ఐటీ ఉద్యోగులకు షాక్‌.. అప్పటి నుంచి 100 శాతం వర్క్ ఫ్రమ్‌ ఆఫీస్‌!

Full Percent Work From Office For IT Employees From January - Sakshi

ప్రస్తుతం 20 శాతం ఉద్యోగుల వర్క్‌ ఫ్రం హోం 

జనవరి నుంచి హైబ్రీడ్‌ విధానానికి స్వస్తి... 

ఐటీలో వలసల జోరు.. 

సాక్షి, సిటీబ్యూరో: ఐటీ క్యాపిటల్‌గా మారిన గ్రేటర్‌ సిటీలో వచ్చే ఏడాది జనవరి నుంచి వంద శాతం ఉద్యోగులు ఆఫీసు నుంచి పనిచేసేలా నగరంలోని ఐటీ కంపెనీలు చర్యలు ప్రారంభించాయి. ఈ మేరకు ఉద్యోగులకు వర్తమానాలు పంపినట్లు హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌(హైసియా) వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఇప్పటివరకు హైబ్రీడ్‌ విధానంలో.. అంటే సుమారు 70 నుంచి 80 శాతం మంది ఆఫీసుకు వచ్చి పనిచేస్తుండగా.. మరో 20 నుంచి 30 శాతం మంది వర్క్‌ఫ్రం హోం కొనసాగిస్తున్నారు. వీరిలోనూ పలువురు కార్యాలయంలో అత్యవసర సమావేశాలకు హాజరయ్యేందుకు వారంలో ఒకటి రెండు మార్లు ఆఫీసులకు వస్తున్నారు. ప్రస్తుతం మహానగరం పరిధిలో అన్ని వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు పూర్తిస్తాయిలో కొనసాగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాగా వర్క్‌ఫ్రం హోం అయినప్పటికీ ఆయా కంపెనీలు, ఉద్యోగుల ఉత్పాదకత, ఎగుమతులు ఏమాత్రం తగ్గలేదని హైసియా వర్గాలు పేర్కొనడం విశేషం. 

ఐటీలో నయా ట్రెండ్‌ ఇలా... 
నగరంలో కార్పొరేట్, బడా, చిన్న ఐటీ కంపెనీలు సుమారు 1500 వరకు ఉన్నాయి. వీటిల్లో సుమారు 7 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా. ఈ ఏడాది జూన్‌–అక్టోబరు మధ్యకాలంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతోన్న ఉద్యోగులు 20 నుంచి 25 శాతానికి పెరిగినట్లు హైసియా వర్గాలు తెలిపాయి. దిగ్గజ కంపెనీలుగా పేరొందిన టీసీఎస్,ఇన్ఫోసిస్‌ కంపెనీలు సైతం ఈజాబితాలో ఉండడం గమనార్హం. కొన్ని కంపెనీల్లో ఈ ట్రెండ్‌ 27 శాతం మేర నమోదైందట. అనుభవం గడించిన ఉద్యోగులు ఇతర కంపెనీలకు వలసలు పోతుండగా..ఫ్రెషర్స్‌ ఈ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారు. 
ఈపరిణామం ఈ రంగంలో కొత్తేమీ కానప్పటికీ ఇటీవల మరింత పెరగడం విశేషమని నిపుణులు చెబుతున్నారు.   

ప్రాజెక్టుల జోరు పెరిగింది.. 
నిపుణులైన ఐటీ ఉద్యోగులు వలసబాట పట్టడానికి ప్రధాన కారణం నూతన ప్రాజెక్టులేనని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం నగరంలో పలు కంపెనీలు డిజిటల్‌ టెక్నాలజీని అధికంగా అమలు చేస్తున్న కారణంగానే ఐటీ ప్రాజెక్టులు అనూహ్యంగా పెరిగాయి. అమెరికా,యూరప్,కెనడా,ఆ్రస్టేలియా దేశాలకు చెందిన సంస్థలకు నగరంలోని పలు కంపెనీలు ఔట్‌సోర్సింగ్‌ ప్రాజెక్టులు చేపడుతున్నాయి. వీటికి ప్రాజెక్టుల సంఖ్య పెరగడంతో నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. ప్రధానంగా కృత్రిమ మేథ,మిషన్‌ లెరి్నంగ్,బ్లాక్‌చైన్,సైబర్‌సెక్యూరిటీ సంబంధిత ప్రాజెక్టులకు డిమాండ్‌ పెరిగిందట. ఇందులో అనుభవం ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మెండుగా 
ఉండడం విశేషం. డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులకు తాజాగా 30 శాతం మేర డిమాండ్‌ పెరగడం ఐటీలో నయా ట్రెండ్‌.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top