సాక్షి, హైదరాబాద్: నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా చెలామణి అయి, వసూళ్లకు పాల్పడిన బత్తిని శశికాంత్ ఇంట్లో సోదాల సమయంలో ఓ వాచీ చోరీ చేసిన పోలీసు ‘దొంగ’ని ఫిల్మ్‌నగర్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశాడు. ఇతడు సిటీ ఆరŠడ్మ్ రిజర్వ్ (సీఏఆర్) విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎస్.శరణ్ కుమార్‌గా తేలింది. ఇతడు ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నాడు. బిల్డర్లు, బడాబాబులకు టోకరా వేసి భారీగా వసూళ్లు చేసిన శశికాంత్ షేక్‌పేటలోని అపర్ణా ఔరా అపార్ట్‌మెంట్స్‌లోని ఖరీదైన ఫ్లాట్‌లో నివసించాడు. ఇతడి వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఫిల్మ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసులు బుధవారం తెల్లవారుజామున శశికాంత్ ఫ్లాట్‌కు వెళ్లి సోదాలు చేశారు.
ఆ సమయంలో వీడియో రికార్డింగ్ విధుల్ని శరణ్ నిర్వర్తించాడు. సోదాల సమయంలో ఈ కానిస్టేబుల్ కళ్లు నిందితుడి వార్డ్‌రోబ్‌లో ఉన్న రోలెక్స్ వాచీపై పడ్డాయి. దీంతో దాన్ని అతగాడు తస్కరించి తన జేబులో వేసుకున్నాడు. ఈ తతంగం మొత్తం మరో కానిస్టేబుల్ రికార్డు చేసిన వీడియోలో చిక్కింది. అలా ఈ పోలీసు ‘దొంగతనం’ వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై సమగ్ర విచారణ అనంతరం ఫిల్మ్‌నగర్ ఠాణాలోనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కానిస్టేబుల్ శరణ్ కుమార్ ఏ వాచీ అయితే అత్యంత ఖరీదైందని భావించి, చోరీ చేసి, అరెస్టు అయ్యాడో..ఆ వాచీ ఒరిజినల్ రోలెక్స్ కాదని, ఇమిటేటెడ్ కాపీ పీస్ అయి అధికారులు తేల్చడం కొసమెరుపు.


