దళిత హక్కుల నేత.. డీసీసీబీ చైర్మన్‌ కన్నుమూత..

DCCB Chairman Passaway In Adilabad - Sakshi

సాక్షి,  నార్నూర్‌(ఆదిలాబాద్‌): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఏజెన్సీ దళితుల హక్కుల కోసం పోరాడిన దళిత నేత ఉమ్మడి ఆదిలాబాద్‌ డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌(65) హఠాన్మరణం చెందారు. ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం గుంజాల గ్రామానికి చెందిన ఆయన బుధవారం గుండెపోటుతో హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. నాందేవ్‌ మంగళవారం ఆదిలాబాద్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటనలో పాల్గొన్నారు. రాత్రి తొమ్మిది గంటలకు స్వగ్రామానికి చేరుకున్నారు.

ఇంట్లో నిద్రిస్తుండగా రాత్రి 2గంటల సమయంలో గుండెపోటు రావడంతో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ ఉట్నూర్‌ నుంచి ఆదిలాబాద్‌కు చేరుకుని తన సొంత వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాందేవ్‌ మృతిచెందారు. ఆయన స్వగ్రామం గుంజాలలో విషాదం నెలకొంది. గురువారం ఉదయం 11 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

స్వయంకృషితో ఎదిగారు..
నాందేవ్‌ వ్యవసాయ కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య సత్యభామ, ఐదుగురు కూతుళ్లు, నలుగురు కుమారులు ఉన్నారు. రెండేళ్ల క్రితం కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. నాందేవ్‌ 1990లో విద్యుత్‌ శాఖలో కాంట్రాక్టర్‌గా పని చేస్తూనే ఏ1కాంట్రాక్టర్‌గా ఎదిగారు. 1989లో పీఏసీఎస్‌ తాడిహత్నూర్‌కు చైర్మన్‌గా తొలిసారి ఎన్నికయ్యారు. 1994–95లో జరిగిన ఎన్నికల్లో నార్నూర్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు సార్లు చైర్మన్‌గా ఎన్నిక కావడంతోపాటు ఆరు సార్లు డీసీసీబీ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. 1997లో ఏజెన్సీ షెడ్యూల్డ్‌ కులాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా దళితుల సమస్యలపై పోరాటం చేశారు.

1/70 చట్టంతో ఏజెన్సీ ప్రాంత దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దళితుల సాగు భూములకు పట్టాలు, పహాణి పత్రాలు ఇవ్వాలని, ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేయాలని అప్పటి ముఖ్యమంత్రులు వైఎస్‌ఆర్, చంద్రబాబు, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దళితులకు పహాణి పత్రాలు ఇప్పించారు. డీసీసీబీ చైర్మన్‌గా ఉంటూనే ఏజెన్సీ దళితులకు రైతుబంధు, రైతుబీమా వర్తింప చేయాలని తీవ్ర ప్రయత్నం చేశారు. టీడీపీలో సామాన్య కార్యకర్తగా అడుగుపెట్టి తర్వాత టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2020–21ఫిబ్రవరిలో జరిగిన పీఏసీఎస్‌ ఎన్నికల్లో చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

మంత్రి ఐకే రెడ్డి సంతాపం
నిర్మల్‌రూరల్‌: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లే నాందేవ్‌ హఠాన్మరణంపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నాందేవ్‌ మృతి బాధాకరమని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top