నలుపు రంగులోకి గోదావరి నీరు.. ‍ ప్రమాదం తప్పదు.. జాగ్రత్త!

Godavari Water Pollution Sriram Sagar Project Maharashtra Factories Waste - Sakshi

ఎగువన నదిలో కలుస్తున్న మహారాష్ట్ర ఫ్యాక్టరీల వ్యర్థాలు 

నీటి దుర్వాసన తట్టుకోలేకపోతున్నాం అంటున్న మత్స్యకారులు 

ప్రాజెక్టులోని చేపలకూ ప్రమాదమే 

బాల్కొండ/నిజామాబాద్‌: శ్రీ రాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నీరు కలుషితమవుతోంది. నీరు నలుపు రంగులోకి మారిందని, దుర్వాసన తట్టుకోలేకపోతున్నామని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 21 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ అధికంగా ఉన్నప్పుడు ఎగువ నుంచి వదిలిన వ్యర్థాలు నీటిలో కలిసి పోయి దిగువకు వెళ్లిపోతాయి. ప్రస్తుతం తక్కువగా ఉన్న నీటి నిల్వతో వ్యర్థాల ప్రభావం ఏర్పడుతోంది.

ఎగువ భాగాన మహారాష్ట్రలో అధికంగా ఉన్న ఫ్యాక్టరీలు విడుదల చేసిన వ్యర్థాలు నదిలో కలిసి ఎస్సారెస్పీలోకి వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేస్తున్నారు. నీరు కలుషితమవుతుండటంతో ప్రాజెక్ట్‌లో చేపలకు ప్రమాదం పొంచి ఉందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్‌లో పాప్లెట్‌ రకం చేపలు మాత్రమే లభిస్తున్నాయని, అక్కడక్కడా మధ్యలో పెద్ద పెద్ద చేపలు మృతి చెందుతున్నట్లు తెలిపారు.

నీటి నిల్వ తగ్గి ప్రాజెక్ట్‌లో చేపలకు ఆక్సిజన్‌ అందక గతంలో అనేక చేపలు మృత్యువాత పడ్డాయి. ప్రాజెక్ట్‌ నుంచి మిషన్‌ భగీరథ కోసం ప్రతి రోజు 152 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. నీరు కలుషితమైతే తాగు నీటికి కూడ ఇబ్బందే అవుతుంది. ఎంత ప్యూరిఫైడ్‌ చేసినా రసాయానాలు కలిసిన నీరు తాగడం శ్రేయస్కరం కాదని అంటున్నారు.  

పరీక్షలకు పంపుతాం.. 
ప్రాజెక్ట్‌లోని నీరు ప్రస్తుతం అధికంగా దుర్వాసన వస్తోంది. కొద్దిగా రంగు కూడ మారుతోంది. ఉన్నతాధికారులకు ఇది వరకే నివేదించాం. నీటిని పరీక్షలకు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం.    – చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top