వారంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ | Engineering counseling notification in one week | Sakshi
Sakshi News home page

వారంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌

Jun 3 2026 4:19 AM | Updated on Jun 3 2026 4:19 AM

Engineering counseling notification in one week

15 రోజుల్లో యాజమాన్య కోటా నోటిఫికేషన్‌

ఉన్నత విద్యామండలి సన్నాహాలు

యూనివర్సిటీల నుంచి అందని సీట్ల వివరాలు

పూర్తిస్థాయి తనిఖీలు కాలేదంటున్న వీసీలు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. వారం రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశముంది. ఈ దిశగా ఉన్నత విద్యామండలి సన్నాహాలు చేస్తోంది. దీని తర్వాత యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌ ఇస్తారు. కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ మొదలైన వారం రోజుల్లో ఇది ఉండొచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. జాతీయ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీకి జోసా ఇప్పటికే నోటిఫికేషన్‌ ఇచ్చింది. 

మంగళవారం నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జాతీయ కాలేజీల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు రాష్ట్ర కాలేజీకి దరఖాస్తు చేస్తారు. వీరికి వచ్చే సీట్లను ఆఖరు వరకూ రిపోర్టు చేసి ఆపుతారు. కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీల యాజమాన్యాలు ఆఖరులో బీ కేటగిరీ కింద వీటిని అమ్ముకుంటాయి. దీన్ని అడ్డుకోవడానికి రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ కూడా జోసాతో సమానంగా నిర్వహించాలని భావిస్తున్నారు. 

అందని వివరాలు
కౌన్సెలింగ్‌ పోర్టల్‌కు ఆయా యూనివర్సిటీలు సీట్ల వివరాలు అందించలేదు. ఇది జరిగితేనే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1.16 లక్షల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కింద భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌ పోర్టల్‌లో వీటి వివరాలను వర్సిటీలు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ వర్సిటీలు ఈ ప్రక్రియను పూర్తి చేయలేదు. ప్రైవేట్‌ కాలేజీలకు విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు ఇస్తాయి. 

ఈ క్రమంలో కాలేజీలను వర్సిటీ అధికారులు తనిఖీలు చేస్తారు. ఇటీవల తనిఖీల్లో కొన్ని కాలేజీల్లో ఫ్యాకల్టీ సరిగ్గా లేదని తేలింది. ఏఐ, ఏఐఎంఎల్, డేటాసైన్స్, సైబర్‌ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్‌ కోర్సులకు అర్హత గల అధ్యాపకులు లేరని గుర్తించారు. ఫ్యాకల్టీ సమకూర్చుకునేందుకు కాలేజీలకు కొంత సమయం ఇచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అన్ని ఆధారాలతో ఫ్యాకల్టీ వివరాలు వచ్చిన తర్వాత ఆయా కోర్సులను కౌన్సెలింగ్‌ జాబితాలోకి చేరుస్తామంటున్నారు. త్వరలోనే ఇది పూర్తి చేస్తామని వీసీలు చెబుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement