ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఎక్కడ? | Friendly Policing in Telangana: Losing Its Way? | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఎక్కడ?

Aug 6 2025 12:43 PM | Updated on Aug 6 2025 1:05 PM

Friendly Policing in Telangana: Losing Its Way?

బాధితులు ఆత్మహత్యకు పాల్పడేంతగా పోలీసుల దురుసు ప్రవర్తన, వేధింపులు

భూ వివాదాల్లో జోక్యం.. అవినీతి, అక్రమ దందాలు

మహిళల పట్ల అనుచిత ప్రవర్తన

ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నా మారని ఖాకీల తీరు

ఉమ్మడి జిల్లాలో పలువురు ఎస్సైలు, సీఐలపై ఆరోపణలు

జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఇటీవల పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలలో భాగంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆపి పరీక్షించారు. అతను మద్యం తాగినట్లు గుర్తించామని పోలీసులు చెప్పారు. అయితే ఆ సమయంలో బైక్‌తోపాటు అతని సెల్‌ఫోన్‌ను కూడా లాక్కొని పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వచ్చి ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అక్కడున్న హోంగార్డు, మరో కానిస్టేబుల్‌ మంటలు ఆర్పి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అతని మరణానికి కారణం పోలీసుల దురుసు ప్రవర్తనేనని బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. విచిత్రం ఏంటంటే.. ఆ వ్యక్తి తమ విధులకు ఆటంకం కలిగించాడంటూ పోలీసులు అదేరోజు రాత్రి కేసు నమోదు చేశారు.

  • చింతపల్లి మండలం కూర్మేడ్‌ గ్రామంలో తాము కొనుగోలు చేసిన భూమి విషయంలో చింతపల్లి ఎస్సై రామ్మూర్తి తమపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారంటూ టీవీ నటి శిల్పా చక్రవర్తి, ఆమె భర్త జడ కల్యాణ్‌ యాకయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఎదుటి వారితో కుమ్మకై ్క భూవివాదం సెటిల్‌ చేసుకోవాలంటూ తమ వేధిస్తున్నారని పేర్కొన్నారు. సివిల్‌ కోర్టు ఇంజెక్షన్‌ ఉన్నా పోలీసుల సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

  • తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గతేడాది శాలిగౌరారం ఎస్సైపై ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కుటుంబ వివాదంలో పోలీసుస్టేషన్‌కు వెళ్లిన మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఎస్సైపై ఎస్పీ విచారణ జరిపించి చర్యలు తీసుకున్నారు.

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో ఫ్రెండ్లీ పోలిసింగ్‌ గాడి తప్పుతోంది. కొందరు పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. పోలీసుల వేధింపుల కారణంగా బాధితులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. బాధితుల ఫిర్యాదులతో బయటకు వస్తున్న సంఘటనలు కొన్నే. పోలీస్‌ స్టేషన్లలోనే పంచాయతీలు, సెటిల్‌మెంట్లు చేస్తూ దండుకుంటున్న వారు కొందరైతే, సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు మరికొందరు. అదీ చాలదన్నట్లు ఇంకొందరైతే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ పోలీసు శాఖకే మచ్చ తెస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సస్పెండ్‌ చేయడం, ఎస్పీ కార్యాలయాలకు అటాచ్‌ చేయడం వంటి చర్యలు చేపడుతున్నా అలాంటి వారిలో మార్పు రావడం లేదు. పైగా రాజకీయ పలుకుబడితో కొద్దిరోజుల్లోనే తిరిగి పోస్టింగ్‌ పొందుతున్నారు.

ముడుపులే లక్ష్యంగా దందాలు
కొందరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు రాజకీయ నేతల అండదండలతో అవినీతి దందా కొనసాగిస్తున్నారు. ఏదైనా కేసు విషయంలో పోలీసు స్టేషనన్‌కు వెళితే చాలు న్యాయ అన్యాయాలు పట్టించుకోకుండా, ముడుపులు ముట్టజెప్పిన వారికి వంతపాడుతూ బాధితులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. యాదాద్రి జిల్లా మోత్కూర్‌ మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదాల్లో మితిమీరిన జోక్యం చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తనకు ఎదురు తిరిగిన వారిపై చేయి చేసుకోవడం బెదిరింపులకు పాల్పడడం, అక్రమ కేసులను పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మండలంలోని ముసిపట్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసు స్టేషన్‌లో బంధించి చితకబాదడమే కాకుండా, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపైనా చేయి చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

చర్యలు చేపడుతున్నా తీరు మారట్లే..
⇒ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లికి చెందిన సంధ్యకు యాదాద్రి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని మరిపిరాల గ్రామానికి చెందిన కృష్ణతో ఏడాదిన్నర కిందట వివాహమైంది. ఇద్దరి మధ్య తరచూ గొడవలు రావడంతో పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే ఎస్సై తనను వేధింపులకు గురిచేస్తున్నారంటూ మే నెల 20వ తేదీన ఆమె మండల కేంద్రంలోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనలో మృతురాలి బంధువులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఎస్సైని బదిలీ చేశారు.

⇒ సూర్యాపేట జిల్లాలో నకిలీ డాక్టర్‌ల కేసులో సూర్యాపేట పట్టణ సీఐ వీర రాఘవులు, సూర్యాపేట డీఎస్పీ పార్థ సారధి రూ. 16లక్షలు లంచం డిమాండ్‌ చేసి మే 12న ఏసీబీకి పట్టుబడ్డారు.

⇒ నూతనకల్‌ మండలం మిర్యాలలో చక్రయ్యగౌడ్‌ హత్య కేసులో అప్పటి డీఎస్పీ డబ్బులు తీసుకొని నిందితులను ప్రోత్సహించడంతో పాటు హత్య కేసులో పాల్గొన్న నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలీస్‌ బృందాన్ని కాదని తుంగతుర్తి సీఐకి బాధ్యతలు అప్పగించడం పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో డీఎస్పీని డీజీపీ ఆఫీస్‌కు, సీఐని ఎస్పీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు.

⇒ నూతనకల్‌ పోలీస్‌ స్టేషనన్‌లో పనిచేసిన ఎస్‌ఐ వి.ప్రవీణ్‌కుమార్‌ అదే పోలీస్‌ స్టేషనన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను లైంగికంగా వేధించడంతో సదరు మహిళా కానిస్టేబుల్‌ పోలీస్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ను శనివారం డీఐజీ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

⇒ నేరేడుచర్ల మండలం మేడారంలో ఓ భూవివాదంలో తమ హత్యకు కుట్ర చేశారంటూ ఒక వర్గం వారు ఈ నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో మరోవర్గం వారిపై నేరేడుచర్ల ఎస్సై రవీందర్‌నాయక్‌ కేసు నమోదు చేసి స్టేషన్‌కి పిలిపించి తీవ్రంగా కొట్టారని బాధితులు ఆరోపించారు. అంతేకాదు అదే మండలంలోని కందులవారిగూడెంలో భూవివాదంలో ఎస్సై రవీందర్‌నాయక్‌ ఒక వర్గం వారిని విచారణ పేరుతో బాధితులను కొడుతున్నట్లు విమర్శలు వచ్చాయి. విచారణ పేరుతో ఎందుకు కొడుతున్నారని అడిగితే తమపైనా దురుసుగా ప్రవర్తించారంటూ స్వప్న అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

⇒ గతేడాది భూవివాదంలో గుర్రంపోడు మండలంలో జరిగిన ఓ మహిళ హత్య కేసులో ఎదుటివారితో కుమ్మకై ్క సూసైడ్‌ కేసుగా నమోదు చేశారు. ఆ కేసును ఎస్పీ శరత్‌చంద్రపవార్‌ విచారణ జరిపించారు. ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ తరువాత సీఐపైనా విచారణ జరిపించారు. పీఏపల్లి మండలం గుడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వ్యక్తిని కొట్టిన విషయంలో సీఐపై విచారణ జరిపి ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.

వివాదాల కేంద్రంగా చింతపల్లి
చింతపల్లి మండలంలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై భూవివాదంలో జోక్యం చేసుకున్నారు. ఆ కేసులో ఓ వృద్ధున్ని పోలీసు స్టేషనన్‌కు తీసుకువచ్చి కొట్టడం వల్లే అతను చనిపోయాడని ఆ వృద్ధుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు ప్రశ్నిస్తున్న సమయంలో వృద్ధునికి గుండెపోటు వచ్చిందని, పోలీసులు కొట్టినందున ఆయన చనిపోలేదని, గుండెపోటు కారణంగానే అతను చేనిపోయాడని తేల్చారు. అయితే సదరు ఎస్సైని పోలీసు శాఖ సస్పెండ్‌ చేసింది. అయినా కొద్దినెలలకే రాజకీయ పలుకుబడితో ఆయన మరో కీలకమైన పోస్టింగ్‌ తెచ్చుకోగలిగారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. పోలీసుల అత్యుత్సాహం
పోలీసుల అత్యుత్సాహం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ముఖ్యంగా నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి పట్టణ కేంద్రాల్లో పోలీసులు నిర్వహించే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మద్యం తాగినా, తాగకపోయినా తనిఖీల సమయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు వాహనదారులు చెబుతున్నారు. వాహనంతోపాటు సెల్‌ ఫోన్లు లాక్కోవడం, ఇష్టానుసారంగా మాట్లాడటం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అసలు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికితే నిబంధనల ప్రకారం ఏం చేయాలన్నది కాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement