మత్స్యరంగ వృద్ధికి పాలసీ

Further Development Of Fisheries Sector: Talasani Srinivas Yadav - Sakshi

రూపొందించాలని అధికారులకు తలసాని ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: మత్స్య రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సమగ్రపాలసీ తయారు చేయాలని అధికారులను మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆదేశించారు. రానున్న రోజుల్లో మంచినీటి చేపలను ప్రపంచానికి అందించేస్థాయికి అభివృద్ధి సాధించాలని సూచించారు. శనివారం ఇక్కడి పశు సంవర్థక శాఖ కార్యాలయంలో నిర్వహించిన ఇరిగేషన్, మత్స్య శాఖల ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడారు.

మత్స్యశాఖ పరిధిలో 15 కోట్ల చేపపిల్లల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 23 కేంద్రాలున్నాయని, మిగిలిన చేపపిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వివరించారు. పలు రిజర్వాయర్ల వద్ద మత్స్యకారులు పట్టి న చేపలను గ్రేడింగ్, ప్యాకింగ్, నిల్వ చేసుకునేం దుకు, వలలు, పడవలు భద్రపర్చుకునేందుకు ల్యాండింగ్‌ కేంద్రాల నిర్మాణానికి స్థలాలను కేటాయించాలని ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రజత్‌ కుమార్‌ను కోరారు.

తమ పట్టాభూముల్లో చేపల చెరువులను నిర్మించుకొనేందుకు ముందుకొచ్చే రైతులకు సింగిల్‌ విండోవిధానంలో తక్షణ మే అనుమతులివ్వాలని సూచించారు. కేజ్‌ కల్చర్‌ విధానంలో చేపలను పెంచితే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మత్స్య సంపద లభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 5 వేల హెక్టార్లలో 8.3 లక్షల కేజ్‌లను ఏర్పాటు చేసి చేపల పెంపకం చేపట్టే అవకాశముందని, వీటిద్వారా సుమారు 15 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని అంచనా వేస్తున్నామని, వీటివిలువ సుమారు రూ.15 వేల కోట్లు ఉంటుందని అన్నారు. సమావేశంలో ఇరిగేషన్‌ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రజత్‌ కుమార్, పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్‌ లచ్చిరాం భూక్యా, ఇరిగేషన్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్, జాయింట్‌ సెక్రెటరీ భీమప్రసాద్, నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ అధికారులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top