అన్ని పార్టీల్లోనూ అదే సీన్‌ అలక.. అసంతృప్తి 

Disagreement In All Political Parties In Telangana - Sakshi

ప్రధాన రాజకీయ పక్షాలకు తలనొప్పిగా మారుతున్న సొంత పార్టీ నేతలు

ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో ఇబ్బందికర పరిస్థితి 

బహిరంగంగా విరుచుకుపడుతున్న కొందరు..లోలోన రగిలిపోతున్న మరికొందరు  

బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు టీఆర్‌ఎస్‌కూ తప్పని అసమ్మతి 

కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంపై బాహాటంగానే నేతల విమర్శలు 

ఇప్పటికే పార్టీ వీడిన రాజగోపాల్‌రెడ్డి..వెంకట్‌రెడ్డి, శశిధర్‌రెడ్డి, ఏలేటి బాటలో అనిరుధ్‌రెడ్డి 

బీజేపీలోనూ లుకలుకలు..సంజయ్, కిషన్‌రెడ్డి మధ్య సత్సంబంధాలు పైపైనే!.. బండి–ఈటల మధ్య గ్యాప్‌! 

తాజాగా గళం విప్పిన విజయశాంతి 

మునుగోడుతోపాటు పలుచోట్ల టీఆర్‌ఎస్‌ నేతల్లో అసమ్మతి

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో ఏడాది మాత్రమే గడువుంది. దీంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ సభలు, సమావేశాలు, పాదయాత్రలతో జోరు పెంచుతున్నాయి. ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలతో విరుచుకుపడుతూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి. అయితే అదే సమయంలో సొంత పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి, అసమ్మతి,కొందరి అలకలు ఆయా పార్టీలకు తలనొప్పిగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా ముక్కోణపు పోటీ ఉంటుందని భావిస్తుండగా.. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలపై కొందరు బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు అంతర్గతంగా రగిలిపోతున్నారు. ఇక అధికార టీఆర్‌ఎస్‌లోనూ అక్కడక్కడా అసంతృప్తి వ్యక్తమవుతుండగా, నేతల మధ్య ఆధిపత్య పోరు సమస్యగా మారుతోంది.  

కాంగ్రెస్‌లో కాస్త ఎక్కువే.. 
ప్రజాస్వామ్యం పాలు కాస్త ఎక్కువగా ఉండే కాంగ్రెస్‌ పార్టీ నాయకత్వంపై పలువురు నేతలు బాహాటంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఏఐసీసీ బాధ్యుల పనితీరునూ తప్పుబడుతున్నారు. అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలోనే మునుగోడు ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. దీనికి ముందు, ఆ తర్వాత కూడా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి లక్ష్యంగా విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.

ఆయన పార్టీని తన ఇష్టానుసారం నడిపిస్తున్నారని నేతలు ధ్వజమెత్తుతున్నారు. సీనియర్లను ఖాతరు చేయడం లేదని, పార్టీని సొంత వ్యవహారంలా నడిపిస్తున్నారంటూ తప్పుబడుతున్నారు. మాజీ మంత్రి శశిధర్‌రెడ్డి రెండురోజుల క్రితం.. కాంగ్రెస్‌ అధ్వానస్థితికి వెళ్లడానికి రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌లే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టించాయి. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై ఫిర్యాదు చేసేందుకు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కూడా శశిధర్‌రెడ్డి కోరడం చర్చనీయాంశమయ్యింది.

మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్‌రెడ్డి తనను వ్యక్తిగతంగా కించపరిచారంటూ ఫిర్యాదు చేసేందుకు, రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వెల్లడించేందుకు సోనియా అపాయింట్‌మెంట్‌ కోరడం గమనార్హం. ఇక పార్టీ జడ్చర్ల ఇన్‌చార్జిగా ఉన్న అనిరుధ్‌రెడ్డి ఇటీవల పార్టీలో చేరిన ఎర్రశేఖర్‌పై మండిపడుతున్నారు. ఆయన చేరికపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాణిక్యం ఠాగూర్‌కు లేఖ కూడా రాశారు. రెండురోజుల క్రితం గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో మరోనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా పార్టీలో ఉండదలుచుకోవడం లేదంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అలజడికి కారణమయ్యాయి. 

కమలంలో చాపకింద నీరులా.. 
బీజేపీలో కాంగ్రెస్‌ పార్టీ మాదిరి బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా అసంతృప్తి కొనసాగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి మధ్య సత్సంబంధాలున్నట్లు బయటకు కనిపిస్తున్నా.. ఇద్దరూ ఎవరికి వారు పైచేయి సాధించడానికి ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారన్నది బహిరంగ సత్యమని పార్టీలో చర్చ జరుగుతోంది. బండి సంజయ్‌ తన కోటరీని ఏర్పాటు చేసుకుని.. సీనియర్లను పూర్తిగా విస్మరిస్తున్నారని పలు నియోజకవర్గాల్లో నేతలు విమర్శిస్తున్నారు. గజ్వేల్‌లో పోటీ చేస్తానన్న ఈటల రాజేందర్‌కు కౌంటర్‌గా సంజయ్‌.. ‘ఎవరికి వారు తమకు నచ్చిన చోట పోటీ చేయడానికి బీజేపీలో వీల్లేదు. పార్టీ అధిష్ఠానం మాత్రమే నిర్ణయిస్తుంది’ అంటూ వ్యాఖ్యానించడం ఇద్దరి మధ్య గ్యాప్‌ను బహిర్గతం చేస్తోందని అంటున్నారు. తాజాగా పార్టీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.    

కారుకూ కుదుపులు! 
ఇక అధికార టీఆర్‌ఎస్‌ను సైతం అక్కడక్కడా అసమ్మతి బెడద వెంటాడుతోంది. మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి అవకాశం ఇవ్వొద్దంటూ నియోజకవర్గ నేతలు బాహాటంగానే తమ అసమ్మతిని వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ స్వయంగా కలగజేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వికారాబాద్‌ జిల్లాలో పట్నం మహేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు పైలెట్‌ రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్‌లు పనిచేస్తుండటం పార్టీకి తలనొప్పిగా మారింది. వికారాబాద్‌లో ముఖ్యమంత్రి పర్యటనకు ముందు, పర్యటనలోనూ వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇక ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కూడా పాత, కొత్త నాయకులకు మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top