అమ్మకానికి అర్చక పోస్టులు | Flawed recruitment process in Telangana Endowment Department | Sakshi
Sakshi News home page

అమ్మకానికి అర్చక పోస్టులు

May 18 2026 1:48 AM | Updated on May 18 2026 1:48 AM

Flawed recruitment process in Telangana Endowment Department

దేవాదాయశాఖలో లోపభూయిష్టంగా నియామక ప్రక్రియ 

55 ప్రధాన ఆలయాల్లో పోస్టుల భర్తీ 

దేవాలయాల స్థాయిలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ 

చాలాచోట్ల అభ్యర్థులకు రశీదు కూడా ఇవ్వని వైనం 

హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో గుట్టుగా ఇంటర్వ్యూలు 

అర్చకుల కుమారులకే మళ్లీ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నం

తెర వెనుక రంగం సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం

సాక్షి, హైదరాబాద్‌: ‘అది ఉమ్మడి కరీంనగర్‌లోని ప్రధాన దేవాలయం. నిత్యం వేల మంది భక్తులు వస్తుంటారు. ఐదారు నెలల క్రితం ఆ ఆలయంలో పరిచారకుల (సహాయ అర్చకులు) నియామకాలు జరిగినప్పుడు, అప్పటికే ఆ దేవాలయంలో అర్చకులుగా పనిచేస్తున్న వారి కుమారులు నియమితులయ్యారు. ఇతర అభ్యర్థులకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు అదే ఆలయంలో నాలుగు అర్చకుల పోస్టుల భర్తీ ప్రక్రియ జరగబోతోంది. అర్చకుల పిల్లలు నలుగురు దరఖాస్తు చేశారు. వారికే పోస్టులు దక్కేలా తెరవెనక రంగం సిద్ధమైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.’ అర్చకుల పోస్టులను బేరానికి అంగట్లో పెట్టేశారు. అర్చకులు, సహాయ అర్చకుల (పరిచారక) పోస్టులకు కొందరు అధికారులు ధర ఖరారు చేసి అమ్మకానికి తెరదీశారు. కొన్ని ఆలయాల్లో పద్ధతిగానే సాగుతున్నా, కొన్నింట్లో అక్రమాలకు గేట్లు ఎత్తారు.   

పే స్కేల్‌ పోస్టులు కావటంతో... 
గతంలో ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, డోలు సన్నాయి వాయించే వారి పోస్టులంటే పెద్ద ప్రాధాన్యం ఉండేది కాదు. వారికి జీతాలను ఆ దేవాలయ ఆదాయం నుంచే అత్తెసరుగా చెల్లించేవారు. కానీ, ఇప్పుడు దేవాదాయ శాఖ అధీనంలోని ఆలయాల్లో పనిచేసేవారికి ప్రభుత్వ పేస్కేల్‌ ప్రకారం జీతాలు అందుతున్నాయి. దీంతో ఆయా పోస్టులకు మంచి డిమాండ్‌ నెలకొంది. రాష్ట్రంలోని 55 ప్రధాన ఆలయాల్లో పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. అయితే, భర్తీ ప్రక్రియ టీజీపీఎస్సీ లాంటి నియామక సంస్థల ద్వారా కాకుండా, ఆలయాల స్థాయిలోనే జరిగేలా ఏర్పాటు చేశారు. నియామక నోటిఫికేషన్లను కూడా దేవాదాయ శాఖ కమిషనరేట్‌ ద్వారా కాకుండా ఆయా దేవాలయాల స్థాయిలోనే జారీ అయ్యాయి. అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కూడా స్వీకరించలేదు. దేవాలయ ఈఓలకు అభ్యర్థులు నేరుగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఆ దరఖాస్తుల ప్రక్రియ యావత్తు లోపభూయిష్టంగా సాగింది. చాలాచోట్ల అభ్యర్థులకు రశీదు కూడా ఇవ్వలేదు. ఒక్కో దేవాలయానికి ఒక్కో తేదీన నియామక తేదీలను ప్రకటించారు.  

ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు.. 
జిల్లా కలెక్టర్‌ కార్యాలయాలు, కొన్నింటికి దేవాదాయశాఖ ప్రధాన సెంటర్లలో పరీక్షలు, ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రధాన దేవాలయంలో ప్రక్రియ ఒక్కటి ప్రస్తుతానికి పూర్తయింది. అక్కడ దరఖాస్తు చేసుకున్న కొందరు అభ్యర్థులకు కనీసం పరీక్ష, ఇంటర్వ్యూ తేదీ కూడా వెల్లడించలేదు. తీరా ఇంటర్వ్యూల విషయం తెలిసి అభ్యర్థులు వెళ్లేసరికి ప్రక్రియ పూర్తయిందని, వారి దరఖాస్తులను తిరస్కరించామని చెప్పటంతో కంగు తిన్నారు. దీనిపై వారు కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా, దేవాలయం స్థాయిలోనే ప్రక్రియ జరిగినందున, అక్కడే తేల్చుకోవాలని చెప్పి పంపించేశారు. అభ్యర్థుల నుంచి భారీగా వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని, అందుకే చెప్పాపెట్టకుండా ప్రక్రియను పూర్తి చేశారని ఇతర అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఇప్పుడు మిగతా ఆలయాల ప్రక్రియ మొదలవుతోంది. చాలాచోట్ల ఇప్పటికే ఇదే తరహా ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రేటు ఖరారు చేసి బేరమాడుకుని పోస్టులను రిజర్వ్‌ చేశారని ఆరోపణలు వినిస్తున్నాయి. ఈ ప్రక్రియను రద్దు చేసి, నియామక బోర్డు ద్వారా పకడ్బందీగా ప్రక్రియ నిర్వహించి అర్హులకే పోస్టులు దక్కేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌ వినిపిస్తోంది. డోలు సన్నాయి వాద్యకారుల పోస్టుల భర్తీ ప్రక్రియను పర్యవేక్షించేందుకు కొందరు అర్హతలేని వారికి బాధ్యత అప్పగించారన్న ప్రచారం జరుగుతోంది.  

⇒ ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ సహా ఇతర పోస్టుల భర్తీ ప్రక్రియ అంతర్గతంగానే జరిగే సంప్రదాయం ఉండేది. కానీ, ఇది అక్రమాలకు అవకాశం కల్పిస్తోందన్న ఉద్దేశంతో ప్రభుత్వం భర్తీ ప్రక్రియను టీజీపీఎస్సీకి కేటాయించింది. త్వరలో జరగబోయే నియామక ప్రక్రియ పూర్తిగా నియామక బోర్డుల ఆధ్వర్యంలో జరగనుంది. డ్రైవర్, కండక్టర్‌ పోస్టులను పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీఎం, అసిస్టెంట్‌ డీఎం అయితే టీజీపీఎస్సీ, ఆర్టీసీ ఆసుపత్రి సిబ్బంది నియామకాలు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించబోతోంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement