సిటీ.. పారిస్‌లా ఉంది: సందర్శకులతో సీపీ మాటామంతీ 

CP Anjani Kumar Talks With Visitors On Tank Bund On Sunday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల మధ్య ట్యాంక్‌బండ్‌ను కేవలం సందర్శకులకు మాత్రమే కేటాయించారు. ఈ విధానం అమలులోకి వచ్చిన తొలి రోజైన ఆదివారం నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి పోలీసులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన సందర్శకులతోనూ ఆయన ముచ్చటించారు. ట్యాంక్‌బండ్‌ వద్ద కొత్వాల్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఆదివారం నెలకొన్న వాతావరణం నేపథ్యంలో సిటీ పారిస్‌ నగరంలా కనిపిస్తోంది. గడిచిన ఏడేళ్ల కాలంలో నగరంలో సుందరీకరణ, మౌలిక సదుపాయాల వృద్ధి, విస్తరణకు సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులు అమలయ్యాయి. హైదరాబాద్‌కు ట్యాంక్‌బండ్‌ ఒక ల్యాండ్‌మార్క్‌ లాంటిది. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు కచ్చితంగా దీన్ని సందర్శిస్తారు.

ప్రపంచలో ప్రసిద్ధిగాంచిన నగరాలైన చికాగో, న్యూయార్క్, పారిస్‌ల్లో వాటర్‌ ఫ్రంట్‌ ఏరియాలన్నీ కేవలం సందర్శకుల కోసమే ఉంటాయి. ఈ రోజు నుంచి ట్యాంక్‌బండ్‌ వద్దా ఈ విధానం అమలుకావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్‌బండ్‌ వద్దకు విహారానికి రండి. మీ భద్రత కోసం పోలీసు విభాగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఉన్న ఏర్పాట్లను మరింత పెంచుతున్నాం’ అని అంజనీకుమార్‌ పేర్కొన్నారు. కొత్వాల్‌తో పాటు మధ్య మండల సంయుక్త పోలీసు కమిషనర్‌ విశ్వప్రసాద్, ట్రాఫిక్‌ డీసీపీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌ తదితర అధికారులూ ఉన్నారు. ఆ సమయంలో ట్యాంక్‌బండ్‌పై ఉన్న సందర్శకులతోనూ అంజనీకుమార్‌ మాట్లాడారు. ఇలా ఉన్న ట్యాంక్‌బండ్‌ను చూసి ఎలా ఫీల్‌ అవుతున్నారంటూ కొత్వాల్‌ అడగ్గా... పాండిచ్చేరిలా ఉందంటూ ఓ సందర్శకురాలు సమాధానమిచ్చారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top