అమ్మాయిలు అదరగొట్టారు | Girls dominate in 10th grade exams | Sakshi
Sakshi News home page

అమ్మాయిలు అదరగొట్టారు

May 1 2025 3:38 AM | Updated on May 1 2025 3:38 AM

Girls dominate in 10th grade exams

టెన్త్‌ ఫలితాల్లో టాప్‌10లో 8 మంది బాలికలే..  

596 మార్కులతో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన కృతి, కామారెడ్డి జిల్లాకు చెందిన అన్షిత ఫస్ట్‌ 

ప్రైవేటు కన్నా అద్భుతమైన ఫలితాలు సాధించిన గురుకులాలు 

మొత్తంగా 92.78 శాతం పాస్‌... 

ఫలితాలు విడుదల చేసినసీఎం రేవంత్‌ రెడ్డి

జూన్‌ 3 నుంచి అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల్లో అమ్మాయిలే పైచేయిగా నిలిచారు. అటు ఉత్తీర్ణతా శాతంలోనూ, ఇటు అత్యధిక మార్కుల్లోనూ అసాధారణ ప్రతిభను కనబర్చి ఔరా అనిపించారు. తొలి 10 స్థానాల్లో ఏకంగా 8 మంది అమ్మాయిలుండగా, ఇద్దరు మాత్రమే అబ్బాయిలున్నారు. మొత్తమ్మీద బాలురు 91.32 శాతం ఉత్తీర్ణులైతే, బాలికలు 94.26 శాతం ఉత్తీర్ణులయ్యారు. ‘సాక్షి’కి అందిన సమాచారం ప్రకారం నిజామాబాద్‌ జిల్లాకు చెందిన సిర్ప కృతి, కామారెడ్డి జిల్లాకు చెందిన నిమ్మ అన్షిత 600కు గాను 596 మార్కులతో స్టేట్‌ టాపర్లుగా నిలిచారు.

టాప్‌–10 స్థానాల్లో నిలిచిన వారి మార్కుల మధ్య తేడా కేవలం రెండు మార్కులే కావడం గమనార్హం. ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలల కన్నా గురుకులాలు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం. ఈమేరకు బుధవారం టెన్త్‌ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరీక్షలకు 4,96,374 మంది రెగ్యులర్‌ విద్యార్థులు, 10,733 మంది ప్రైవేటు (కంపార్ట్‌మెంట్‌) విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షల్లో మొత్తం 4,60,519 మంది పాస్‌ కాగా, 92.78 ఉత్తీర్ణత శాతం నమోదైంది. 

మెమోలో గ్రేడింగ్‌తోపాటు మార్కులు 
టెన్త్‌ ఫలితాల వివరాలను పాఠశాల విద్య డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి వివరించారు. 4,629 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయని, రెండు పాఠశాలల్లో సున్నా శాతం ఫలితం వచ్చిందన్నారు. మహబూబాబాద్‌ 99.29 శాతం ఫలితాలతో రాష్ట్రంలో ముందు వరుసలో ఉందని, వికారాబాద్‌ 73.97 శాతం ఫలితాలతో చివరి స్థానంలో ఉందని తెలిపారు. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.79 శాతం ఉత్తీర్ణత నమోదు చేశాయని తెలిపారు. ఇతర ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లోనూ 92.78 శాతానికిపైగా ఉత్తీర్ణత నమోదైనట్టు తెలిపారు. ఈసారి గ్రేడింగ్‌తోపాటు మార్కులను కూడా మెమోలో పొందుపర్చారు.  

జూన్‌ 3 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ 
టెన్త్‌ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3 నుంచి 13 వరకు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య పరీక్షల విభాగం వెల్లడించింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ ప్రక్రియకు 15 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.   

Advertisement
 
Advertisement
Advertisement