Telangana: సెట్‌ల దరఖాస్తుల గడువు పొడిగింపు 

Different Entrance Exam Date Extended In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (బీఎడ్‌) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఎడ్‌సెట్‌–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించినట్లు ప్రొఫెసర్‌ ఎ.రామకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

లాసెట్‌ 
తెలంగాణలో న్యాయ విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీలాసెట్‌ – 2021 దరఖాస్తుల గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జీబీరెడ్డి తెలిపారు. విద్యార్థులు వీలైనంత ముందుగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. తద్వారా వారు ఎంచుకున్న సమీప ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాన్ని కేటాయించే వీలు ఉంటుందని చెప్పారు. 

పీఈసెట్‌  
డిప్లొమా ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్‌–2021 దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు పీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని సూచించారు.    

టీఎస్‌ ఐసెట్‌  
కేయూ క్యాంపస్‌: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2021–22 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం నిర్వహించనున్న టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పొడిగించారు. పరీక్షకు ఈ నెల 23వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండానే దరఖాస్తు చేసుకోవచ్చని ఐసెట్‌ కన్వీనర్, కేయూ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడం, కొన్ని డిగ్రీ కోర్సుల పరీక్షలు జరగకపోవడంవల్ల ఈ నెల 15వ తేదీతో ముగియనున్న గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాలతో పెంచామని ఆయన పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top