నిషా ముక్త్‌ నగరమే లక్ష్యం  | Sakshi
Sakshi News home page

నిషా ముక్త్‌ నగరమే లక్ష్యం 

Published Thu, Feb 10 2022 4:48 AM

DGP Inaugurated H NEW And NISW Units To Tackle Drug Menace Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: రాజధాని నగరాన్ని డ్రగ్‌ ఫ్రీ సిటీగా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటైన హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌– న్యూ), నార్కోటిక్‌ ఇన్వెస్టిగేషన్‌ సూపర్‌ విజన్‌ వింగ్‌ (ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ) బుధవారం నుంచి పని ప్రారంభించాయి. బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనరేట్‌లో జరిగిన కార్యక్రమంలో కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ సమక్షంలో డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి వీటిని ఆవిష్కరించారు.

వీటి కోసం ప్రత్యేకంగా కేటాయించిన చాంబర్లను ఆయన ప్రారంభించారు. నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్స్‌ కోసం ఏర్పాటైన ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ స్ఫూర్తితో.. వాటి మాదిరిగా ఏకైక లక్ష్యంగా ఈ రెండు విభాగాలు సమన్వయంతో పని చేయనున్నాయి. హెచ్‌– న్యూ చీఫ్‌గా డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ ఏసీపీగా కె.నర్సింగ్‌రావు బాధ్యతలు స్వీకరించారు. వీటికోసం వాహనాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించారు.

మాదకద్రవ్యాల మూలాల నుంచి రవాణా, విక్రయం, వినియోగంపై నిఘా ఉంచి దాడులు చేసే హెచ్‌– న్యూకు 28 మంది, ఆ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు నుంచి కేసు విచారణ పూర్తయ్యే వరకు పర్యవేక్షించే ఎన్‌ఐఎస్‌డబ్ల్యూకు తొమ్మిది మంది సిబ్బందిని ప్రాథమికంగా కేటాయించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను అవసరాలకు తగ్గట్టు పెంచనున్నారు. ఎన్‌ఐఎస్‌డబ్ల్యూ డ్రగ్స్‌ సంబంధిత కేసులను దర్యాప్తును పర్యవేక్షించడంతో పాటు పోలీసు స్టేషన్లలోని సిబ్బందికీ శిక్షణ ఇస్తుంది. డ్రగ్స్‌పై సమాచారం తెలిసిన వాళ్లు 94906 16688 లేదా 040– 27852080లకు ఫోన్‌ చేయొచ్చు.

సరదాగా మొదలెట్టి బానిసలుగా
యుక్త వయసులో, కాలేజీ రోజుల్లో స్నేహితుల బలవంతంతోనే, తమకు ఉన్న ఉత్సుకత నేపథ్యంలోనే అనేక మంది సరదాగా డ్రగ్స్‌ వాడటం మొదలెడుతున్నారు. ఆపై వాటికి బానిసలుగా మారి జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారు. ఎంతోమంది యువత ఈ మహమ్మారికి సంబంధించిన చట్రంలో ఇరుక్కుంటున్నారు. దీన్ని గుర్తించిన ముఖ్యమంత్రి మాదకద్రవ్యాలను రాష్ట్రంలో లేకుండా చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ రెండు కొత్త విభాగాలు ఏర్పాటయ్యాయి. 
– డీఎస్‌ చౌహాన్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) 

త్వరలోనే రాష్ట్ర స్థాయి విభాగం 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వెయ్యి మందితో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర స్థాయి యాంటీ నార్కోటిక్స్‌ వింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి పంపుతాం. ఈలోపే హైదరాబాద్‌ పోలీసులు ఇలాంటి విభాగాలు ఏర్పాటు చేయడం అభినందనీయం. వీటి పనితీరులో పరిశీలించిన అంశాల ఆధారంగా రాష్ట్ర స్థాయి విభాగంలో మార్పుచేర్పులు చేస్తాం. డ్రగ్‌ మాఫియాపై పోరాడి, విజయం సాధించిన న్యూయార్క్‌ వంటి నగరాలను అనుసరించిన విధానాలు అధ్యయనం చేయాలి.  
– ఎం.మహేందర్‌రెడ్డి, డీజీపీ 

టాస్క్‌ఫోర్స్‌ మాదిరిగా హెచ్‌–న్యూ 
హెచ్‌– న్యూ ప్రస్తుతం ఉన్న టాస్క్‌ఫోర్స్‌ మాదిరిగా పని చేస్తుంది. ఇది కేవలం మాదకద్రవ్యాల వ్యవహారాలను మాత్రమే పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం డ్రగ్స్‌ మహమ్మారి అన్ని ప్రాంతాలనూ కుదిపేస్తోంది. దీన్ని గుర్తించిన సీఎం అలాంటి పరిస్థితులు రాకూడదనే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే టోనీ కేసులో వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలను అరెస్టు చేశాం. ఇది ప్రభుత్వం తీసుకున్న సంచలనం నిర్ణయం. ప్రతి 
పోలీసు స్టేషన్‌లోనూ కనీసం ఇద్దరికి డ్రగ్స్‌ కేసుల దర్యాప్తు తదితరాలపై పూర్తి అవగాహన కల్పించాలన్నదే మా లక్ష్యం.  
– సీవీ ఆనంద్, హైదరాబాద్‌ సీపీ  

Advertisement
Advertisement