Traditional Food Culture And Different Type Of Food Habits Of Tribals In Telugu - Sakshi
Sakshi News home page

Food Habits Of Tribals: చీమల చట్నీ.. గోంగూర.. తింటారు నోరూర! ఒళ్లంతా చీమలు చల్లుకొని చికిత్స కూడా!

Published Wed, Aug 9 2023 2:39 AM | Last Updated on Wed, Aug 9 2023 11:06 AM

 Different food habits of tribals - Sakshi

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:  
గల్లీలో ఉండే చిన్న హోటల్‌లోనే పొద్దున ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా ఇంకా ఎన్నో వెరైటీ టిఫిన్లు దొరుకుతాయి. ఇక మధ్యాహ్నం అన్నం, రెండు మూడు రకాల కూరలు, పప్పు, చారు, పెరుగు ఇవన్నీ లేనిదే ముద్ద దిగదు. ఇక ఏ స్టార్‌ హోటల్‌కి వెళ్లినా ఏ దేశపు వంటకాలైనా ఆర్డర్‌చేస్తే చాలు టేబుల్‌పై హాజరు... ఇవీ మైదాన ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు.

కానీ అడవుల్లో జీవించే ఆదివాసీలు ఏం తింటారు? సీజన్‌లో దొరికే గోంగూ­ర, చింతపండు, మిరపకాయ­లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆహార సేక­రణ కష్టంగా మా­రిన సమయంలో ఎర్రచీమలతో పచ్చ­డి నూ­రుకుని కూడా తింటుంటారు. అయితే మారిన పరిస్థితుల్లో విద్య, ఉద్యోగాల కోసం అడవుల నుంచి బయటపడుతున్న వారి ఆహారపు అలవాట్లలో ఇప్పుడిప్పుడే కొంత మార్పు చోటు చేసుకుంటోంది.

వలస ఆదివాసీలు
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలు రెండు దశాబ్దాలుగా ఛత్తీస్‌గఢ్, ఒడిశాకు చెందిన ఆదివాసీలకు ఆశ్రయం ఇస్తున్నాయి. వలస ఆదివాసీల్లో అనేక తెగలు ఉండగా, వీరిలో 90 శాతం మంది రోడ్డు, నీళ్లు, విద్యుత్‌ సౌకర్యం లేకుండా అటవీ ప్రాంత పల్లెల్లోనే ఉంటున్నారు. పోడు సాగు చేసుకోవడం, ఇంటి ఆవరణలోనే తినే ఆహార పదార్థాలను పండించుకోవడం వీరి జీవనశైలి.గోంగూర.. పండుగే.. 
వానాకాలంలో మొలకెత్తే గోంగూర ఆగస్టులో తినేందుకు అనువుగా ఎదుగుతాయి. ఆ సమయంలో ఆదివాసీలు గోంగూర పండుగ చేసుకుంటారు. చింతకాయలు అందుబాటులోకి వచ్చే వరకు గోంగూరే వీరి ప్రధాన ఆహారం. వానాకాలం ముగిసేలోగా అందుబాటులో ఉన్న గోంగూర ఎండబెట్టుకుని వేసవి వరకు వాడుకుంటారు. ఎండాకాలంలో చింతకాయలు రాగానే పచ్చడి చేసుకుంటారు. గోంగూరతో పాటు పచ్చకూర (చెంచలి), బొద్దుకూర, నాగళి, టిక్కల్‌ అనే ఆకుకూరలు, కొన్ని రకాలైన దుంపలను కూడా వండుకుంటారు.

కారం కావాలంటే.. 
మొదట్లో అటవీ ఫలసాయం తప్ప వ్యవసాయం తెలియని ఆదివాసీలను కారం రుచి మైమరపించింది. గోంగూర, చింతకాయ పచ్చడికి అవసరమైన మిరపకాయలు అపురూపమైన ఆహారంగా మారింది. దీంతో మిరపకాయల కోసమే ఎత్తయిన కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ.. వాగులు, వంకలు దాటుతూ రాష్ట్రాల సరిహద్దులు చెరిపేసి గోదావరి తీరానికి చేరుకునేవారు.

ప్రారంభంలో భద్రాద్రి ఏజెన్సీలో కల్లాల్లో ఆరబోసిన మిర్చి పంటను దొంగిలించుకెళ్లేవారట. ఆ తర్వాత ఇక్కడ పనిచేసి, కూలీగా మిర్చి తీసుకెళ్లడం అలవాటు చేసుకున్నారు. ఇక పోడు సాగు కోసం ఆదివాసీలు అడవిని నరికేటప్పుడు ఇప్ప, మద్ది, తునికి, చింత, పాల చెట్లు తారసపడితే ముట్టుకోరు. ఇక ఇప్ప చెట్టునయితే దైవంతో సమానంగా కొలుస్తారు. 

చీమలు... ఆహారంగానే కాదు.. వైద్యానికి కూడా 
ఆకు రాలే కాలం మొదలైన తర్వాత వసంతం వచ్చే వరకు ఆదివాసీలకు ఆహార సేకరణ కష్టంగా మారుతుంది. ఈ సమయంలో చీమలను ఆహారంగా తీసుకుంటారు. సర్గీ, సాల్, మామిడి ఆకులపై ఎర్రచీమలను వాటి గుడ్లను సేకరిస్తారు. అనంతరం ఉప్పు, కారం, టమాటా కలిసి రోట్లో వేసి రుబ్బుతారు. ఇలా తయారు చేసిన చట్నీని బస్తరియాగా పిలుస్తారు. ఈ పచ్చడిని వారు ఇష్టంగా తింటారు. ఎర్రచీమల్లో ఔషధ గుణాలు కలిగిన ఫామిక్‌ యాసిడ్‌ ఉండడమేకాక ప్రొటీన్, కాల్షియం సమృద్ధిగా ఉండి జ్వరం, జలుబు, దగ్గు, కంటి సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్ముతారు.

అలాగే ఒంట్లో నలతగా ఉన్నా, తలనొప్పి, జ్వరంగా అనిపించినా చీమల చికిత్సకే మొగ్గు చూపుతారు. చెవులు, ముక్కుల ద్వారా చీమలు శరీరంలోకి వెళ్లకుండా ముఖాన్ని వస్త్రంతో కప్పేసుకుని చీమల గూడును ఒంటిపై జల్లుకుంటారు. వందల కొద్ది చీమలు శరీరాన్ని కుడుతుండగా.. మంట పుట్టి క్షణాల్లో ఒళ్లంతా చెమటలు వస్తాయి. రెండు, మూడు నిమిషాలు ఉన్న తర్వాత చీమలు తీసేస్తారు. తద్వారా ఒంట్లో ఉన్న విష పదార్థాలు చెమట రూపంలో బయటకు వెళ్లి ఉపశమనం కలుగుతుందని వారి నమ్మకం.

కాగా, జొన్నలు, సజ్జలు వంటి చిరుధాన్యాలనే పండించి ఆహారంగా తీసుకునేవీరు క్రమంగా బియ్యానికి అలవాటు అవుతున్నారు. వ్యవసాయంలో ఎరువులు సైతం ఉపయోగిస్తున్నారు. గతంలో ఆవు పాలు తీసుకోని వీరు.. ఇప్పుడిప్పుడే పాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ఇక ప్రభుత్వ గిరిజన పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు నెమ్మదిగా మైదాన ప్రాంత ఆహారపు అలవాట్లు చేసుకుంటున్నారు.

చీమల చట్నీకి జీఐ ట్యాగ్‌..
ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లాలోని ఆదివాసీలు తమ ఆహారంలో చీమల చట్నీకి తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఎర్రచీమలతో తయారు చేసే ఈ పచ్చడి ఔషధపరంగానూ ఉపయోగపడుతుందని వారు నమ్ముతున్నారు. చీమల చట్నీకి జీఐ టాగ్‌ సైతం లభించడం గమనార్హం. 

జొన్నలు, సజ్జలు తింటే తొందరగా ఆకలి వేయదు
ఇంతకు ముందు జొన్నలు, సజ్జలు తినేవాళ్లం. పొద్దున తిని అడవికి వెళితే రాత్రి వరకు ఆకలి అనేది ఉండకపోయేది. కానీ బియ్యంతో చేసిన అన్నం అయితే రోజుకు రెండుసార్లు తినాల్సి వస్తోంది. ఇది తప్పితే బియ్యంతో చేసిన అన్నం బాగుంది.   
 – మామిడి అరవయ్య (కూలీ, రెడ్డిగూడెం ఎస్టీ కాలనీ, పాల్వంచ మండలం) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement