అనుకోకుండా ఎదురుపడ్డ గవర్నర్ తమిళిసై, కవిత.. నేరుగా ఆలయంలోకి వెళ్లి!

సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవిత అనుకోకుండా ఒకరికి ఒకరు తారసపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని అమ్మపల్లి (శ్రీ సీతారామచంద్రస్వామి) ఆలయం వద్ద ఈ సంఘటన జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. అమ్మపల్లి ఆలయం వద్ద బతుకమ్మ సంబురాల నిర్వహణకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలోకి వెళ్లి అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్‌తో కలిసి పూజలు నిర్వహిస్తుండగా.. కాసేటికి ఊహించని విధంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్కడికి చేరుకున్నారు. నేరుగా ఆలయంలోకి వెళ్లారు.
అప్పటికే అక్కడ పూజలు నిర్వహిస్తున్న కవిత.. గవర్నర్‌ను చూసి పలకరించారు. పూజ అనంతరం బతుకమ్మ ఉత్సవాలకు రావాలని కోరగా.. తాను స్వామి పూజలు జరిపిస్తానని గవర్నర్ జవాబిచ్చారు. పూజల తర్వాత కవిత ఆలయం గర్భగుడి నుంచి బయటకు వెళ్లగా.. ప్రత్యేక పూజల అనంతరం గవర్నర్ ఉత్తర ద్వారం ద్వారా బయటకు వెళ్లిపోయారు. కొత్తూరు మండలంలోని చేగూరు వద్ద ఉన్న కన్హాశాంతి వనం ఆశ్రమానికి వెళ్లిన గవర్నర్.. తిరుగు ప్రయాణంలో అమ్మపల్లికి వచ్చారు. గవర్నర్ ఆకస్మిక రాకతో ఆలయం అధికారులు, పోలీసులు కాసేపు పరుగులు పెట్టాల్సి వచ్చింది.
తెలంగాణ మెల్లగా తెరిపిన పడుతోంది: ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ మెల్ల మెల్లగా మళ్లీ తెరిపిన పడుతోందని, తెలంగాణ రాకముందు అనుకున్నవి ఒక్కొక్కటి నిజమవుతున్నాయని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. బతుకమ్మ సంబురాలకు హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడారు. 11వ శతాబ్దం నాటి ఈ పురాతన ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాని చెప్పారు. అంతకుముందు మహిళలతో కలిసి కవిత పూలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మను నెత్తిన పెట్టుకుని ఆలయంలో తిరిగారు. పాటలు పాడి, ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు.
చదవండి: బెంజ్ సీఈవోకు తప్పని ట్రాఫిక్ కష్టాలు.. కిలోమీటర్లు నడిచి, ఆటో ఎక్కి