ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ : కలకలం రేపుతున్న ‘జంగ్‌ బుక్’

Did The Top Leaders of the Maoist Party Order Attacks in Telangana Greyhounds‌ - Sakshi

గ్రేహౌండ్స్‌పైనా గురి

బీజాపూర్‌ ఎన్‌కౌంటర్‌ స్థలంలో ‘జంగ్‌ బుక్‌’లభ్యం 

వెలుగులోకి హిడ్మా ప్రణాళికలు, వ్యూహాలు  

రాష్ట్రంలో దాడులకు మావోయిస్టు అగ్రనేతల ఆదేశాలు? 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేహౌండ్స్‌పై దాడికి హిడ్మా ప్రణాళికలు రచించాడా? మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో దాడులకు ఆదేశాలిచ్చారా? ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు దొరికిన ‘జంగ్‌ బుక్‌’లోని అంశాలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ జిల్లా బీజాపూర్‌లో ఈనెల 3వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కమాండర్‌ హిడ్మా తన ఉనికిని ఉద్దేశపూర్వకంగా నిఘా వర్గాలకు అందజేసి, తమకు ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోకి తెలివిగా రప్పించాక ఆకస్మికంగా దాడి చేసిన సంగతి తెలిసిందే.

ఈ దాడిలో సీఆర్‌పీఎఫ్‌ కోబ్రా, ఎస్టీఎఫ్, స్థానిక పోలీసులు కలిసి 22 మంది మరణించారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు కూడా మరణించారు. ఈ సందర్భంగా మావోయిస్టుల నుంచి ఒక ‘జంగ్‌ బుక్‌’ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. సాధారణంగా మావోయిస్టులు తాము చేయబోయే, చేసిన దాడుల గురించి, జయాపజయాలను విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు రాసుకునే పుస్తకాన్నే ‘జంగ్‌ బుక్‌’గా వ్యవహరిస్తారు. ఈ పుస్తకంలోని పలు సంచలనాత్మక విషయాలను చదివిన అక్కడి పోలీసులు.. ఇప్పుడు ఆయా అంశాలపై ఆరా తీసే పనిలో పడ్డారు. 

మావోల ఏరివేతలో గ్రేహౌండ్స్‌ ఫస్ట్‌ 
2010 నుంచి సీఆర్‌పీఎఫ్‌పై వరుసగా దాడులు చేస్తూ వస్తోన్న హిడ్మా గెరిల్లా ఆపరేషన్లలో ఆరితేరాడు. సీఆర్‌పీఎఫ్, స్థానిక పోలీసులపై పదుల సంఖ్యలో దాడులు చేసిన హిడ్మా జాబితాలో గ్రేహౌండ్స్‌పై దాడికి సంబంధించిన వ్యూహం కూడా ఉండటం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు. రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్‌ బలగాలు దేశంలోనే మావోల ఏరివేతలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఇప్పటికీ పలు రాష్ట్రాల పోలీసులు మావోల ఏరివేతకు అనుసరించాల్సిన వ్యూహాలకు గ్రేహౌండ్స్‌ అధికారులను ఆశ్రయించడం, వారి వద్ద శిక్షణ పొందడం చేస్తుంటారు. వాస్తవానికి హిడ్మా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యం ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందాడు. కానీ ఇతని ఫొటోలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉండటం గమనార్హం. 

గ్రేహౌండ్స్‌కు సమాచారం 
గ్రేహౌండ్స్‌పై దాడి చేయాలన్న హిడ్మా ప్రణాళికలు చూసిన ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఈ విషయాన్ని వెంటనే గ్రేహౌండ్స్‌కు తెలియజేశారు. వాస్తవానికి గ్రేహౌండ్స్‌పై దాడి ప్రణాళికలు మావోయిస్టుల వద్ద ఉండటం కొత్తేమీ కాదు. కానీ ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టు నేత అయిన హిడ్మా వద్ద ఈ ప్రణాళికలు ఉండటం అంటే.. తెలంగాణలోనూ దాడులకు అతనికి మావో అగ్రనేతలు ఆదేశాలిచ్చారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆ రాష్ట్ర పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారని సమాచారం.  

చదవండి: 'ప్లీజ్‌ అంకుల్‌.. మా నాన్నను విడిచిపెట్టండి'

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top