Engineering Academic Calendar: ఈ షెడ్యూలు అమలయ్యేనా?

Doubts Over The Academic Calendar Issued By AICTE - Sakshi

జూన్‌ నెలాఖరుకల్లా ఇంజనీరింగ్‌ కాలేజీలకు అనుమతులు 

జూలై 15 నాటికి యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు 

ఆగస్టు 31కల్లా మొదటి దశ, సెప్టెంబర్‌ 9కల్లా రెండో దశ కౌన్సెలింగ్‌ 

సెప్టెంబర్‌ 15 నుంచే ఇంజనీరింగ్, ఫార్మసీ తరగతులు 

ఏఐసీటీఈ జారీచేసిన అకడమిక్‌ కేలండర్‌పై అనుమానాలు

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు 2021–22 విద్యా సంవత్సరానికి అకడమిక్‌ కేలండర్‌ను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసింది. కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతుల జారీ తేదీలు, ప్రవేశాలు పూర్తి చేయాల్సిన గడువు, తరగతుల ప్రారంభం వంటి అన్ని అంశాలను పొందుపరిచింది. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యా సంస్థల్లో సెప్టెంబర్‌ 9 నాటికి ప్రవేశాలను పూర్తి చేసి, 15వ తేదీ నాటికల్లా ప్రథమ సంవత్సర విద్యార్థులకు తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. ప్రథమ సంవత్సరం మినహా ఇతర సంవత్సరాల వారికి మాత్రం సెప్టెంబర్‌ 1 నుంచే తరగతులను ప్రారంభించాలని వెల్లడించింది. మరోవైపు పీజీడీఎం/పీజీసీఎం కోర్సుల్లో జూలై 1 నుంచే తరగతులను ప్రారంభించాలని, జూలై 10లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని పేర్కొంది.  

షెడ్యూలు ప్రకారం జరిగేనా? 
దేశవ్యాప్తంగా కరోనా కారణంగా గతేడాది అక్టోబర్‌ లో తరగతుల బోధనను ప్రారంభించాల్సి వచ్చింది. ఇప్పుడు కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంది. అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెలలో జరిగే పరీక్షలను వాయిదా వేయాలని ఓవైపు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) ఉత్తర్వులు జారీ చేసింది. గత నెలలో ఆన్‌లైన్‌లోనూ నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ పరీక్షలను, ఈనెలలో నిర్వహించాల్సిన జేఈఈ మెయిన్‌ను కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వాయిదా వేసింది. వీటిని ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

కరోనా అదుపులోకి వస్తే తప్ప వాటిని నిర్వహించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఇక రాష్ట్రాల వారీ పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాల్లో సెట్స్‌ను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏఐసీటీఈ జారీ చేసిన అకడమిక్‌ కేలండర్‌ అమలు అవుతుందా లేదా? అన్నది అనుమానమే. గతేడాది కూడా సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులు ప్రారంభించేలా అకడమిక్‌ కేలండర్‌ను జారీ చేసినా తరువాత దాన్ని పలుమార్లు మార్పు చేయాల్సి వచ్చింది. కరోనా వల్ల చివరకు అక్టోబర్‌లో ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించింది. ఈసారి కూడా కరోనా కేసులు అదుపులోకి రాకపోతే అదే పరిస్థితి ఉంటుందని అధ్యాపక సంఘాలు పేర్కొంటున్నాయి.  

ఇంకా పూర్తికాని బోధన.. 
ప్రస్తుతం రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆన్‌లైన్‌ విద్యే కొనసాగుతోంది. ఇంకా తరగతులు పూర్తి కాలేదు. వచ్చే నెలాఖరుకు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇంకా వారికి పరిస్థితులను బట్టి పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్‌ 1 నుంచే ప్రథమ సంవత్సరం మినహా మిగతా సంవత్సరాల వారికి సెప్టెంబర్‌ 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ఏఐసీటీఈ పేర్కొంది. అయితే వారికి ఏఐసీటీఈ నిర్దేశిత సమయంలో బోధనను ప్రారంభించడం సాధ్యం కాదని పేర్కొంటున్నాయి. ఏఐసీటీఈ జారీ చేసిన ఉత్తర్వులు గందరగోళాన్ని సృష్టించేలా ఉన్నాయని అధ్యాపక సంఘాల నేతలు అయినేని సంతోష్‌కుమార్, బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ఆలోచించకుండానే అకడమిక్‌ కేలండర్‌ను జారీ చేసిందని ఆరోపించారు. 

ఈనెలలో పరీక్షలు వద్దు: యూజీసీ 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈనెలలో నిర్వహించాల్సిన పరీక్షలను ప్రస్తుతానికి నిలిపివేయాలని యూజీసీ పేర్కొంది. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌ పరీక్షల విషయంలో కేంద్రం, తాము జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధానమని, ఈ పరిస్థితుల్లో మే నెలలో జరగాల్సిన అన్ని పరీక్షలను నిలిపేయాలని స్పష్టం చేసింది.       

ఇదీ ఇంజనీరింగ్, ఫార్మసీ అకడమిక్‌ కేలండర్‌..  

  • 30–6–2021: సాంకేతిక విద్యా సంస్థలకు అనుమతులకు చివరి గడువు 
  • 15–7–2021: యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు పూర్తికి చివరి తేదీ 
  • 31–8–2021: మొదటి దశ కౌన్సెలింగ్, సీట్లు కేటాయింపు, ప్రవేశాలు పూర్తి 
  • 1–9–2021: ప్రథమ సంవత్సరం మినహా మిగతా  వారికి తరగతులు ప్రారంభం. 
  • 9–9–2021: రెండో విడత కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు, ప్రవేశాలు పూర్తి 
  • 10–9–2021నాటికి: సీట్లు రద్దు చేసుకున్న వారికి పూర్తి ఫీజు తిరిగి ఇచ్చేయాలి 
  • 15–9–2021: ప్రథమ సంవత్సరంలో మిగిలిన ఖాళీల్లో విద్యార్థుల చేరికలు పూర్తి 
  • 15–9–2021: ప్రథమ సంవత్సరంలో చేరిన వారికి తరగతుల ప్రారంభానికి చివరి గడువు 
  • 20–9–2021: ద్వితీయ సంవత్సరంలో లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు పూర్తి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top