వచ్చేస్తున్నారు.. సైబర్‌ కమాండోలు

Cyber Commandos To Battle Growing Online Threat In Telangana - Sakshi

ఆన్‌లైన్‌ మోసగాళ్ల ఆటకట్టించేలా త్వరలో రంగంలోకి

సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో విధివిధానాలు ఖరారు.. 3 డివిజన్లు, 14 విభాగాలుగా బ్యూరో విభజన

రాష్ట్రంలోని ప్రతి కమిషనరేట్‌లో సైబర్‌ ఠాణా.. జిల్లా కేంద్రాల్లో సైబర్‌ కో–ఆర్డినేట్‌ సెల్స్‌ ఏర్పాటు

సైబరాబాద్‌లో 140 మంది, జిల్లాల్లో 300 మంది వారియర్ల విధులు

రెండు నెలల్లో బ్యూరో కార్యకలాపాలు ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: పోలీసు కమాండోలు అంటే మనకు తెలిసిందే. ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షణ పొంది రెప్పపాటులో శత్రు శ్రేణులపై దాడి చేస్తారు. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో సైబర్‌ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. రోజుకో సవాల్‌ విసురుతున్న సైబర్‌ నేరస్తుల ఆటకట్టించేందుకు ఇప్పటికే శిక్షణ పొందారు.

సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర నేతృత్వంలో ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు డివిజన్లు, 14 విభాగాలుగా ఏర్పాటైన ఈ బ్యూరో మరో రెండు నెలల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధమైంది.

కమిషనరేట్‌లో ఠాణా, జిల్లాలో సైబర్‌ సెల్స్‌..
రాష్ట్రంలో సైబర్‌ నేరాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలపై సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సైబర్‌ నేరాలను కూకటివేళ్లతో సహా పెకిలించేలా క్షేత్రస్థాయి నుంచే సైబర్‌ నేరాలను నివారించేందుకు ఈ బ్యూరో పనిచేయనుంది. ఈ బ్యూరోలో ప్రధానంగా మూడు డివిజన్లు, 14 విభాగాలుంటాయి.

ప్రధాన కార్యాలయం సైబరా బాద్‌ కమిషనరేట్‌లో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లలో ప్రత్యేకంగా సైబర్‌ పోలీసుస్టేషన్‌ ఉంటుంది. మిగిలిన జిల్లాలలో సైబర్‌ కో–ఆర్డినేట్‌ సెల్స్‌ ఉంటాయి. స్థానిక పోలీసుల సహకారంతో సైబర్‌ నేరాల నివారణకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విధులు నిర్వర్తిస్తారు.

అధికారులకు విధుల కేటాయింపు..
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకు 454 మంది అధికారులను కేటాయించింది. ఆయా పోలీసులు హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్‌ భద్రతపై శిక్షణ పూర్తి చేసుకొని సైబర్‌ కమాండోలుగా సిద్ధమయ్యారు. 140 మంది వారియర్లు సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని ప్రధాన కార్యాల యంలో, మిగిలిన 314 మంది ఇతర కమిషనరేట్లు, జిల్లా కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు.

సైబర్‌ సెక్యూరిటీబ్యూరో ప్రధాన విధులివే..
►సైబర్‌ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం, ఆయా రాష్ట్రాల సహకారంతో పట్టుకోవడం 
►బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం ఆపరేటర్ల నోడల్‌ ఏజెన్సీలతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేర గాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంభింప జేయడం.
►నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్‌ నంబర్లను గుర్తించి నియంత్రించడం.
►పలుమార్లు నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి పీడీ యాక్ట్‌లు నమోదు చేయడం.

అంతర్రాష్ట్ర నిందితుల ఆటకట్టు
రాజస్తాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ  వంటి రాష్ట్రాలు సైబర్‌నేరాలకు అడ్డాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో అంతర్రాష్ట్ర నేరస్తు లను పట్టుకొనేందుకు వెళ్లిన రాష్ట్ర పోలీసులకు అక్కడి పోలీసులు సహకరించకపోవడం, నేరస్తు లు పోలీసులపై కాల్పులు, దాడులు జరపడం కూడా జరిగాయి. ఈ తరహా ఆటంకాలకు సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పరిష్కారమార్గాలను కను గొంది. ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్‌ సెంటర్‌ (ఐ4సీ) వంటి సంస్థల సమన్వయంతో ఈ బ్యూరో పనిచేయనుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top