TSRTC: బస్‌భవన్‌లో స్వతంత్ర వజ్రోత్సవాలకు నరసింహ.. సత్తయ్య..

Ex Employees Of RTC Invited As Chief Guest For 75 Years Of Indian Independence At Bus Bhavan - Sakshi

బస్‌భవన్‌లో స్వతంత్ర వజ్రోత్సవాలకు ముఖ్యఅతిథులుగా ఆహ్వానం 

తొలి పంద్రాగస్టు వేడుకలను తిలకించిన ‘ఆర్టీసీ కురువృద్ధులకు’ సమున్నత గౌరవం 

సాక్షి, హైదరాబాద్‌: 1947 పంద్రాగస్టు.. తొలిసారి జాతీయ పతాకం ఎగిరినప్పుడు ఆ ఇద్దరూ మువ్వన్నెల జెండా రెపరెపలను తిలకించారు. మళ్లీ ఇప్పుడు స్వతంత్ర వజ్రోత్సవాల వేళ అదే జాతీయ పతాకాన్ని వారు ఎగురవేయనున్నారు. మొదటి పంద్రాగస్టు వేడుకల కాలంలో వారు నిజాం రోడ్డు రవాణా విభాగం ఉద్యోగులుకాగా.. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆర్టీసీ మాజీ ఉద్యోగులుగా.. ఆర్టీసీ ప్రధాన కేంద్రంలో జెండా పండుగకు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు.

వారే నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (ఎన్‌ఎస్‌ఆర్‌–ఆర్‌టీడీ)లో చేరి ఏపీఎస్‌ఆర్టీసీ (ఉమ్మడి రాష్ట్రం)లో రిటైరైన ‘ఆర్టీసీ కురువృద్ధులు’ 97 ఏళ్ల టి.ఎల్‌.నరసింహ, 92 ఏళ్ల ఎం.సత్తయ్య. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్‌భవన్‌లో జెండా పండగకు ఈ ఇద్దరినీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారే జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇది ఆర్టీసీ సగర్వంగా భావిస్తోందని సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని సమున్నతంగా సత్కరించడంతోపాటు ఆర్టీసీ పక్షాన కొన్ని వరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. 

ప్రస్తుతం బస్‌పాస్, మందులు తప్ప.. 
1925లో జన్మించిన బొల్లారం వాసి టి.ఎల్‌.నరసింహ 1944లో తాత్కాలిక గుమాస్తాగా నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరి 1983లో ఆర్టీసీ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌గా రిటైరయ్యారు. నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కాలో రూ. 47 జీతంతో మొదలుపెట్టి రూ. 1,740 అందుకొని పదవీవిరమణ పొందారు. మరోవైపు ప్రస్తుతం యానాంలో ఉంటున్న ఎం.సత్తయ్య మార్చి 1930లో జన్మించారు.

ఆయన 1946లో ఆఫీస్‌ బాయ్‌గా ఉస్మానియా సిక్కా రూ. 8 జీతంతో ఉద్యోగంలో చేరి ముషీరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన స్టోర్స్‌లో అసిస్టెంట్‌ స్టోర్‌ కీపర్‌గా 1988లో రిటైరయ్యారు. ఆయన చివరి జీతం రూ.855. ఆర్టీసీలో పెన్షన్‌ వసతి లేనందున ప్రస్తుతం వారు సంస్థ నుంచి బస్‌పాస్‌తోపాటు ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి నుంచి మందులు తీసుకుంటున్నారు. బస్‌పాస్‌ రికార్డుల ఆధారంగానే వారిని ఆర్టీసీ అధికారులు గుర్తించి పంద్రాగస్టు కార్యక్రమాలకు ఆహ్వానించారు. 

ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ ర్యాలీ
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నిజాం కాలం బస్సు 
కవాడిగూడ: దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ శనివారం వినూత్న ర్యాలీ నిర్వహించింది. నిజాం కాలంలో 1932లో ప్రారంభించిన మొట్టమొదటి బస్సు నుంచి ప్రస్తుతం సంస్థ నడుపుతున్న అత్యాధునిక బస్సుల వరకు ఉన్న వాటితో పరేడ్‌ చేపట్టింది. ఈ ర్యాలీ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు సాగింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించిన ఈ ర్యాలీలో 1932 నాటి నాందేడ్‌ బస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బ్యాండ్‌ మేళా, బైక్‌ ర్యాలీ సైతం నిర్వహించారు. నిజాంపేట ఆర్టీసీలో 1944లో చేరి 1983లో రిటైరైన టి.ఎల్‌. నరసింహను సజ్జనార్‌ పూలబొకే, శాలువాతో సత్కరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top