
ఇంజనీరింగ్ విభాగం హెచ్‌ఓడీ సీటు కోసం పైరవీలు
మంత్రి అడ్లూరి పేషీ చుట్టూ ఈఈల ప్రదక్షిణలు
పోటీలో ఉన్న వారందరిపై భారీగా అవినీతి ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రత్యేకంగా ఉన్న ఇంజనీరింగ్ విభాగం అధిపతి పోస్టు కోసం జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ఈ విభాగం చీఫ్ ఇంజనీర్ (సీఈ)గా పనిచేసిన శంకరయ్య జూన్ 30న పదవీ విరమణ చేయటంతో ఆ కుర్చిలో తదుపరి ఎవరు కూర్చుంటారోననే చర్చ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్ (డీఎస్‌ఎస్)లో జోరుగా సాగుతోంది. విద్య, సంక్షేమ శాఖలకు సంబంధించిన నిర్మాణ పనులు చేపట్టేందుకు విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) ఉన్నప్పటికీ... గిరిజన సంక్షేమ శాఖకు మాత్రం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగం ఉంది. ఈ శాఖ నిర్మాణ పనులన్నీ ఈ విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీ కావడంతో కుర్చిని దక్కించుకునేందుకు పైరవీలకు తెరలేచింది.
మంత్రి అడ్లూరి వద్దకు పంచాయితీ
గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ విభాగాధిపతిగా చీఫ్ ఇంజనీర్ (సీఈ) ఉంటారు. ఆ తర్వాతి స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ), ఆయన కింద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ)లు ఉంటారు. వారి కింద ఉండే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ)లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తారు. సీఈ శంకరయ్య పదవీ విరమణ చేయటంతో.. ఆ బాధ్యతలను తదుపరి కేడర్‌లో ఉన్న ఎస్‌ఈకి అర్హతలను బట్టి ఇవ్వాలి. కానీ, ఈ విభాగంలో కొంత కాలంగా ఎస్‌ఈ, ఈఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదోన్నతుల విషయంలో నెలకొన్న సీనియార్టీ వివాదంతో ఈ ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోయింది. దీంతో ఈఈ పోస్టుల్లో ఇన్‌చార్జ్‌లే కొనసాగుతున్నారు.
ఇప్పుడు సీఈ కుర్చీ ఖాళీ కావడంతో ఆ ఇన్‌చార్జ్‌లు విభాగాధిపతి కుర్చీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఒకే బ్యాచ్‌కు చెందిన నలుగురు డీఈఈలు ఏకంగా సీఈ కుర్చీ దక్కించుకునేందుకు ఉన్నతస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. వయసు, మెరిట్ ఆధారంగా తనకే సీఈ కుర్చీ దక్కుతుందని ఒక అధికారి ధీమాతో ఉండగా... ప్రభుత్వ పెద్దల అండతో అనూహ్యంగా మరో అధికారి తెరపైకి రావడంతో ఉత్కంఠకు తెరలేచింది.
ప్రస్తుతం ఈ ఫైలు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేషీకి చేరింది. దీంతో పోటీలో ఉన్న డీఈఈలు మంత్రి పేషీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయితే, పోటీలో ఉన్న నలుగురు అధికారులపైనా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలున్నాయి. ఇద్దరిపై ఏసీబీ కేసులు కూడా ఉన్నాయి. మరొకరు స్థానికత అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీఈ కుర్చీ ఎవరికి దక్కుతుందా? అనే ఆసక్తి నెలకొంది.