త్వరలోనే సినిమా థియేటర్లు ఓపెన్‌?

Exhibitors Meets Talasani: Movie Theaters Open Soon In Telangana? - Sakshi

మంత్రి తలసానిని కలిసిన సినిమా ఎగ్జిబిటర్లు

ప్రాపర్టీ ట్యాక్స్, ఎస్‌జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి

సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హామీ

టాకీస్‌లు తెరవడంపై ఎగ్జిబిటర్లతో చర్చించి ప్రకటిస్తామన్న ఫిల్మ్‌ చాంబర్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకునే అవకాశం కనిపిస్తోంది. టాకీస్‌లను తెరవాలన్న దిశగా సినిమా ఎగ్జిబిటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏడాది నుంచి థియేటర్లు మూసి ఉంచిన నేపథ్యంలో ఆర్థికంగా దెబ్బతిన్నామని, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ఫిలిం చాంబర్, సినీ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సునీల్‌ నారంగ్, అనుపమ్‌రెడ్డి, అభిషేక్‌ నామా, సదానంద్‌గౌడ్, బాలగోవింద్, రాజ్‌తాడ్ల తదితరులు శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

థియేటర్లు మూసి ఉంచిన కాలానికి సంబంధించి ఆస్తిపన్ను మినహాయింపు ఇవ్వాలని, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో వాహనాల పార్కింగ్‌ చార్జి వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని, ఎస్‌జీఎస్టీని రద్దు చేయాలని, షూటింగ్‌ అనుమతుల చార్జీలను తగ్గించాలని కోరారు. దీనిపై స్పందించిన తలసాని.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు. అయితే ఆదివారం నుంచి సినిమా థియేటర్లను తెరవచ్చని ఫిలిం చాంబర్‌ తీర్మానించిందంటూ వార్తలు వచ్చాయి. కానీ థియేటర్లు తెరవడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అంతా ఏకాభిప్రాయానికి వచ్చాక అధికారికంగా ప్రకటిస్తామని ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్, ఫిలిం చాంబర్‌ నేతలు ప్రకటించారు. త్వరలోనే తెరిచే అవకాశం ఉందని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top