భద్రాచలం వద్ద ఉధృతంగా గోదావరి

Godavari Water Level Reaches 48 Feet At Bhadrachalam - Sakshi

భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

సాక్షి, ఖమ్మం: ఎగువ నుంచి వస్తోన్న భారీ వరద ప్రవాహంతో  భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. గోదావరి నీటిమట్టం 48 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కూనవరం మండలం పోలిపాక వద్ద రోడ్లపైకి గోదావరి వరద నీరు వచ్చింది. పర్ణశాల చుట్టూ వరదనీరు చేరింది. సీతమ్మ విగ్రహం, నార చీరల ప్రాంతం నీటిలో మునిగింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను  అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్‌ రూమ్‌లను కూడా ఏర్పాటు చేశారు. 53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

గోదావరి వరద ప్రవాహం 9,81,261 క్యూసెక్కులు ఉంది. గంట గంటకు నీటిమట్టం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొత్తకాలనీ, సుభాష్​నగర్​ కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు. అత్యవసర సేవల కోసం కంట్రోల్‌ నంబర్లు 08744-241950, 08743-232444 డయల్ చేయాలని చెప్పారు. సాయం కోసం 9392919743 నంబరుకు ఫొటోలు వాట్సాప్‌ చేయాలని అధికారులు తెలిపారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడుకు రాకపోకలు నిలిచిపోయాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top