మూడు రోజులుగా పరీక్ష పత్రాల లీక్‌..? అరగంట ఆలస్యం వెనుక..

Degree Semister Exam Question Paper Leak Mystery In Nizamabad - Sakshi

సాక్షి, బోధన్‌ (నిజామాబాద్‌): తెలంగాణ వర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. వర్సిటీ ఉన్నతాధికారుల నిఘా కరువైంది. కరోనా నిబంధల పేరుతో పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన కనీస నిబంధన చర్యలను పట్టించుకోకపోవడంతో ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్షా కేంద్రాల వారికి అనుకూలంగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.  

అరగంట ఆలస్యంలోనే కిటుకు.. 
పోటీపరీక్షల్లో అమలుచేసే నిమిషం ఆలస్యం నిబంధన సాధారణ పరీక్షల్లో అమలు చేయకపోవడం కొందరు విద్యార్థులకు అనుకూలంగా మారింది. అరగంట ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను అనుమతించాల్సి ఉంటుంది. ఈ నిబంధనను అనుకూలంగా తీసుకుని పరీక్షా కేంద్రాల్లోని పలువురు అబ్జర్వర్లు విద్యార్థులకు మాల్‌ప్రాక్టీస్‌ను పోత్రహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  

ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం.. 
పరీక్షా సమయానికి 15 నిమిషాల ముందు వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు పరీక్షా కేంద్రాలకు ఆన్‌లైన్‌లో ప్రశ్నాపత్రం పంపిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రానికి పంపించే ప్రశ్నాప్రతాలపై ప్రత్యేకమైన కోడ్‌ వేస్తారు. నిర్వాహకులు డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష సమయానికి 5 నిమిషాలు ముందుగా సబ్జెక్టుల వారీగా విద్యార్థుల గదులకు చేరవేస్తారు. అబ్జర్వర్స్‌ ఈ ప్రక్రియను తమకు అనుకూలంగా మా ర్చుకుంటున్నారు. కొందరు తమ వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్ల ద్వారా ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి బయటకు చేరవేయగా విద్యార్థులు వాటి జవాబులను మైక్రో జిరాక్స్‌ తీసుకుని ఎగ్జామ్‌ హాల్‌కు వచ్చి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతున్నారు. 

బోధన్‌లో ప్రశ్నాపత్రం లీక్‌.. 
బోధన్‌లో 5 పరీక్షా కేంద్రాలుండగా, ఒకటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, 4 ప్రైవేట్‌లో  ఉన్నాయి. 3 రోజుల నుంచి పేపర్‌ లీకేజీ జరుగుతున్నట్లు సమాచారం. శనివారం నాలుగో సెమిస్టర్‌ డాటాబేస్‌ మేనేజ్‌ మెంట్‌ ప్రశ్నపత్రం బయటకు లీక్‌ చేశారు. దీంతో ఓ జిరాక్స్‌ సెంటర్‌ వద్ద విద్యార్థులు గుంపులుగా చేరి లీకేజైన ప్రశ్నల జవాబులు మైక్రో జిరాక్స్‌లు తీసుకుని పరీక్ష రాసినట్లు తెలిసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top