విద్యుత్‌ డిమాండ్‌కు ‘లాక్‌డౌన్‌’! 

Electricity Consumption Drastically Reduced Last Year - Sakshi

గతేడాది భారీగా తగ్గిన విద్యుత్‌ వినియోగం

సీఈఏ 19వ సర్వే నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్రంలో గతేడాది విద్యుత్‌ వినియోగం భారీగా తగ్గింది. ప్రధానంగా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, రైల్వే, మెట్రో రవాణా సేవలు మూతపడటంతో విద్యుత్‌ డిమాండ్‌ అమాంతం పడిపోయింది. 2019–20లో 68,303 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) వార్షిక విద్యుత్‌ వినియోగం జరగ్గా 2020–21లో అది 67,694 ఎంయూలకు తగ్గిపోయింది. ప్రస్తుత 2021–22 సంవత్సరంలో పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటుండడంతో మళ్లీ విద్యుత్‌ వినియోగం పుంజుకుంటోంది.

ఈ ఏడాది రోజువారీ రాష్ట్ర గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ 17,900 మెగావాట్లకు పెరగనుందని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అంచనా వేసింది. ఆ మేరకు విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యం పెంచుకోవడానికి రాష్ట్ర విద్యుత్‌ సంస్థలకు అనుమతిచ్చింది. మరోవైపు 2026–27 నాటికి రోజువారీ విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ 18,653 మెగావాట్లకు, వార్షిక విద్యుత్‌ వినియోగం 1,04,345 ఎంయూలకు పెరగొచ్చని కేంద్ర విద్యుత్‌ సంస్థ (సీఈఏ) 19వ ఎలక్ట్రిక్‌ పవర్‌ సర్వే రిపోర్టులో పేర్కొంది. 

అవసరానికి అక్కరకు రాని పునరుత్పాదక ఇంధనం.. 
పునరుత్పాదక విద్యుదుత్పత్తి స్థాపిత సామర్థ్యంలో దేశంలోనే సంపన్న రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో దీనివల్ల ఆశించిన ప్రయోజనం చేకూరట్లేదు. విద్యుత్‌ గరిష్ట డిమాండ్‌ నెలకొన్న వేళల్లో పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి అందుబాటులో ఉండడం లేదు. ప్రస్తుతం తెలంగాణ 4,389.4 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నా వాటి వాస్తవ ఉత్పత్తి సామర్థ్యం (పీఎల్‌ఎఫ్‌) సుమారు 20 శాతమే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top