ప్రతీ కార్మికుడికి హెల్త్‌ ప్రొఫైల్‌  | ESIC Decided To Maintain Health Profile Every Worker Covered Under ESI | Sakshi
Sakshi News home page

ప్రతీ కార్మికుడికి హెల్త్‌ ప్రొఫైల్‌ 

Jan 13 2022 3:54 AM | Updated on Jan 13 2022 7:58 AM

ESIC Decided To Maintain Health Profile Every Worker Covered Under ESI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ చందాదారుల ఆరోగ్య భద్రత విషయంలో కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈఎస్‌ఐ పరిధిలో ఉన్న ప్రతీ కార్మికుడి హెల్త్‌ ప్రొఫైల్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డ కార్మికులకు వైద్య చికిత్స, మందుల పంపిణీ వరకు పరిమితమైన ఈఎస్‌ఐసీ... ఇకపై కార్మికుడి ఆరోగ్య చిట్టా మొత్తాన్ని నిక్షిప్తం చేయనుంది. అంతేకాకుండా క్రమం తప్పకుండా ఏటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి సదరు కార్మికుడికి హెచ్చరికలు సైతం ఇవ్వనుంది.

దీంతో భవిష్యత్‌ ఆరోగ్య పరిస్థితిపై కొంత అంచనా వస్తుందని, సకాలంలో జాగ్రత్తలు తీసుకుంటే కార్మికుడికి ఆరోగ్యకర జీవితం అందుతుందని సంస్థ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 63వేల సంస్థలు, పరిశ్రమలు, వాణిజ్య సముదాయాలున్నాయి. వీటి పరిధిలో 21 లక్షల మంది చందాదారులున్నారు. వీరి కుటుంబ సభ్యులను కలుపుకుంటే దాదాపు 80 లక్షలు అవుతారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో ఏటా సగటున 3.5 లక్షల మంది ఐపీ (ఇన్‌పేషెంట్‌) కేటగిరీలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. వీటికి అదనంగా మరో 20 శాతం మంది ఓపీ సేవలు కూడా పొందేవారున్నట్లు ఈఎస్‌ఐసీ చెబుతోంది. 

ఆరోగ్య పరీక్షలు కీలకం 
కార్మికుల హెల్త్‌ ప్రొఫైల్‌ నిర్వహణలో ఆరోగ్య పరీక్షల ప్రాత కీలకం. దీంతో ఏడాదికోసారి కార్మికులకు పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఈఎస్‌ఐసీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం అనారోగ్య సమస్యలు తలెత్తిన వారు మాత్రమే పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు. ఇకపై హెల్త్‌ ప్రొఫైల్‌ నిర్వహణలో భాగంగా తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అనంతరం ఫలితాలను ఈఎస్‌ఐసీ వెబ్‌సైట్‌లో కార్మికుడి డేటాలో నిక్షిప్తం చేసి, ప్రతి సంవత్సరం ఈ వివరాలను అప్‌డేట్‌ చేస్తారు. పరీక్షల్లో ఏవైనా అనారోగ్య సంబంధిత లక్షణాలు, దీర్ఘకాల వ్యాధులు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఆస్పత్రికి రిఫర్‌ చేసి చికిత్సను అందిస్తారు. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షలను అన్ని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో చేపట్టేలా చర్యలు మొదలు పెట్టారు. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాల పనితీరుతోపాటు రక్త, మూత్ర పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు చందాదారులందరికీ స్మార్ట్‌ కార్డులు ఇవ్వాలని కూడా సంస్థ నిర్ణయించింది. ఏప్రిల్‌ నాటికి ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement