డ్రాగన్‌ ఫ్రూట్‌‌: ఎకరానికి 6.61 లక్షల రుణం.. | Dragon Fruit Makes Debut In Telangana | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ ఫ్రూట్‌‌: ఎకరానికి 6.61 లక్షల రుణం..

Mar 29 2021 3:03 AM | Updated on Mar 29 2021 3:08 AM

Dragon Fruit Makes Debut In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చాలా కొద్దిస్థాయిలో సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ పంటకు ఎక్కువ మొత్తంలో పంట రుణం ఇవ్వాలని రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌) నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 500 ఎకరాల్లోనే సాగు చేస్తున్న ఈ పంటను ప్రోత్సహించేందుకు ఎకరానికి ఏకంగా రూ.6.61 లక్షల రుణం ఇవ్వాలని తీర్మానించింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ పంటకు రూ. 4.25 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2021–22 ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్లలో వివిధ పంటలకు ఖరారు చేసిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ వివరాలపై టెస్కాబ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. సాగుఖర్చు, ఉత్పాదకత, నీటివసతి ఆధారంగా రుణ నిర్ధారణ చేసింది.

గతేడాదితో చూస్తే ఈసారి పెద్దగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెరగలేదని టెస్కాబ్‌ వర్గాలు తెలిపాయి. గతేడాది మాదిరిగానే వరికి సాగునీటి వనరులు ఉన్నచోట రూ.34 వేల నుంచి రూ.38 వేల వరకు ఫైనాన్స్‌ ఖరారు చేశారు. మొక్కజొన్న పంటకు రెండు సీజన్లకు కలిపి సాగునీటి వనరులు ఉన్నచోట రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు, సాగునీటి వనరులు లేనిచోట రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు ఇవ్వనున్నారు. కందులకు సాగునీటి వనరులు ఉన్నచోట రూ.17 వేల నుంచి రూ.20 వేలకు, సాగునీటి వసతి లేనిచోట రూ.15 వేల నుంచి రూ.18 వేలు ఖరారు చేశారు. కంది ఆర్గానిక్‌ పంటలకు రూ.17 వేల నుంచి రూ.20 వేలు నిర్ధారించారు.

పత్తికి రూ.35 వేల నుంచి రూ.38 వేల వరకు, పత్తి విత్తనోత్పత్తికి రూ.1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షలు ఖరారు చేశారు. మిర్చికి రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు, పందిరి కూరగాయల సాగుకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు. పసుపుకు రూ.70 వేల నుంచి రూ.75 వేల వరకు, ఖర్జూరం సాగుకు రూ.3.9 లక్షల నుంచి రూ.4 లక్షలు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను నిర్ధారణ చేశారు. పూర్వ జిల్లాల ప్రకారం ఒక్కో జిల్లాలో ఒక్కరకంగా స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఉంటుంది. ఆ ప్రకారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని టెస్కాబ్‌ తెలిపింది. 

పరిమితి పెంచకపోవడంపై విమర్శలు..
రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే వరి, కంది, పత్తి వంటి పంటలకు రుణ పరిమితి ఈసారి పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఏటా రైతులకు సాగు ఖర్చులు పెరుగుతుంటే, పంట రుణ పరిమితి పెంచట్లేదని పేర్కొంటున్నారు. నిర్ధారించిన మేరకు బ్యాంకులు రుణాలు ఇవ్వట్లేదన్న ఆరోపణలూ ఉన్నాయి. ఆర్గానిక్‌ పద్ధతిలో పండించే కూరగాయలు సహా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులకు ప్రత్యేకంగా రుణాలు ఇస్తారు. సేంద్రియ సాగు చేసే కంది, మినుములు, పెసర్లకు ఎకరానికి రూ.17 వేల నుంచి రూ.20 వేలు వంతున ఖరారు చేసింది. సేంద్రియ కూరగాయలు సాగు చేస్తే ఎకరానికి రూ.37 వేల నుంచి రూ.40 వేలు ఇవ్వాలని తీర్మానించింది. దీంతో ఈసారి ఆర్గానిక్‌ పంటలు, కూరగాయల సాగు మరింత పెరుగుతాయని టెస్కాబ్‌ వర్గాలు చెబుతున్నాయి.

టమాటకు ఊరట..!
టమాటాకు ఈసారి రుణ పరిమితి పెంచారు. సాగునీటి కింద వేసే టమాటాకు రూ.45 వేల నుంచి రూ.48 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మిద్దె తోటలకు మొదటి దశలో రూ.9,500 నుంచి రూ.10,500, రెండో దశలో రూ.19 వేల నుంచి రూ.21 వేలు, మూడో దశలో రూ.28,500 నుంచి రూ.31,500 ఇస్తారు. గతేడాది కంటే కొంచెం పెంచారు. మెడికల్, అరోమాటిక్‌ ప్లాంట్స్‌కు రూ.37,500 నుంచి రూ.42,500 ఇస్తారు. ఉల్లిగడ్డకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు, పుచ్చకాయకు రూ.27 వేల నుంచి రూ.30 వేలకు పెంచారు. ఇక పశుసంవర్థక, మత్స్య రంగంలో యూనిట్ల వారీగా రుణ పరిమితులు ఖరారు చేశారు.

20 గొర్రెలు ఒక పొట్టెలును కొనుగోలు చేసుకునేందుకు రూ.1.1 లక్షల నుంచి రూ.1.2 లక్షలు ఖరారు చేశారు. పందుల పెంపకానికి యూనిట్‌కు (3+1) రూ.43 వేలు నిర్ధారించారు. ఇక పౌల్ట్రీ ఫామ్‌ పెడితే బ్రాయిలర్‌కు ఒక బర్డ్‌కు రూ.150, లేయర్స్‌కు అయితే రూ.310 ఇస్తారు. డెయిరీకి ఒక పాడి ఆవు లేదా బర్రె తీసుకునేందుకు రూ.21 వేల నుంచి రూ.23 వేలు రుణం నిర్ణయించారు. రెండున్నర ఎకరాల్లో చేపల పెంపకానికి రూ.4 లక్షల రుణం ఖరారు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement