
అందుబాటులోకి ఎర్త్ సైన్సెస్ వర్సిటీ
కొత్తగూడెంలో నేడు సమావేశమవనున్న ఉన్నతాధికారులు
సాక్షి హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మైనింగ్ కాలేజీని రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్ల బడ్జెట్‌తో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా ఉన్నతీకరించడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి నాలుగు ప్రధాన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. 312 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వర్సిటీకి ప్రభుత్వం దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరు పెట్టడం తెలిసిందే. ఈ వర్సిటీలో స్థానిక పరిస్థితులు, అంతర్జాతీయ ప్రమాణాలు, ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా కోర్సులు అందించనున్నారు. తొలి దశలో జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ, జియాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు.
డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) పరిధిలోనే కోర్సుల ప్రవేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ‘దోస్త్’ప్రత్యేక విడత నిర్వహించాలని నిర్ణయించారు. ఈ అంశంపై వర్సిటీ తాత్కాలిక వీసీ, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తదితరులు బుధవారం కొత్తగూడెంలో సమీక్షించనున్నారు.
ఈ నెల 25న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఒక్కో కోర్సులో 60 సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఫిజిక్స్, కెమెస్ట్రీ నేపథ్యంతో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులు. తదుపరి దశల్లో ప్లానెటరీ జియాలజీ, జియోమార్ఫాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, మినరాలజీ, ఎన్విరాన్‌మెంటల్ జియాలజీ వంటి కోర్సులను ప్రవేశపెట్టాలని అధికారులు భావిస్తున్నారు.
ఉపాధి అవకాశాలే లక్ష్యం
భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో సింగరేణి గనులున్నాయి. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంది. నవభారత్, బయ్యారం మైన్స్, మైలారం కాపర్ మైన్స్ వంటివి కూడా అక్కడే ఉన్నాయి. దీంతో ఎర్త్ సైన్సెస్ కోర్సులు పరిశోధన స్థాయికి చేరువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్ విధానం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్లాసులను సైతం అందించే వీలుందని అధికారులు అంటున్నారు. దీంతో యువతకు ఈ కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెబుతున్నారు.