పంటపొలం.. ఎరువులమయం! | Crop Fields In Telangana Have Turned Into Fertilizers | Sakshi
Sakshi News home page

పంటపొలం.. ఎరువులమయం!

Dec 18 2022 2:21 AM | Updated on Dec 18 2022 8:00 AM

Crop Fields In Telangana Have Turned Into Fertilizers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పంటపొలం ఎరువులమయంగా మారింది. మితిమీరిన ఎరువుల వాడకం వల్ల నేల భూసారం కోల్పోతోంది. పంటలకు పనికి రాకుండాపోయే ప్రమాదకరస్థితి ఏర్పడుతోంది. పంటపొలంలో సాధారణంగా ఉండాల్సిన గాఢత గాడితప్పింది. చీడపీడల నివారణ, పంట దిగుబడులను పెంచే క్రమంలో ప్రారంభమైన ఎరువుల వినియోగం ఇప్పుడు ప్రతిపంట సాగులోనూ తప్పనిసరైపోయింది.

దీనికితోడు రసాయన మందులు సైతం వినియోగిస్తుండటంతో ఒకవైపు రైతుకు సాగుభారం తడిసి మోపెడవుతుండగా, మరోవైపు పోషకవిలువలతో ఉండాల్సిన దిగుబడులు రసాయనాలతో కలుషితమవుతున్నాయి. ఫలితంగా మానవాళి ఆరోగ్యంపై అనేక రకాల దుష్ప్రభావాలకు కారణమవుతున్నాయి. 2021–22 వార్షిక వ్యవసాయ నివేదిక ప్రకారం దేశంలో సగటున హెక్టారు పంటకు 127.87 కిలోగ్రాముల ఎరువులను వినియోగిస్తున్నారు.

ఇందులో 83.42 కిలోల నత్రజని, 33.6 కిలోల ఫాస్ఫరస్, 10.85 కిలోల పొటాషియాన్ని వినియోగిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పలు రాష్ట్రాలు జాతీయ సగటును మించి ఎరువులను వినియోగిస్తున్నాయి. అత్యధికంగా ఎరువులు వాడుతున్న రాష్ట్రాల జాబితాలో వరుసగా పుదుచ్చేరి, పంజాబ్, హరియాణా, తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాలున్నాయి. తెలంగాణలో ఒక హెక్టారుకు సగటున 206.69 కిలోల చొప్పున వినియోగిస్తున్నారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో హెక్టారుకు 199.67 కిలోల ఎరువులను వాడుతున్నారు.

సారమంతా ఎరువులమయం...
ఎరువుల వినియోగం పెరగడంతో భూసారం ఆందోళనకరంగా మారుతోంది. పంటమార్పిడి విధానంతో సహజసిద్ధమైన సాగువిధానాలను అనుసరించాల్సిన రైతులు ఎరువులు, పురుగుమందులపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో దిగుబడుల సంగతి అటుంచితే నేల సహజస్థితిని కోల్పోయి చివరకు ఉప్పు నేలగా మారిపోతోందంటూ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలవారీగా ఎరువుల వినియోగాన్ని ఉటంకిస్తూ వినియోగాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలంటూ పలు సూచనలు చేశారు. 

అధిక వినియోగంతో అనర్థాలే...
సాధారణంగా ఎరువుల వినియోగం 4:2:1 నిష్పత్రితలో ఉంటే పరవాలేదు. దేశంలో ఎరువుల వినియోగం 7:2.3:1.5 నిష్పత్తికి చేరింది. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఈ నిష్పత్తిలో వత్యాసాలు కనిపిస్తున్నాయి. మితిమీరిన ఎరువుల వినియోగంతో భవిష్యత్తులో సాగువిధానం తీవ్ర సంకటస్థితిని ఎదుర్కొంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఎరువుల వినియోగం మితిమీరితే భూసారం దెబ్బతింటుంది.

భూమిలోని వాస్తవ పోషకాలు గల్లంతై ఉప్పునేలగా మారుతుంది. దీంతో సేంద్రియ పదార్థం, హ్యూమస్, ప్రయోజనకరమైన జాతులు, మొక్కల పెరుగుదల కుంటుపడతాయి. తెగుళ్ల పెరుగుదలతోపాటు గ్రీన్‌హౌస్‌ వాయువుల విడుదలకు దారితీస్తుంది. ఫలితంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement