట్లు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం బస్‌భవన్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సెప్టెంబర్‌ నెల జీతభత్యాలతో పాటు డీఏను కూడా అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు చెల్లించవలసిన రూ.వెయ్యి కోట్ల బకాయీలను కూడా అందజేయనున్నట్లు చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను బస్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. సంస్థ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు, కండక్టర్‌లు, డ్రైవర్లు ఈ వేడుకలలో పాల్గొన్నారు. 

గ్రేటర్‌లో అల్బియాన్‌ బస్సు..
డెక్కన్‌ క్వీన్‌గా పేరొందిన 1932 నాటి అల్బియాన్‌ బస్సును హైదరా బాద్‌లోని ప్రధాన రోడ్లపై ప్రదర్శించనున్నట్లు చైర్మన్‌ బాజిరెడ్డి తెలిపారు. అలాగే ఈ బస్సు విశేషాలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు తెలియజేయనున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్టీసీలో బీడబ్ల్యూఎస్‌ పథకం ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఆయన వివరించారు. త్వరలో 300 ఎలక్ట్రిక్‌ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. 

ఘన సన్మానం..
ఈ వేడుకలలో భాగంగా నిజాం ప్రభుత్వ రోడ్డు రవాణా విభాగంలో పని చేసిన నరసింహ (97), ఎం.సత్తయ్య (92)లను ఆర్టీసీ ఘనంగా సన్మానించింది. తమను గుర్తించి సన్మానించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆర్టీసీ నుంచి లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement