ఎంట్రీ లెవల్‌కూ ఏఐ సవాల్‌! | Declining demand for entry level jobs worldwide | Sakshi
Sakshi News home page

ఎంట్రీ లెవల్‌కూ ఏఐ సవాల్‌!

Jun 11 2025 1:34 AM | Updated on Jun 11 2025 5:48 AM

Declining demand for entry level jobs worldwide

తొట్టతొలి ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న కృత్రిమ మేధ

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో పని కానిచ్చేస్తున్న కంపెనీలు

ప్రపంచ వ్యాప్తంగాఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలకు తగ్గుతున్న డిమాండ్‌

యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలి అంటున్న నిపుణులు 

సాంకేతికతకు సృజనాత్మకత జోడింపుతో అదనపు ప్రయోజనాలు చేకూరతాయని సూచన  

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రస్తుత పోటీ ప్రపంచంలో మొత్తంగా ఎంట్రీ లెవెల్‌ (తొలి స్థాయి)ఉద్యోగార్థులు, గ్రాడ్యుయేట్లకు డిమాండ్‌ భారీ ఎత్తున తగ్గిపోతోంది. రాను రాను మొదటి ఉద్యోగం దొరకడం అనేది కష్టంగా, సవాళ్లతో కూడుకున్నదిగా మారుతోంది. ఇప్పటికే వివిధ రంగాలలో పని చేస్తున్న ఉద్యోగుల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), తాజా గ్రాడ్యుయేట్లు తమ తొట్టతొలి కొలువు దక్కించుకోవడాన్ని కూడా కష్టసాధ్యం చేస్తోంది. 

ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీలకు అవసరమైన డాక్యుమెంట్ల విశ్లేషణ, సమావేశాలకు అవసరమైన బ్రీఫింగ్‌ నోట్స్‌ తయారీ, పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ (పీపీపీ) రూపకల్పన, కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులు లేదా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం వంటి పనులను ఏఐ సులువుగా చక్కబెట్టేస్తుండటమే ఇందుకు కారణం. 

ఏఐతో నెట్టుకొచ్చేస్తున్న కంపెనీలు.. 
కొత్తగా ఉద్యోగాల్లో చేరే యువత తమ కెరీర్‌ మొదట్లో ఎక్కువగా ఈ తరహా పనులే చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఏఐ ప్రపంచాన్ని శాసిస్తోంది. అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఉద్యోగాలకు ఎసరు తెస్తోంది. కంపెనీలు కూడా ఖర్చును దృష్టిలో పెట్టుకుని కృత్రిమ మేధ వైపు మొగ్గుతున్నాయి. ఈ క్రమంలోనే ఎంట్రీ లెవల్‌ ఉద్యోగాలు సైతం తగ్గిపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. 

ఏఐ సంస్థ ‘ఆంత్రోపిక్‌’ఉన్నతోద్యోగి ఒకరు.. ‘రాబోయే రోజుల్లో కృత్రిమ మేధ అనేది అన్ని వైట్‌ కాలర్‌ జాబ్‌ (కార్యాలయాల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగం)ల్లో సగానికి సగం ఎంట్రీ లెవల్‌ జాబ్‌లను తుడిచి పెట్టేస్తుంది..’అంటూ ఇటీవల చేసిన ప్రకటనను వారు ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితికి తగ్గట్టుగానే కొన్ని కంపెనీలు ‘చాట్‌ జీపీటీ’ని ఇంటర్న్‌షిప్‌ చేసే జూనియర్‌ లేదా ఎంట్రీ లెవల్‌ ఉద్యోగిగా ఉపయోగించుకోవడాన్ని ఆచరణలో పెట్టేయడం గమనార్హం. 

కాగా వివిధ రంగాలకు సంబంధించిన ఎంట్రీ లెవల్‌ జాబ్‌లకు డిమాండ్‌ తగ్గుదలను తాము గమనించామని లండన్‌లోని రిక్రూట్‌మెంట్‌ సంస్థ ‘ఫ్రెష్‌ మైండ్స్‌’ప్రతినిధులు ఇటీవల వెల్లడించడాన్ని కూడా నిపుణులు గుర్తు చేస్తున్నారు. తమ సంస్థల్లో చేరబోయే ఉద్యోగులు ‘వర్క్‌ రెడీ ప్రొఫెషనల్స్‌’గా ఉండాలని ఆయా సంస్థలు కోరుకుంటున్నాయని వారు తెలిపారు. కొన్ని కంపెనీలు జూనియర్‌ పోస్టులను సైతం సీనియర్‌ ఉద్యోగులతో భర్తీ చేస్తున్న ఉదంతాలను వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థ సిగ్నల్‌ ఫైర్‌ తన ‘స్టేట్‌ ఆఫ్‌ టాలెంట్‌ 2025’నివేదికలో ప్రస్తావించింది.

సంసిద్ధులుకావాల్సిందే..: నిపుణులు
ప్రస్తుత పరిస్థితులన్నీ ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లు మొదటి ఉద్యోగం సాధించడాన్ని సమస్యాత్మకంగా మారుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. నవ యువత సాంకేతికంగా ఒక అడుగు ముందుకేసి తమకు సవాళ్లు విసురుతున్న వ్యవస్థలను అధిగమించేందుకు సంసిద్ధులై ఉండాలని సూచిస్తున్నారు. కృత్రిమ మేధనే ఓ ఆయుధంగా మలుచుకోవాలని చెబుతున్నారు. చాట్‌ జీపీటీ, గ్రోక్, తదితరాలను ఉపయోగిస్తూ తమపై పడే పనిభారాన్ని తగ్గించుకోవడంతో పాటు విధుల నిర్వహణలో వేగంగా ముందుకు సాగాలని స్పష్టం చేస్తున్నారు. 

సిద్ధమే అంటున్న యువత.. 
తాజాగా యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ ప్రొఫెసర్‌ ఒకరు.. సింగపూర్‌ నేషనల్‌ యూనివర్సిటీకి చెందిన 70 మంది ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ విద్యార్థులను ఏఐతో, ఎంట్రీ లెవల్‌ జాబ్స్‌ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ప్రశ్నించారు. ఏఐ వల్ల వారికి రావాల్సిన ఉద్యోగాల్లో భారీగా కోతగా ఏర్పడబోతోందా? ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు? అని అడిగారు. పలువురు విద్యార్థులు స్పందిస్తూ.. ఏఐ వల్ల తమకు నష్టం జరుగుతుందని భావించడం లేదని చెప్పారు. 

తాము ఏఐనే ఓ సాధనంగా ఉపయోగించుకుని పని ప్రదేశాల్లో రాణించేందుకు సిద్ధమంటూ సమాధానమిచ్చారు. ఏఐ టూల్స్‌ వినియోగంలో తాము పైచేయి సాధించినందున తమకు పెద్దగా సమస్య ఎదురుకాబోదని అన్నారు. తమలో అత్యధికులు ఒక్క చాట్‌ జీపీటీనే కాకుండా... జెమిని, క్లాడ్, ఫైర్‌ఫ్లై, హేజెన్, గామా, హిగ్స్‌ఫీల్డ్, యుడియో, నోట్‌బుక్‌ ఎల్‌ఎం, మిడ్‌ జర్నీ వంటి వివిధ రకాల టూల్స్‌ను ఉపయోగిస్తున్నామంటూ ప్రశ్న అడిగిన ప్రొఫెసరే ఆశ్చర్యపోయేలా సమాధానమివ్వడం..ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా యువతలో వస్తున్న మార్పునకు సంకేతమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

యువతను ప్రోత్సహిస్తే కంపెనీలకే మేలు 
కంపెనీలు కూడా ఖర్చు తగ్గించుకోవడంలో భాగంగా ఎంట్రీ లెవల్‌ జాబ్‌లను ఏఐకు అప్పగించకుండా యువతకున్న టాలెంట్‌ను ఉపయోగించుకోవడం వల్ల అదనపు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. చేసే పనికి సృజనాత్మకతను జోడించి కొత్త ఆవిష్కరణలు చేసేలా యువతను ప్రోత్సహించడం వల్ల కంపెనీలకే మేలు జరుగుతుందని చెబుతున్నారు. 

కేవలం ఏఐ టూల్స్‌ వినియోగానికి పరిమితమవుతూ ఎక్కువ ఉత్పాదకత సాధనపై దృష్టి పెట్టకుండా వ్యూహాత్మకంగా, క్రియాశీలంగా పని చేసే వర్క్‌ఫోర్స్‌ను పెంపొందించుకుంటే అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement