కేసీఆర్‌ కోసం ప్రాణం ఇచ్చేందుకు సిద్ధం

Errabelli Dayakar Rao Speech In Rythu Vedika Inauguration Program In Warangal - Sakshi

ఆయన దయవల్లే మంత్రిని అయ్యా 

40 ఏళ్ల రాజకీయ జీవితంలో అందరూ వాడుకొని వదిలేశారు.. 

కేసీఆర్‌ ఉన్నంతకాలం మోటార్లకు మీటర్లు రావు 

కొడకండ్ల సీఎం సభలో మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం

సాక్షి, వరంగల్‌: ‘నలభై ఏండ్ల నా రాజకీయ జీవితంలో అందరూ నన్ను వాడుకున్నారు. ఏ ఒక్కరూ కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయవల్ల నాకు మంత్రి పదవి వచ్చింది. ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమే’అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం కొడకండ్లలో రైతువేదిక ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సభలో మంత్రి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో నియోజకవర్గాన్ని బాగు చేసుకుంటున్నానని, రాజకీయంగా తగిన గుర్తింపు, స్థాయినిచ్చిన కేసీఆర్‌ ఆశీర్వాదం తనకు ఎల్లప్పుడూ ఉండాలని పేర్కొన్నారు. కేసీఆర్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, కేసీఆర్‌ ప్రాణం ఉన్నంత వరకు మోటార్లకు మీటర్లు పెట్టే పరిస్థితి రాదని నమ్ముతున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు.  

కాకతీయులను మించిన మహానుభావుడు
తెలంగాణ రాష్ట్రంలో అసాధ్యాలను సుసాధ్యం చేసిన అపర భగీరథుడు, కాకతీ య రాజులను మించిన మహానుభావుడు కేసీఆర్‌.. అని మంత్రి ఎర్రబెల్లి దయా కర్‌రావు సీఎంను కొనియాడారు. అహర్నిశలు ప్రజల సంక్షేమం కోసం శ్రమిస్తున్న సీఎంని మనందరం గుండెల్లో పెట్టుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జనగామ అంతా కరువు ప్రాంతంగా ఉండేదని, తాను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పు డు చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, ఎస్సారెస్పీ ఎండిపోయి తుమ్మ చెట్లు మొలిచాయని, దేవాదుల పూర్తికాలేదని గుర్తుచేశారు. రైతుల పేరు చెప్పుకుని గతంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, సాగునీరు, విద్యుత్‌  కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ఇవాళ కేసీఆర్‌ నాయకత్వంలో దేవాదుల పూర్తి చేసుకుని చెరువులను నింపుకున్నామని, ఎస్సారెస్పీ కాల్వకు నీళ్లు వస్తున్నాయని, దండగన్న వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నామని పేర్కొన్నారు. రైతుబిడ్డ సీఎం కావడంవల్లనే ఇదంతా సా«ధ్యమైందని, రైతుల జీవితాల్లో కేసీఆర్‌ గొప్ప మార్పు తీసుకొచ్చారన్నారు. సీఎం కేసీఆర్‌ దయవల్ల పాలకుర్తి నియోజకవర్గానికి సాగునీరు వచ్చిందని తెలిపారు.

కొత్త ఒరవడికి శ్రీకారం 
సాక్షి, జనగామ: రైతు వేదికల నిర్మాణంతో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. ఇది భారతదేశ చరిత్రలోనే నిలిచి పోయే రోజు. అన్నం పెట్టే రైతన్నను ఏడు దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోలేదు. కారణజన్ముడైన కేసీఆర్‌.. రైతులు అడగక ముందే అన్నీ ఇస్తున్నారు. రైతు వేదిక ప్రారంభం సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం. రక్తం పారిన నేలలో సీఎం కేసీఆర్‌ నీళ్లు పారిస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల ఎకరాల పంట పండుతోంది. రైతు పండించే ప్రతీ గింజ, తెల్లని పత్తిలో కేసీఆర్‌ కనిపిస్తున్నారు. కవి దాశరథి చెప్పినట్లుగా ఇప్పుడు కరువు కాటకాలు కనిపించడం లేదు. కృష్ణా, గోదావరి జలాలతో తెలంగాణ సమాజం కన్న కలలను సీఎం నిజం చేస్తున్నారు. 
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి 

వ్యవసాయాన్ని పండుగ చేశారు 
కొందరు ముఖ్యమంత్రులు వ్యవసాయాన్ని దండగ చేస్తే కేసీఆర్‌ పండుగ చేశారు. రైతు పక్షపాతి, రైతు ప్రేమికుడు కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ వస్తే కరెంటు రాదని కొందరు ఎద్దేవా చేశారు. కానీ కేసీఆర్‌ చొరవతో 24 గంటల కరెంటు వస్తోంది. 1.65 లక్షల మంది రైతు బంధు సైనికులకు బాధ్యత వహించడమే కాకుండా సీఎంకు దగ్గరగా ఉండే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా.     – పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top