దెయ్యం పట్టిందని వస్తే చుక్కలు చూపించిన భూత వైద్యుడు.. నిప్పులపై నడిపించి

Exorcist Inter Student Walk On Fire Burns On Feet Pargi Vikarabad - Sakshi

పరిగి: ఇంటర్‌ చదువుతున్న బాలిక.. అనారోగ్యానికి గురైంది.. ఆమెకు దెయ్యం పట్టిందని ఓ బాబా భయపెట్టాడు.. భూతవైద్యం చేస్తానంటూ ఆమెను నిప్పులపై నడిపించాడు.. చిత్రహింసలు పెట్టాడు.. పాదాలు కాలిపోయి తీవ్రగాయాలతో ఆమె ఆస్పత్రి పాలైంది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం నస్కల్‌ గ్రామంలో ఐదు రోజుల కింద జరిగిన ఈ ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. 

భూత వైద్యం చేస్తానని.. 
వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం కుక్కింద గ్రామానికి చెందిన మంజుల వెంకటయ్య కుమార్తె అశ్విని(17) వికారాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె ఇటీవల అనారోగ్యానికి గురైంది. పరిగి మండలం నస్కల్‌ గ్రామానికి చెందిన వారి సమీప బంధువు.. తమ గ్రామంలోని దర్గా సమీపంలో ఓ బాబా (భూత వైద్యుడు) ఉన్నాడని, ప్రతి శుక్రవారం భూత వైద్యం చేస్తాడని అశ్విని తల్లిదండ్రులకు చెప్పింది.

ఈ క్రమంలో గత శుక్రవారం బాలికను అతడి వద్దకు తీసుకువెళ్లగా బాలికకు దెయ్యం పట్టిందని నమ్మబలికాడు. దెయ్యం వదిలిస్తానంటూ బాలికను చిత్రహింసలకు గురిచేశాడు. మండే నిప్పులపై బాలికను నడిపించాడంతోపాటు ఆమెపై కాళ్లుపెట్టి నిల్చున్నాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. దీంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు తమ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ పట్లోళ్ల రాములుకు ఈ విషయం తెలిపారు.

వెంటనే స్పందించిన ఆయన.. బాలికను వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగోలేదని.. పాదాలు తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ ఘటన విషయం తెలిసిన పరిగి డీఎస్పీ శ్రీనివాస్‌ బాధిత బాలికను పరామర్శించారు. సదరు భూత వైద్యుడిని అరెస్టు చేయాలని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top